బహ్రెయిన్‌లో చిక్కుకున్న కేరళవాసికి విముక్తి.. 42 ఏళ్ల తర్వాత కన్న కొడుకును చూసుకున్న తల్లి
జీవితాన్ని వెతుక్కుంటూ 1983లో బహ్రెయిన్ వెళ్లిన కేరళకు చెందిన గోపాలన్ కు ఊహించని కష్టం ఎదురైంది.
By: Tupaki Desk | 24 April 2025 12:06 PM ISTజీవితాన్ని వెతుక్కుంటూ 1983లో బహ్రెయిన్ వెళ్లిన కేరళకు చెందిన గోపాలన్ కు ఊహించని కష్టం ఎదురైంది. అక్కడ ఆశ్రయం ఇచ్చిన యజమాని చనిపోవడంతో ఆయన పాస్‌పోర్ట్ కూడా పోయింది. దీంతో దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆయన బహ్రెయిన్‌లోనే చిక్కుకుపోయారు. అయితే, 'ప్రవాసీ లీగల్' అనే సంస్థ సాయంతో ఆయన ఎట్టకేలకు ఆయన తన స్వదేశానికి తిరిగి రాగలిగారు. దీంతో 42 ఏళ్లుగా తన కొడుకు కోసం ఎదురుచూస్తున్న 95 ఏళ్ల తల్లి కళ్లలో ఆనందం నిండింది.
కేరళలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన గోపాలన్ చంద్రన్ మంచి జీవనోపాధి కోసం 42 ఏళ్ల క్రితం బహ్రెయిన్ వెళ్లారు. అక్కడ ఓ యజమాని వద్ద పనిచేస్తూ కొంతకాలం సంతోషంగానే ఉన్నారు. కానీ, విధి వక్రించడంతో ఆయనకు ఆశ్రయం ఇచ్చిన యజమాని అనారోగ్యంతో మరణించారు. ఆ సమయంలో చంద్రన్ తన పాస్‌పోర్ట్‌ను కూడా పోగొట్టుకున్నారు. దీంతో ఆయనకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. పాస్‌పోర్ట్ లేకపోవడంతో స్వదేశానికి తిరిగి రాలేక, బహ్రెయిన్‌లో ఉండలేక నానా ఇబ్బందులుపడ్డాడు.
గత కొన్నేళ్లుగా చంద్రన్ బహ్రెయిన్‌లో ఒంటరిగా, నిస్సహాయంగా జీవిస్తున్నారు. ఆయన దుస్థితి 'ప్రవాసీ లీగల్' అనే స్వచ్ఛంద సంస్థకు తెలియడంతో వారు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఈ సంస్థ బహ్రెయిన్‌లోని భారతీయ ఎంబసీతో సంప్రదించి చంద్రన్‌కు కొత్త పాస్‌పోర్ట్, ఇతర ప్రయాణ ఏర్పాట్లు చేసింది. ఎట్టకేలకు 42 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. చంద్రన్ క్షేమంగా తన స్వదేశానికి చేరుకున్నారు.
40ఏళ్ల తర్వాత తన కొడుకును చూసిన 95 ఏళ్ల తల్లి ఆనందానికి అవధుల్లేవు. కళ్లనిండా నీళ్లతో కొడుకును హత్తుకుని ఆమె ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. చంద్రన్ తిరిగి రావడంతో ఆయన స్వగ్రామంలో సంబరాలు చేసుకంటున్నారు. ఇన్నేళ్ల తర్వాత తమ వాడిని చూసిన గ్రామస్తులు ఆనందంతో మునిగిపోయారు.
