వదిలేస్తానని ఎమ్మెల్యే.. వదలొద్దని జనాలు.. ఇదో చిత్రం.. !
కానీ, చివరి నిముషంలో `ఈ ఒక్కసారికి` అనే విన్నపంతో గోరంట్లకు ఛాన్స్ దక్కింది. ఇక,ఆ ఎన్నికల్లో ఆయన ఘన విజయం కూడా దక్కించుకున్నారు.
By: Tupaki Desk | 7 July 2025 8:00 AM ISTఆయన సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే. అందరికీ తెలిసిన నాయకుడే. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో తొలి విజయం అందుకున్నది కూడా ఆయనే. అయితే.. ఈ సారి ఒక్కసారితో తాను ఎమ్మెల్యేగా రిటైర్ అవుతానని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. గత ఎన్నికల సమయంలోనూ ఇదే చెప్పారు. ఆయనే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. గత ఎన్నికల సమయంలో టికెట్‌పై వివాదం ఏర్పడింది. జనసేన నుంచి ప్రస్తుత మంత్రి కందుల దుర్గేష్ రాజమండ్రి రూరల్‌పై ఆశలు పెట్టుకున్నారు. దీంతో గోరంట్లను తప్పించి ఆయనకు అవకాశం ఇస్తారన్న ప్రచారం జరిగింది.
కానీ, చివరి నిముషంలో 'ఈ ఒక్కసారికి' అనే విన్నపంతో గోరంట్లకు ఛాన్స్ దక్కింది. ఇక,ఆ ఎన్నికల్లో ఆయన ఘన విజయం కూడా దక్కించుకున్నారు. ఇంత వరకుబాగానే ఉంది. మళ్లీ వచ్చే ఎన్నికలకు నాలుగు సంవత్సరాల వరకుసమయం ఉంది. ఈ నేపథ్యంలో గోరంట్ల తప్పుకొంటే.. తాము రెడీ అంటూ.. జనసేనలోని ఓ ఇద్దరు నాయకులు పోటీలో ఉన్నారు. ఈ క్రమంలోనే వారు.. తరచుగా నియోజకవర్గంలో ఏం జరుగుతోందో చూస్తున్నారు. కట్ చేస్తే.. అసలు వచ్చే ఎన్నికల్లో పోటీలో లేనని చెబుతున్న గోరంట్లకు చిత్రమైన అనుభవం ఎదురవుతోంది.
వయసు రీత్యా గోరంట్ల సీనియర్ అయినప్పటికీ.. యాక్టివ్ పరంగా ఆయన జూనియర్ నాయకుడికంటే కూడా.. యాక్టివ్‌గానే ఉంటున్నారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడకు వెళ్తున్నారు. అక్కడి నేతలతో మాట్లాడుతున్నారు. ఇక, అధికారులను కూడా ఆయన గతానికి భిన్నంగా పనులు చేయించేలా కదిలిస్తున్నారు. ఒకప్పుడున్న దూకుడు ఇప్పుడు లేకుండా.. ఆలోచనతో పనులు చేయిస్తున్నారు. తాజాగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం కింద.. ప్రజలను పలకరిస్తున్నారు. ఇళ్లకు కూడా వెళ్తున్నారు.ఈ సమయంలోనే.. ఇక, తాను వచ్చే ఎన్నికల నాటికి రిటైర్ అవుతున్నానని చెబుతున్నారు.
కానీ, దీనిని ప్రజలు సుతరామూ ఒప్పుకోవడం లేదు. మళ్లీ మీరే కావాలి! అంటూ.. మహిళల నుంచి యువత వరకు కూడా గోరంట్లను కోరడం చిత్రంగా ఉంది. బలమైన కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న రాజమండ్రి రూరల్‌లో గోరంట్లకు ఇంత పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ.. కారణాలు ఏవైనా కూడా.. ఆయన పట్ల నియోజకవర్గంలో మాత్రం ఏమాత్రం వ్యతిరేకత లేకపోగా. మళ్లీ మీరే కావాలన్న వాదన వినిపిస్తోంది. అయితే.. బుచ్చయ్య మాత్రం ససేమిరా అంటున్నారు. చంద్రబాబుకు మాట కూడా ఇచ్చానని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి తాను రిటైర్మెంట్ తీసుకుంటాననే చెబుతున్నారు.
