Begin typing your search above and press return to search.

రచ్చరచ్చ.. పోలీసులపై గోరంట్ల మాధవ్ జులుం..

వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను నాటకీయ పరిణామాల మధ్య పోలీసులు అర్ధరాత్రి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

By:  Tupaki Desk   |   12 April 2025 11:15 AM IST
రచ్చరచ్చ.. పోలీసులపై గోరంట్ల మాధవ్ జులుం..
X

వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను నాటకీయ పరిణామాల మధ్య పోలీసులు అర్ధరాత్రి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ పై దాడి కేసులో మాధవ్ తో పాటు మరో ఐదుగురికి గుంటూరు కోర్టు న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో వారిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. గోరంట్ల మాధవ్ అరెస్టు నుంచి రిమాండ్ వరకు అనేక మలుపులు చోటు చేసుకున్నాయి.

వివరాల్లోకి వెళితే.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, పోలీసులు ఆయన్ను పోలీస్ స్టేషన్ కు తరలిస్తుండగా, మార్గమధ్యలో తన అనుచరులతో కలిసి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అడ్డుకుని దాడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఎలాగోలా చేబ్రోలు కిరణ్ ను రక్షించి, ఈ ఘటనకు సంబంధించి గోరంట్ల మాధవ్ తో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు.

అనంతరం పోలీసు కస్టడీలో ఉన్న చేబ్రోలు కిరణ్ పై దాడి కేసులో నిందితుడిగా ఉన్న గోరంట్ల మాధవ్ ను మీడియా ముందు హాజరుపరచడానికి గుంటూరు పోలీసులు ప్రయత్నించారు. అయితే మాజీ ఎంపీగా ఉన్న తనను నేరస్తుడిలా మీడియా ముందు ఎలా ప్రవేశపెడతారని గోరంట్ల మాధవ్ ప్రశ్నించారు. పోలీసులతో వాగ్వాదానికి కూడా దిగారు. ఈ కారణంగా పోలీసులు ఆయన్ను మీడియా ముందుకు తీసుకురాకుండానే వైద్య పరీక్షలు నిర్వహించి నేరుగా కోర్టుకు తరలించారు.

గుంటూరు కోర్టులో గోరంట్ల మాధవ్ ను.. చేబ్రోలు కిరణ్ పై దాడి చేసిన కేసులో పోలీసులు రిమాండ్ కోరారు. దీనిపై విచారణ జరిపిన గుంటూరు కోర్టు న్యాయమూర్తి గోరంట్ల మాధవ్ తో పాటు మరో ఐదుగురికి రెండు వారాల రిమాండ్ విధించారు. అయితే, వీరిని నెల్లూరు కోర్టుకు తరలించాలని మొదట ఆదేశించారు. కానీ, నెల్లూరు జైలులో సరైన ఏర్పాట్లు లేవని, అక్కడకు పంపితే ఇబ్బందులు తలెత్తుతాయని పోలీసులు న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో న్యాయమూర్తి తమ ఆదేశాలను మార్చి, నెల్లూరుకు బదులుగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు.

ఈ నేపథ్యంలో పోలీసులు అర్ధరాత్రి గోరంట్ల మాధవ్ తో పాటు మిగిలిన నిందితులను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ పరిణామాలన్నీ క్షణక్షణానికి మారుతూ ఉత్కంఠ రేపాయి. మధ్యలో పోలీసులతో గోరంట్ల మాధవ్ వాగ్వాదానికి దిగుతూ రచ్చ చేశారు. ఈ వీడియోలు మీడియా, సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.