Begin typing your search above and press return to search.

పేట లో ఆయన ఫేట్ మారుతుందా ?

ఉమ్మడి విశాఖ జిల్లా పాయకరావుపేటలో వైసీపీకి సరైన నాయకత్వం లేదన్న ఆందోళన అయితే క్యాడర్ లో ఉంది.

By:  Satya P   |   2 Jun 2026 9:07 AM IST
పేట లో ఆయన ఫేట్ మారుతుందా ?
X

ఉమ్మడి విశాఖ జిల్లా పాయకరావుపేటలో వైసీపీకి సరైన నాయకత్వం లేదన్న ఆందోళన అయితే క్యాడర్ లో ఉంది. 2009 ఎన్నికల వరకూ పాయకరావుపేట టీడీపీకి కంచుకోట. అయితే ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసిన గొల్ల బాబూరావు 2009 ఎన్నికల్లో తొలిసారి గెలిచారు. అలా దశాబ్దాల తరువాత కాంగ్రెస్ జెండా పాయకరావుపేటలో ఎగరేశారు. ఆ తరువాత వైఎస్సార్ మరణంతో వైసీపీలో చేరిన ఆయన 2012 లో వచ్చిన ఉప ఎన్నికల్లో మరోసారి గెలిచారు. 2014లో ఓటమి పాలు అయినా 2019 లో మళ్ళీ గెలిచారు. ఇలా మూడు సార్లు గెలిచి బలమైన నేతగా ఉన్న గొల్ల బాబూరావుకు 2024 ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. ఆయన్ని రాజ్యసభకు పంపించి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని రాజాం సిట్టింగ్ ఎమ్మెల్యే కంబాల జోగులుకు చివరి నిముషంలో టికెట్ ఇచ్చారు. జిల్లాలను దాటుకుని ఆయన వచ్చి పోటీ చేయడం క్యాడర్ సహకరించకపోవడం, కూటమి ప్రభంజనంతో జోగులు ఓటమి పాలు అయ్యారు.

ఇంచార్జిగా ఆయనేనా :

అయితే వైసీపీ ఓటమి చెంది రెండేళ్ళు గడచింది. పాయకరావుపేటలో కంబాల జోగులునే ఇంచార్జిగా కొనసాగిస్తున్నారు. ఇక వైసీపీలో వర్గ పోరు ఉంది. రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావుకు పార్టీలో పట్టుంది. అలాగే ఆయనకు వ్యతిరేక వర్గం ఉంది ఆ వ్యతిరేక వర్గం మద్దతు కూడా జోగులు వైపు లేదు. ఆయన వద్దు స్థానికుడికి ఇంచార్జి బాధ్యతలు అప్పగించాలని వైసీపీ నేతలు కోరుతున్నారు. అధినాయకత్వం మాత్రం ఈ విషయంలో ఏమీ నిర్ణయం తీసుకోవడం లేదని అంటున్నారు.

కుమారుడి కోసం :

మరో వైపు చూస్తే తన కుమారుడికి రాజకీయంగా అవకాశం కోరుతున్నారు గొల్ల బాబూరావు. ఇంచార్జి పదవి తమ కుటుంబానికే ఇవ్వాలని ఆయన అంటున్నట్లుగా చెబుతున్నారు. మరో వైపు ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డు అయినా ఇక్కడ చక్రం తిప్పేది మాత్రం బలమైన మరో సామాజిక వర్గం కాపులు. అలాగే మత్య్సకారులు కూడా గణనీయంగా ఉంటూ ప్రభావం చూపిస్తారు. దీంతో ఈ సామాజిక వర్గాలు అయితే తాము మెచ్చే నాయకుడితే ఇంచార్జి ఇవ్వాలని పట్టుబడుతున్నాయని అంటున్నారు.

దూకుడు మీద టీడీపీ :

మరో వైపు 2014 తరువాత 2024 ఎన్నికల్లో మరోసారి గెలిచిన వంగలపూడి అనిత హోం మంత్రిగా కీలక స్థానంలో ఉన్నారు. దాంతో పాటు పార్టీలో పట్టు బాగా పెంచుకున్నారు. టీడీపీకి ఈ నియోజకవర్గం కంచు కోట కావడంతో క్యాడర్ తో కలిసి మరింత పటిష్టం చేస్తున్నారు దానికి వైసీపీలో వర్గ పోరు సరైన నాయకత్వం లేకపోవడం కూడా కలసి వస్తున్నాయని అంటున్నారు. టీడీపీ ఈ విధంగా దూకుడు చేస్తూంటే వైసీపీ మాత్రం ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఇంచార్జితో పెద్దగా యాక్టివిటీస్ లేక స్తబ్దుగా ఉందని అంటున్నారు. ఇక ఈ మధ్య దాకా సైలెంట్ గా ఉన్న గొల్ల బాబూరావు మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు. దాంతో అధినాయకత్వం నుంచి ఆయనకు భరోసా వచ్చిందా అన్న చర్చ కూడా సాగుతోంది. ఏది ఏమైనా దీని మీద పార్టీ పెద్దలే కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అంటున్నారు.