Begin typing your search above and press return to search.

వాహనం వెతక్కోడమూ సులువే

మెట్రో సిటీలు, ఇతర పెద్ద పెద్ద పట్టణాల్లో వాహనాల పార్కింగ్ సమస్య ప్రతిరోజూ ఎదురవుతోంది.

By:  Tupaki Desk   |   20 Aug 2025 10:21 AM IST
వాహనం వెతక్కోడమూ సులువే
X

మెట్రో సిటీలు, ఇతర పెద్ద పెద్ద పట్టణాల్లో వాహనాల పార్కింగ్ సమస్య ప్రతిరోజూ ఎదురవుతోంది. షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లు, సినిమా థియేటర్లు, మెట్రో స్టేషన్లు వంటి రద్దీ ప్రదేశాల్లో వాహనాలను ఎక్కడ పార్క్ చేశామో మరిచిపోవడం సాధారణమైంది. ఒకే తరహా వాహనాలు ఎక్కువగా ఉండటంతో మన వాహనం గుర్తించడం కష్టమవుతోంది. చాలా సార్లు వాహన యజమానులు గంటల తరబడి వెతకాల్సి వస్తుంది.

పార్కింగ్ సమస్యలు ఇలా

ఒక కుటుంబం కారును మాల్‌లో పార్క్ చేసి షాపింగ్‌కు వెళ్లింది. తిరిగి వచ్చేసరికి వాహనం ఎక్కడ ఉందో తెలియక సెక్యూరిటీ సిబ్బందిని అడిగినా సరైన సమాధానం రాలేదు. చివరికి గంటకు పైగా వెతికిన తర్వాత మాత్రమే కారును కనుగొన్నారు.

మరో వ్యక్తి సూపర్ మార్కెట్‌కి వెళ్లి బైక్ పార్క్ చేశాడు. సెక్యూరిటీ సూచన మేరకు హ్యాండిల్ లాక్ పెట్టకుండా వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి తన వాహనం ఏది అని గుర్తించడం కష్టమైంది. చివరకు నంబరు ఆధారంగా గుర్తించడానికి అరగంటకుపైగా పట్టింది.

గూగుల్ పరిష్కారం

ఇలాంటి ఇబ్బందులను తగ్గించేందుకు గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. “సేవ్ యువర్ పార్కింగ్ లొకేషన్” అనే ఈ సౌకర్యం ద్వారా వాహనం ఎక్కడ నిలిపారో యాప్ సులభంగా గుర్తుచేస్తుంది. వాహనం కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా నేరుగా ఆ ప్రదేశానికి మార్గనిర్దేశం చేస్తుంది.

ఉపయోగించే విధానం

ముందుగా గూగుల్ మ్యాప్స్ యాప్‌ను ఓపెన్ చేసి ప్రస్తుత లొకేషన్‌ యాక్సెస్‌ ఇవ్వాలి.

మ్యాప్‌లో కనిపించే బ్లూ కలర్ డాట్‌పై క్లిక్ చేయాలి.

అప్పుడు వచ్చే ఆప్షన్లలో సేవ్ పార్కింగ్ లొకేషన్‌ను ఎంచుకోవాలి.

దీంతో మీరు పార్క్ చేసిన ప్రదేశం యాప్‌లో ఆటోమేటిక్‌గా సేవ్ అవుతుంది.

తిరిగి వెతికే విధానం

వాహనం ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి యాప్ ఓపెన్ చేసి మీ ప్రస్తుత లొకేషన్‌పై క్లిక్ చేయాలి.

సేవ్ పార్కింగ్ ఆప్షన్‌ను ఎంచుకున్న తర్వాత మ్యాప్‌లో వాహనం నిలిపిన ప్రదేశం చూపిస్తుంది.

దానిపై క్లిక్ చేస్తే ఆ ప్రదేశానికి నావిగేట్ చేసే మార్గాన్ని చూపిస్తుంది.

అదనపు ఉపయోగాలు

ఈ ఫీచర్ వాహనం కోసం మాత్రమే కాకుండా, మీరు ఎక్కడికైనా వెళ్లి తిరిగి ఆ ప్రదేశాన్ని గుర్తించాలనుకున్నా ఉపయోగపడుతుంది. పర్యాటక ప్రాంతాలు, కొత్త నగరాలు లేదా అపరిచిత ప్రదేశాల్లో తిరిగేటప్పుడు ఈ సౌకర్యం బాగా ఉపయోగపడనుంది.