బంగారం భగ్గుమంటోంది.. ఒక్కరోజే రూ.1650 పెంపు!
బంగారమే కాదు వెండి ధర కూడా భారీగా పెరిగింది. ఒక్క రోజులోనే కిలో వెండి ధర రూ.1900 పెరిగి రూ.99,400కు చేరుకుంది.
By: Tupaki Desk | 16 April 2025 11:41 PM ISTపసిడి ప్రియులకు ఇది నిజంగా షాకింగ్ న్యూసే! బంగారం ధరలు అంతర్జాతీయంగా భగ్గుమంటున్నాయి. అమెరికా, చైనా మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం కారణంగా పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడి మార్గంగా బంగారం వైపు చూస్తుండటంతో ధరలకు రెక్కలొచ్చాయి. దేశీయంగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఒక్క రోజులోనే బంగారం ధరలు భారీగా పెరిగి రికార్డు స్థాయికి చేరుకున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ఏకంగా రూ.1650 పెరిగి రూ.98,100ను తాకింది. 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం కూడా అదే స్థాయిలో పెరిగి రూ.97,650కి చేరుకుంది. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో సాయంత్రం 4.30 గంటల సమయానికి 10 గ్రాముల బంగారం ధర రూ.97,700కు చేరుకుంది.
బంగారమే కాదు వెండి ధర కూడా భారీగా పెరిగింది. ఒక్క రోజులోనే కిలో వెండి ధర రూ.1900 పెరిగి రూ.99,400కు చేరుకుంది. అంతకుముందు రోజు అంటే మంగళవారం కిలో వెండి రూ.97,500 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో అయితే బంగారం ధర మరింత ఎక్కువగా ఉంది. ఇంట్రాడేలో గరిష్టంగా ఔన్సు బంగారం 3,318 డాలర్లను తాకింది. ప్రస్తుతం 3,296 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
అమెరికా, చైనా మధ్య గత కొన్ని రోజులుగా వాణిజ్యపరమైన ఘర్షణలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఒకరిపై ఒకరు సుంకాలు విధించుకోవడంతో పాటు ఎగుమతుల విషయంలో కూడా ఆంక్షలు పెట్టుకుంటున్నారు. ఈ అనిశ్చితి కొనసాగుతున్నంత కాలం బంగారానికి డిమాండ్ పెరుగుతూనే ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు డాలర్ విలువ బలహీనంగా ఉండటం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందనే అంచనాలు కూడా బంగారం ధర పెరగడానికి కారణమవుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సామాన్యులకు ఇది నిజంగా భారంగా మారే సూచనలే కనిపిస్తున్నాయి.
