Begin typing your search above and press return to search.

ఆఫీసుకొస్తారా? ఉద్యోగం వదిలేస్తారా? గూగుల్ హుకూం

టెక్ దిగ్గజం గూగుల్ తన కంపెనీలో రిమోట్‌గా పనిచేస్తున్న ఉద్యోగులకు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది.

By:  Tupaki Desk   |   25 April 2025 12:00 AM IST
Google Issues Strict Return to Office Policy for Remote Workers
X

టెక్ దిగ్గజం గూగుల్ తన కంపెనీలో రిమోట్‌గా పనిచేస్తున్న ఉద్యోగులకు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది. ఆఫీసుకు తిరిగి రావాలని, లేనిపక్షంలో ఉద్యోగాలు కోల్పోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కృత్రిమ మేధస్సు (AI)పై భారీగా పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో ఇతరత్రా ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగా గూగుల్ ఈ 'రిటర్న్ టు ఆఫీస్' కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలుస్తోంది.

గూగుల్ గతంలోనే ఉద్యోగులు వారంలో మూడు రోజులు ఆఫీసు నుండి పనిచేయాలని స్పష్టం చేసింది. అయితే, కొన్ని ప్రత్యేక కారణాల వల్ల కొంతమంది ఉద్యోగులకు శాశ్వత వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యాన్ని కల్పించింది. ఇప్పుడు, ఈ ఉద్యోగులను సైతం హైబ్రిడ్ మోడల్‌కు మారమని లేదా ఉద్యోగాలు వదిలి వెళ్ళడానికి సిద్ధంగా ఉండమని కోరింది. స్వచ్ఛందంగా నిష్క్రమించేవారికి వాలంటరీ ఎగ్జిట్ ప్యాకేజీలను కూడా అందిస్తున్నట్లు సమాచారం.

తాజా ఆదేశాలను ముఖ్యంగా టెక్నికల్ సర్వీసెస్, పీపుల్ ఆపరేషన్స్ విభాగాల ఉద్యోగులకు గూగుల్ తెలియజేసింది. వీరు హైబ్రిడ్ మోడల్‌ను ఎంచుకోవాలని లేదా ఆఫీసుకు దగ్గరగా మారడానికి వన్‌టైమ్ రీలోకేషన్ ప్యాకేజీని పొందాలని సూచించింది. ఆఫీసుకు 50 మైళ్ళకు పైగా దూరంలో నివసించేవారు జూన్ నుండి ఈ మార్గదర్శకాలను పాటించాలని ఆదేశాలు వెలువడ్డాయి. అయితే, ఈ మార్గదర్శకాలు అందరు రిమోట్ ఉద్యోగులకు వర్తించవని ఒక ఉద్యోగి వెల్లడించినట్లు కథనాలు పేర్కొన్నాయి.

కంపెనీ AIలో భారీగా పెట్టుబడులు పెడుతూ, గణనీయమైన పునర్వ్యవస్థీకరణలో ఉంది. 2023లో వివిధ దశల్లో గూగుల్ ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. నివేదికల ప్రకారం, 2024 చివరి నాటికి గూగుల్‌లో 1,83,000 మంది ఉద్యోగులు ఉన్నారు.

ఈ నిర్ణయంపై గూగుల్ ఉద్యోగుల నుండి భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆఫీసు వాతావరణాన్ని స్వాగతిస్తుంటే, మరికొందరు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌలభ్యాన్ని కోల్పోతున్నందుకు ఆందోళన చెందుతున్నారు.