ఆల్ టైం రికార్డ్ సృష్టించిన గోల్డ్ ధరలు.. 9రోజుల్లోనే రూ.5,460..
బంగారం, వెండి వస్తువులను, ఆభరణాలను మన ఇండియాలో ఉండే ప్రజలు ఎక్కువగా ఇష్టపడతారు.
By: Tupaki Desk | 3 Sept 2025 1:05 PM ISTబంగారం, వెండి వస్తువులను, ఆభరణాలను మన ఇండియాలో ఉండే ప్రజలు ఎక్కువగా ఇష్టపడతారు. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఈ బంగారు నగలు అంటే ఎంతో ప్రీతి.. బంగారం ఎంత రేటు పెరిగినా కానీ అమ్మకాలు ఏ మాత్రం తగ్గడం లేదు. లక్ష ధర దాటినా రికార్డు స్థాయిలో అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ విధంగా బంగారం ధర అనేది పెరుగుతూ వస్తోంది తప్ప తగ్గుదల అయితే కనిపించడం లేదు. వాస్తవానికి పెళ్లి జరిగినా.. ఇతర ఏ ఫంక్షన్లు జరిగినా బంగారాన్ని కానుకగా పెడుతూ ఉంటారు. బంగారం లేకుంటే మన ఇండియన్స్ బయటకు వెళ్లలేని పరిస్థితులు కూడా ఎన్నో ఉంటాయి.. అంతలా బంగారం పై ప్రజలలో ఆసక్తి పెరిగిపోయిందని చెప్పవచ్చు. ఎంత ఆసక్తి ఉన్నా.. ధరలు పెరుగుదల కారణంగా కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడింది.
ఈ క్రమంలోనే గత తొమ్మిది రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ ఇప్పుడు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.ఈ మధ్య రోజురోజుకు పెరుగుతూ లక్ష రూపాయలు దాటి పోయింది. ఈరోజు ఒక గ్రాము 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,06,970 కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.800 పెరిగి రూ.98,050 కి చేరింది. అలాగే వెండి ధర కిలోకి రూ.900 పెరిగి కేజీ వెండి ధర రూ.1,37,000 పలుకుతోంది. గత 9 రోజుల వ్యవధిలో బంగారం ధరలు ఏకంగా రూ.5,460 పెరగడం అనేది ఆశ్చర్యం అని చెప్పవచ్చు. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నా. అసలే పండుగలు పెళ్లిళ్ల సీజన్ మొదలైన నేపథ్యంలో ఇలా బంగారం ధరలు పెరగడం సామాన్యుడికి మరింత భారంగా మారింది. ఇకపోతే పెట్టుబడి పెట్టుకునే వారికి మాత్రం ఇది చాలా అనువైన సమయం అని బ్యాంకులు కూడా సలహాలు ఇస్తున్నాయి.
ఈ పెరుగుదల వెనుక అంతర్జాతీయంగా ఎన్నో కారణాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పెరగడంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. నిజానికి బంగారం ధరలు ఇలా పెరిగిపోవడానికి కారణం ద్రవ్యోల్బణంలో మార్పులు, యూఎస్ డాలర్ విలువ తగ్గిపోవడం లాంటి పలు కారణాలవల్ల ఇప్పుడు బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీనికి తోడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్స్ పై కొనసాగుతున్న అనిస్థితులు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సెప్టెంబర్ నెలలో అనగా ఈ నెలలో వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందని ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జేరోమ్ పావేల్ తో పాటు మరికొందరు ఫెడరల్ అధికారులు లీకులు ఇవ్వడం జరుగుతోంది. అంతేకాకుండా దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ప్రారంభం కావడం.దీనిలో భాగంగానే సెన్సెక్స్ 60 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ పది పాయింట్లు నష్టపోయింది.
