గూగుల్ కోసం వాలంటరీగా భూములు ఇచ్చేస్తున్నారట
భూములు ఇస్తున్న వారికి ప్రభుత్వం తాజాగాపెంచిన ప్రయోజనాలపట్ల అక్కడి రైతులు సానుకూలంగా ఉన్నారు.
By: Garuda Media | 21 Nov 2025 9:49 AM ISTఏపీ భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తుందని భావిస్తున్న గూగుల్ డేటా సెంటర్ ను విశాఖలో ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన భూసేకరణ ఇప్పుడు మహా జోరుగా సాగుతోంది. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలంలోని తర్లువాడలో భూసేకరణ ప్రక్రియ వేగంగా జరుగుతుంది. దీనికి కారణం ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానమే.అక్కడి భూముల రిజిస్ట్రేషన్ విలువను ఎకరానికి రూ.20 లక్షలకు పెంచిన నేపథ్యంలోరైతులు తమకు తాముగా భూముల్ని ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు.
ఆసక్తికరమైన అంశం ఏమంటే ఇప్పటికే 60 శాతం మందికి పైగా రైతులు గూగుల్ కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణకు అనుకూలంగా తమ అంగీకార పత్రాల్ని అందజేయటం విశేషం. భూములు ఇస్తున్న వారికి ప్రభుత్వం తాజాగాపెంచిన ప్రయోజనాలపట్ల అక్కడి రైతులు సానుకూలంగా ఉన్నారు.గూగుల్ డేటా సెంటర్ కోసం ఏపీ ప్రభుత్వం ఆ సంస్థకు 308.65 ఎకరాల్ని కేటాయిస్తున్న సంగతి తెలిసిందే.
ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్కు పేరుతో భూముల్ని సేకరించి గూగుల్ కు కేటాయిస్తున్నారు. ఇందులో 204 ఎకరాల వరకు డీపట్టా.. శివాయ్ జమేదార్.. రికార్డుల్లోకి ఎక్కని శివాయ్ జమేదార్ భూములు ఉన్నాయి. భూముల విలువ పెంపులో వచ్చిన మార్పు రైతులు తమ భూముల్ని ఆనందంగా ఇచ్చేందుకు ముందుకు రావటం ఆసక్తికరంగా మారింది.
డీ పట్టా భూములకు ఎకరానికి రూ.17 లక్షలు.. రికార్డుల్లోకి ఎక్కని శివాయ్ జమేదార్ భూములకు ఎకరం రూ.8.5 లక్షలుగా తొలుత నిర్ణనయించారు. తాజాగా డీపట్టా భూముల రిజిస్ట్రేషన్ విలువ ఎకరానికి రూ.20 లక్షలు..రికార్డుల్లో ఎక్కని శివాయ్ జమేదార్ భూములకు ఎకరానికి రూ.10 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వటం సానుకూల అంశంగా మారింది.
తమ భూమికి డబ్బులతో పాటు.. ఎకరానికి 20 సెంట్లు (సెంటు అంటే 48 గజాలు) చొప్పున తర్లువాడ సమీపంలో భూములు కేటాయించాలని రైతులు కోరటం.. అందుకు ప్రభుత్వం ఓకే చెప్పటంతో రైతులుమరింత ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. దీని ప్రకారం.. ఎకరం భూమి ఇచ్చిన రైతుకు 80సెంట్లకు పరిహారం.. 20 సెంట్ల భూమిని కేటాయిస్తారు.
అయితే.. కొందరు రైతుల్ని తప్పుదారి పట్టేలా ప్రచారం చేపట్టటంతో.. ప్రభుత్వ వర్గాలు అప్రమత్తంగా ఉంటూ తప్పుడు ప్రచారం చేసే వారి విషయంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చురుకైన పాత్రను పోషిస్తున్నట్లుగా చెబుతున్నారు.
