Begin typing your search above and press return to search.

గోండుల కోటలో అక్కాచెల్లెళ్ల ఢీ.. గెలుపు ఎవరిది?

నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు కూడా సరస్వతి అయితేనే కోవా లక్ష్మికి సరైన ప్రత్యర్థి అవుతారని భావిస్తున్నారు.

By:  Tupaki Desk   |   28 Aug 2023 4:41 AM GMT
గోండుల కోటలో అక్కాచెల్లెళ్ల ఢీ.. గెలుపు ఎవరిది?
X

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తి రేపుతున్నాయి. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ తమ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. మరికొద్ది రోజుల్లో కాంగ్రెస్, బీజేపీ కూడా తమ జాబితాలను ప్రకటించనున్నాయి.

కాగా ఈసారి కొన్ని నియోజకవర్గాల్లో రక్త సంబంధీకులు అంటే అన్నాచెల్లెళ్లు, అన్నాతమ్ముళ్లు, అక్కాచెల్లెళ్లు ఇలా పోటీ తప్పకపోవచ్చని తెలుస్తోంది. ముఖ్యంగా గోండుల కోట.. అసిఫాబాద్‌ నియోజకవర్గంలో అక్కాచెల్లెళ్ల పోరు ఉంటుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో అసిఫాబాద్‌ నియోజకవర్గం సర్వత్రా ఆసక్తిని రేపుతోంది.

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఉన్న అసిఫాబాద్‌ ఎస్టీ రిజర్వుడ్‌ నియోజకవర్గం. ప్రస్తుతం ఈ నియోజకవర్గం కుమురుం భీమ్‌ జిల్లాలో ఉంది. ప్రస్తుతం అసిఫాబాద్‌ ఎమ్మెల్యేగా ఆత్రం సక్కు ఉన్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున గెలుపొందిన సక్కు ఆ తర్వాత బీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు.

కాగా ఇటీవల కేసీఆర్‌ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఆత్రం సక్కుకు సీటు లభించలేదు. మాజీ ఎమ్మెల్యే కోవా లక్ష్మికి కేసీఆర్‌ సీటు కేటాయించారు. ఆత్రం సక్కును ఆదిలాబాద్‌ ఎంపీ స్థానం నుంచి బరిలోకి దింపడానికే కేసీఆర్‌ ఆయనకు సీటు కేటాయించలేదని వార్తలు వచ్చాయి.

అయితే కేసీఆర్‌ నిర్ణయంపై ఆత్రం సక్కు సంతృప్తిగా లేరని అంటున్నారు. కాగా బీఆర్‌ఎస్‌ టికెట్‌ దక్కించుకున్న కోవా లక్ష్మి 2014లో తొలిసారి ఆ పార్టీ తరఫున ఆసిఫాబాద్‌ లో గెలుపొందారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఆత్రం సక్కు చేతిలో కోవా లక్ష్మి ఓడిపోయారు. అయితే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో జెడ్పీటీసీగా గెలుపొంది ఆసిఫాబాద్‌ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టారు.

మరోవైపు గత ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌ పార్టీ వచ్చే ఎన్నికల్లోనూ అసిఫాబాద్‌ లో గెలుపొందడానికి ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో కోవా లక్ష్మి మీద ఆమె సొంత చెల్లెలినే బరిలో దించే ఆలోచన చేస్తోంది. ఆసిఫాబాద్‌ సర్పంచ్‌ గా పనిచేసిన మర్సకోల సరస్వతిని అభ్యర్థిగా నిలపాలని భావిస్తోంది. ఇప్పటికే ఆమె కాంగ్రెస్‌ నుంచి పోటీ చేయడానికి దరఖాస్తు చేసుకున్నారు. నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు కూడా సరస్వతి అయితేనే కోవా లక్ష్మికి సరైన ప్రత్యర్థి అవుతారని భావిస్తున్నారు.

కోవా లక్ష్మి ఒకసారి ఎమ్మెల్యేగా, ప్రస్తుతం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ గా ఉండటంతో ప్రజల్లో వ్యతిరేకత ఉందని టాక్‌ నడుస్తోంది. ఈ నేపథ్యంలో అక్క మీద ఉన్న వ్యతిరేకతే తనకు అనుకూలంగా మారుతుందని సరస్వతి భావిస్తున్నారని తెలుస్తోంది. దీంతో తన గెలుపు ఖాయమనే ధీమాలో ఉన్నారు.

కాగా సరస్వతి గతంలో ఒకసారి తెలుగు దేశం అభ్యర్థిగా పోటీ చేసి అసిఫాబాద్‌ లో ఓటమి చెందారు. మరోవైపు ప్రజల్లో పలుకుబడి లేని చెల్లెలు తనకు పోటీయే కాదంటున్నారు కోవా లక్ష్మి. తాను సులువుగా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసిఫాబాద్‌లో అక్కాచెల్లెలి పోరాటం ఆసక్తి రేపుతోంది.