కొలువుల కోత.. బెంగళూరు, హైదరాబాద్ క్యాంపస్ లోకు గూగుల్ షాక్?
ఇటీవల గూగుల్ ప్లాట్‌ఫామ్స్ అండ్ డివైజెస్ విభాగంలో జరిగిన పునర్వ్యవస్థీకరణ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే వందలాది మంది ఉద్యోగులను తొలగించారు.
By: Tupaki Desk | 20 April 2025 1:00 AM ISTభారత్‌లో గూగుల్ ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమవుతోందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ప్రకటనలు, సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగాల్లో పనిచేస్తున్న వారికి లేఆఫ్స్ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. గూగుల్ ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించనప్పటికీ, వచ్చే వారం నుంచి తొలగింపు ప్రక్రియ ప్రారంభం కానుందని బిజినెస్ స్టాండర్డ్ అంచనా వేసింది.
ఇటీవల గూగుల్ ప్లాట్‌ఫామ్స్ అండ్ డివైజెస్ విభాగంలో జరిగిన పునర్వ్యవస్థీకరణ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే వందలాది మంది ఉద్యోగులను తొలగించారు. ఆండ్రాయిడ్, పిక్సెల్ స్మార్ట్‌ఫోన్లు, క్రోమ్ బ్రౌజర్ వంటి కీలక ఉత్పత్తులను ఈ విభాగం పర్యవేక్షిస్తుంది. అభివృద్ధి చెందుతున్న వ్యాపార అవసరాలకు అనుగుణంగా సంస్థ తన కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి ప్రయత్నిస్తున్నందున, నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
అయితే, ఇంజినీరింగ్ ఉద్యోగుల విషయంలో గూగుల్ కాస్త సానుకూలంగా వ్యవహరించే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. హైదరాబాద్, బెంగళూరులోని టెక్నికల్ పొజిషన్లలో ఉన్న ఉద్యోగులను నేరుగా తొలగించే బదులు, వారిని లాభదాయకమైన ఇతర ప్రాజెక్టుల్లోకి బదిలీ చేసే అవకాశం ఉంది.
గత సంవత్సరం గూగుల్ తన ప్లాట్‌ఫామ్స్, డివైజెస్ బృందాలను విలీనం చేసింది. ఈ విలీనం తర్వాత ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు స్వచ్ఛంద విరమణ పథకాలను కూడా ప్రవేశపెట్టింది. ఈ ఏడాది ప్రారంభంలో ఒక గూగుల్ ప్రతినిధి మాట్లాడుతూ విలీనం తర్వాత ఉద్యోగుల క్రమబద్ధీకరణలో భాగంగా కొన్ని తొలగింపులు జరిగాయని అంగీకరించారు. అంతేకాకుండా, జనవరిలో తమ ఉద్యోగులకు స్వచ్ఛందంగా నిష్క్రమించడానికి కొన్ని ఆఫర్లు ఇచ్చినట్లు గూగుల్ ధ్రువీకరించింది.
తాజాగా వస్తున్న ఈ వార్తలు బెంగళూరు, హైదరాబాద్‌లోని ఉద్యోగుల్లో తీవ్రమైన ఆందోళనను కలిగిస్తున్నాయి. ఒకవైపు కంపెనీ పునర్వ్యవస్థీకరణ చర్యలు, మరోవైపు తొలగింపుల భయంతో వారు భవిష్యత్తుపై దిగులు చెందుతున్నారు. గూగుల్ ఈ పరిస్థితిని ఎలా చక్కదిద్దుతుందో చూడాలి.
