అమరావతికి గూగుల్ కళ
అయితే.. గూగుల్ ఇక్కడ ఏ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తుందన్న అంశం మీద స్పష్టత లేదు.
By: Tupaki Desk | 7 Jun 2025 11:20 AM ISTప్రపంచ దిగ్గజ సంస్థల్లో ఒకటైన గూగుల్ అమరావతిలో తన సంస్థను ఏర్పాటు చేయాలని భావిస్తుందా? అంటే.. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. గూగుల్ ప్రతినిధులు కొందరు ఏపీ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఏపీ రాజధాని అమరావతికి దిగ్గజ సంస్థల్ని తీసుకురావటం ద్వారా.. రాజధానికి కొత్త కళను తీసుకోవటంతో పాటు.. మరిన్ని సంస్థలు ఆ వైపు చూసేలా చేయాలన్నది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన.
ఇందులో భాగంగా గూగుల్ సంస్థకు చెందిన ప్రతినిధులు తాజాగా అమరావతికి రావటం.. అక్కడి పరిస్థితుల్ని అంచనా వేయటం కోసం.. క్షేత్రస్థాయిలో పర్యటించటం ఆసక్తికరంగా మారింది. అనంతవరం.. నెక్కల్లు మధ్యలోని రోడ్డు పక్కన ఉన్న ఐదు సర్వే నెంబర్లకు సంబంధించి 143 ఎకరాల భూమి ఉంది. దీన్ని గూగుల్ కు కేటాయించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉంది.
అయితే.. గూగుల్ ఇక్కడ ఏ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తుందన్న అంశం మీద స్పష్టత లేదు. అయితే.. ఒక ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును అమరావతిలో ఏర్పాటు చేస్తారన్న అంచనాతో ఉన్నారు. తాజాగా గూగుల్ సంస్థ ప్రతినిధులు.. సీఆర్డీఏ అధికారులతో కలిసి ప్రభుత్వం కేటాయిస్తామన్న స్థలాన్ని పరిశీలించారు. ఈ స్థలానికి దగ్గర్లోనే ఎయిర్ పోర్టు.. రైల్వే స్టేషన్ కూడా వస్తున్న విషయాన్ని అధికారులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఈ స్థలం మీద గూగుల్ ప్రతినిధులు ఆసక్తి చూపినట్లుగా తెలుస్తోంది.
ఇప్పుడు భూమిని చూసినా.. దానికి సంబంధించిన ఏర్పాట్లు మొత్తం పూర్తి కావటానికి పదేళ్లకు పైనే పడుతుందని చెబుతున్నారు. ఎందుకంటే.. మౌలిక వసతులు.. ఇతర అంశాలు కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే.. ఇప్పుడు చూసిన స్థలానికి కనుచూపు మేర ఎలాంటి భవనాలు లేకపోవటమే. అయితే.. గూగుల్ లాంటి దిగ్గజ సంస్థలు భవిష్యత్తులో తాము చేపట్టే ప్రాజెక్టులకు సంబంధించి అనువైన స్థలాల్ని చూడటం మామూలే.
పదేళ్లు ముందుగా తాము చేపట్టే ప్రాజెక్టులకు సంబంధించిన పనుల్ని ఇప్పుడు చేస్తుంటారు. మొత్తంగా గూగుల్ కానీ అమరావతిలో తమ సంస్థను ఏర్పాటు చేయటానికి సుముఖత వ్యక్తం చేస్తూ.. అధికారిక ప్రకటన చేస్తే మాత్రం మరిన్ని సంస్థలు అమరావతి వైపు చూస్తాయని మాత్రం చెప్పక తప్పదు. మరి.. అమరావతికి గూగుల్ కళ ఉంటుందా? లేదా? అన్నది కాలమే డిసైడ్ చేయాలి.
