Begin typing your search above and press return to search.

పసిడి పరుగు ఆగట్లేదు.. ఒక్క రోజులో ఇంత పెరుగుదలా..!

అవును... గత కొన్ని నెలలుగా బంగారం, వెండి ధరలు విపరీతంగా రికార్డ్ స్థాయిలో పెరుగుతున్న సంగతి తెలిసిందే.

By:  Raja Ch   |   21 Jan 2026 3:51 PM IST
పసిడి పరుగు ఆగట్లేదు.. ఒక్క రోజులో ఇంత పెరుగుదలా..!
X

గత కొన్ని నెలలుగా వెండి, బంగారం ధరలు నువ్వా నేనా అన్నట్లుగా పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇతర ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్‌ కాస్త బలహీనపడటం, గ్రీన్‌ లాండ్‌ స్వాధీనానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ దూకుడుగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో.. ఈ రెండు లోహాల ధరలు కొండెక్కుతున్నాయని అంటున్నారు. ఈ సమయంలో ఒక్కరోజులోనే పసిడి వేగంగా పరుగెత్తగా.. నేనేమైనా తక్కువ తిన్నానా అన్నట్లుగా వెండి కొండెక్కింది!

అవును... గత కొన్ని నెలలుగా బంగారం, వెండి ధరలు విపరీతంగా రికార్డ్ స్థాయిలో పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే రూ.లక్షన్నర దాటిన 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర బుధవారం మరింత పెరిగింది. ఇందులో భాగంగా.. పసిడి ధర ఏకంగా రూ.1.61 లక్షలు పలికింది. అంటే.. క్రితం రోజు రూ.1,52,800 పోలిస్తే సుమారు రూ.9వేలు పెరిగిందన్నమాట. ఇక, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1.41 లక్షలు ఉండగా.. ఇప్పుడు రూ.1.48 లక్షలకు చేరింది!

బంగారం ధరలు ఆ విధంగా పెరుగుతుంటే.. ఇక వెండి కూడా తగ్గడం లేదు! ఇందులో భాగంగా... నేటి మార్కెట్‌ లో కిలో వెండి ధర రూ.3,30,000గా ఉండగా.. క్రితం రోజుతో పోలిస్తే ఈ ధర దాదాపు రూ.14వేలు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌ లో ఔన్సు వెండి ధర చరిత్రలో తొలిసారి 94 డాలర్ల మార్క్‌ ను దాటి పయనిస్తోండగా... ఈ భారీ పెరుగుదల చరిత్రలో తొలిశారని నిపుణులు చెబుతున్నారు.

ఈ సందర్భంగా... కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ (సీ.ఎఫ్.ఆర్.) నివేదిక ప్రకారం.. సుమారు 30 దేశాలు ప్రస్తుతం యుద్ధం లేదా సంఘర్షణ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. మరోవైపు గ్రీన్ లాండ్ ను ఆక్రమించుకుంటానంటూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మెక్సికో, కెనడా, యూరోపియన్ దేశాలపై భారీ సుంకాలను విధిస్తున్నారు. మరోవైపు మెక్సికో ప్రపంచంలోనే అతిపెద్ద వెండి ఉత్పత్తిదారుగా ఉన్న పరిస్థితి!

ఈ పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయని అంటున్నారు. మరోవైపు... సిల్వర్ ఇనిస్టిట్యూట్ డేటా ప్రకారం.. 2023 - 2025 మధ్య వెండి డిమాండ్ 20% పెరిగింది. ఈ క్రమంలో 2027నాటికి ఈ ధరల్లో భారీ తగ్గుదల ఉండొచ్చని అంటున్నారు.