టీడీపీ భీష్ముడు గోరంట్ల ఈ ఏజ్ లో వామ్మో !
నిజానికి ఆయనకు ఈ వయసులో ఇంతలా జనం మధ్యకు వచ్చి కష్టపడాల్సినది లేదు. మరీ ఆసక్తి ఉంటే ఏ రచ్చబండ వద్ద జనాలను పోగేసి తాను చెప్పాలనుకున్నది చెప్పేసి వెళ్ళిపోవచ్చు.
By: Tupaki Desk | 22 July 2025 10:00 AM ISTటీడీపీ పుట్టిన నాటి నుంచి ఆ పార్టీలో ఉన్న వారు మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఆయన ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా పనిచేశారు 2024 ఎన్నికల్లో ఆయన రాజమండ్రి రూరల్ నుంచి గెలిచి ప్రొటెం స్పీకర్ గా కూడా వ్యవహరించారు. సామాజిక సమీకరణాలు కారణంగా ఆయనకు మంత్రి పదవి దక్కలేదు కానీ ఆయనకు పార్టీలో ప్రభుత్వంలో ప్రయారిటీ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు.
ఇక ఏడాది టీడీపీ కూటమి ప్రభుత్వం పాలన మీద సుపరిపాలనలో తొలి అడుగు అన్న కార్యక్రమం టీడీపీ చేపట్టింది. ప్రతీ ఇంటీ గడప ఎమ్మెల్యేలు టచ్ చేసి ప్రభుత్వం చేసిన మంచిని వివరించాలని కోరింది. అయితే ఈ కార్యక్రమాన్ని గోరంట్ల సీరియస్ గానే తీసుకున్నారు. ఆయన ఎండలో సైతం వడివడిగా అడుగులు వేస్తూ జనాలను కలుస్తున్నారు. రైతుల కోసం పొలం గట్ల వద్దకే వెళ్తున్నారు.
అలా ప్రతీ గ్రామం లోను ఆయన పర్యటిస్తున్నారు. ఎనభై ఏళ్ళ వయసులో కూడా ఎటువంటి సపోర్టు లేకుండా స్పీడ్ గా ఆయన అడుగులు వేస్తూ అందరితోనూ కలివిడిగా సాగుతున్న వైనం చూసిన వారు వామ్మో అనుకోవాల్సి వస్తోంది. అందరి యోగ క్షేమాలు తెలుసుకుంటూ ప్రభుత్వం వారికి చేసే మంచి గురించి వివరిస్తూ ఒక పెద్దాయన గోరంట్ల వ్యవహరిస్తున్న తీరు అందరినీ అబ్బురపరుస్తుంది.
నిజానికి ఆయనకు ఈ వయసులో ఇంతలా జనం మధ్యకు వచ్చి కష్టపడాల్సినది లేదు. మరీ ఆసక్తి ఉంటే ఏ రచ్చబండ వద్ద జనాలను పోగేసి తాను చెప్పాలనుకున్నది చెప్పేసి వెళ్ళిపోవచ్చు. కానీ గోరంట్ల మాత్రం అలా కాదు, తానే జనం వద్దకు వెళ్ళాలని అనుకున్నారు. ఆయన పట్టుదలే ఇపుడు రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో చర్చగా మారింది.
ఈ పెద్దాయన ఇంతలా కష్టపడుతూ మా వద్దకు వస్తున్నారే అని జనాలు కూడా ఆయనకు నీరాజనాలు పడుతున్నారు. రాజమండ్రి రూరల్ లో గోరంట్లకు మంచి పట్టు ఉంది. ఆయన ప్రతీ గడపకూ పరిచయం పెంచుకున్నారు. అందుకే అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు.
ఒక కుటుంబ పెద్దగా వారి మంచీ చెడ్డా తెలుసుకోవడంతోనే ప్రజలు కూడా మా ఎమ్మెల్యే మంచి వారు మా మంచి నాయకుడు అని చెబుతూ ఉంటారు. ఇదిలా ఉంటే గోరంట్ల 2024లో పోటీతో ఈసారితో సరి అని అంటారని అంతా అనుకున్నారు. ఆయన కూడా దాదాపుగా చివరి ఎన్నికలు అని కూడా ఒక దశలో చెప్పినట్లుగా సన్నిహితులు అంటారు.
కానీ ఇపుడు జనంలోకి వచ్చి ఇంతలా పర్యటనలు చేస్తున్న తీరు చూస్తే మరో చాన్స్ కోసం ఆయన చూస్తున్నారు అని అంటున్నారు. 2029లో కూడా ఇదే కూటమి అధికారంలోకి వస్తుందని ఆయన బలంగా నమ్ముతున్నారు పైగా నియోజకవర్గాల పునర్ విభజనలో రాజమండ్రి రూరల్ తనకు మళ్ళీ దక్కుతుందని ఆయన భావిస్తున్నారు అని అంటున్నారుట. దాంతో 2029లో కూడా మళ్ళీ పోటీ చేయాలని ఆయన కోరుకుంటున్నారు అని ప్రచారం సాగుతోంది. మొత్తానికి రాజకీయ భీష్మాచార్యుడు నాటౌట్ అని అంటున్నారు.
