Begin typing your search above and press return to search.

గ్రేట్ విశాఖ.. దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్, రూ.51 వేల కోట్ల పెట్టుబడి

పెట్టుబడుల ఆకర్షణలో విశాఖ నగరం దూసుకుపోతోంది. దేశంలో సురక్షిత నగరాల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్న గ్రేటర్ విశాఖపట్నం.. ఇప్పుడు ఐటీ, డేటా సిటీ నగరంగా రూపాంతరం చెందుతోంది.

By:  Tupaki Desk   |   29 Aug 2025 11:36 AM IST
గ్రేట్ విశాఖ.. దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్, రూ.51 వేల కోట్ల పెట్టుబడి
X

పెట్టుబడుల ఆకర్షణలో విశాఖ నగరం దూసుకుపోతోంది. దేశంలో సురక్షిత నగరాల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్న గ్రేటర్ విశాఖపట్నం.. ఇప్పుడు ఐటీ, డేటా సిటీ నగరంగా రూపాంతరం చెందుతోంది. తాజాగా రూ.51 వేల కోట్ల పెట్టుబడితో దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ నిర్మించేందుకు ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ ముందుకొచ్చింది. ఒక గిగావాట్ సామర్థ్యంతో విశాఖలో డేటా సెంటర్ నిర్మాణానికి గూగుల్ ప్రయత్నాలు ప్రారంభించినట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ఇది దక్షిణ ఆసియాలోనే అతిపెద్దదిగా చెబుతుండగా, ప్రస్తుతం ముంబైలో ఉన్న గూగుల్ డేటా సెంటర్ కు రెండింతలు పెద్దదని అంటున్నారు.

విశాఖలోని మధురవాడలో గూగుల్ డేటాసెంటర్ నిర్మాణానికి 250 ఎకరాల భూములను ప్రభుత్వం కేటాయించనుందని చెబుతున్నారు. దీంతో సుమారు 25 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంటున్నారు. విశాఖలో గూగుల్ తోపాటు అదానీ, సిఫీ టెక్నాలజీస్ కూడా డేటా సెంటర్లు నిర్మాణానికి గతంలో ఒప్పందాలు చేసుకున్నాయి. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగానే విశాఖలో డేటా సెంటర్ నిర్మాణానికి అదానీ గ్రూపు ఒప్పందం చేసుకుంది.

రూ.70 వేల కోట్లతో డేటా సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేసింది. అయితే ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని రద్దు చేయడంతో డేటా సెంటర్ నిర్మాణం నిలిచిపోయింది. అయితే రూ.14,634 కోట్లతో అదానీ సంస్థతో నాటి ప్రభుత్వం మరో ఒప్పందం కుదుర్చుకోవడంతో అదానీ డేటా సెంటర్ పై ఆశలు చిగురించాయి. అయితే వైసీపీ ప్రభుత్వ నిర్వాకం వల్ల ఆ ఐదేళ్లు అదానీ డేటా సెంటర్ నిర్మాణానికి ముందడుగు వేయలేదని కూటమి ప్రభుత్వ పెద్దలు విమర్శలు గుప్పిస్తున్నారు.

అదానీ సంస్థ రూ.14,634 కోట్లతో ఒప్పందం చేసుకున్నా, నిర్మాణం ప్రారంభించలేదు. అలా అని ప్రస్తుత ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని రద్దు చేయలేదు. దీంతో అదానీ సంస్థ డేటా సెంటర్ నిర్మాణ పనులను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక నెల రోజుల క్రితం రూ,16,466 కోట్లతో సిఫీ టెక్నాలజీస్ తో ప్రస్తుత ప్రభుత్వం మరో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ తొలిదశలో రూ.1,466 కోట్లతో డేటా సెంటర్ కార్యకలాపాలు ప్రారంభించి 600 మందికి ఉపాధి కల్పించనుంది.

ఇక విశాఖలో గూగుల్ ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్ పూర్తిగా గ్రీన్ ఎనర్జీతో వినియోగంలోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు ప్రకటించింది. సోలార్, విండ్ ఎనర్జీ మాత్రమే వినియోగించి ఈ సెంటర్ నిర్వహించాలని గూగుల్ నిర్ణయించుకుంది. మూడు సముద్రపు కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ల ద్వారా విశాఖ నగరంలో ఈ కేంద్రం ఏర్పాటు కానుంది. ముంబైకి రెండు రెట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ నిర్వహించనున్నట్లు గూగుల్ వెల్లడించింది.

హైదరాబాద్ హైటెక్ సిటీ తరహాలో విశాఖలో మధురవాడ దగ్గర 500 ఎకరాల్లో డేటా సిటీని స్థాపించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. హౌసింగ్ డేటా సెంటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ ఏర్పాటుకు చోటు కల్పించింది. డీప్ టెక్నాలజీ, బిగ్ డేటా, ఏఐ రంగాల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్న ప్రభుత్వం... రాష్ట్ర యువత ఆ అవకాశాలు అందిపుచ్చుకునేలా విశాఖ డేటా సిటీపై ఫోకస్ చేస్తోంది.