పెళ్లిళ్ల సీజన్.. ఆశలపై మళ్లీ నీళ్లు చల్లిన బంగారం!
దీపావళి పండుగ ఆరంభంతో కార్తీకమాసం ప్రారంభం అయింది. కార్తీకమాసం పవిత్రతకు చిహ్నం. కాబట్టి ఈ సీజన్లో పెళ్లిళ్లు చేయడానికి కొన్ని ప్రాంతాల వారు ఆసక్తి చూపిస్తారు.
By: Madhu Reddy | 21 Oct 2025 4:43 PM ISTదీపావళి పండుగ ఆరంభంతో కార్తీకమాసం ప్రారంభం అయింది. కార్తీకమాసం పవిత్రతకు చిహ్నం. కాబట్టి ఈ సీజన్లో పెళ్లిళ్లు చేయడానికి కొన్ని ప్రాంతాల వారు ఆసక్తి చూపిస్తారు. అందులో భాగంగానే మంచి తేదీలను చూసుకొని మరీ తమ పిల్లలకు పెళ్లిళ్లు చేస్తారు. సాధారణంగా పెళ్లి అంటేనే ప్రథమంగా గుర్తుకు వచ్చే అంశం బంగారం. కట్నం ఎంత ఇస్తున్నారు అనే విషయానికంటే అమ్మాయికి బంగారం ఎంత పెడుతున్నారు అనే బంధుమిత్రులు అడుగుతారు. అందుకే తల్లిదండ్రులు కూడా ఆచితూచి అడుగులు వేస్తూ.. తమ కూతురుకి ఎంతైనా బంగారం ఇవ్వడానికి ఒకప్పుడు ముందుకు వచ్చేవారు. కానీ ఇప్పుడు బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్న వేళ అసలు తమ కూతురుకి బంగారం పెట్టగలమా అనే డైలామాలో పడిపోయారు. అని అనడంలో సందేహం లేదు.
ఒకప్పుడు 50 వేలకు మించని బంగారం ధరలు.. ఇప్పుడు 22 క్యారెట్ల బంగారమే ఏకంగా 1,20,000 కు చేరుకుంది అంటే ఇక సామాన్యులు కూడా ఎప్పుడో బంగారం వైపు అడుగులు వేయడం మానేశారు. కానీ ఇప్పుడు తప్పని పరిస్థితులు ఏర్పడడంతో ఎంత ధర అయినా సరే పెట్టి కొద్దో గొప్పో బంగారం ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారు. ఇదిలా ఉండగా కార్తీకమాసం ప్రారంభంలోనే కొంచెం మేర తగ్గి అందరికీ ఊరట కలిగించిన బంగారం.. ఇప్పుడు తగ్గినట్టే తగ్గి.. బంగారు కొనుగోలుదారుల ఆశలపై మళ్ళీ నీళ్లు చల్లింది అని చెప్పవచ్చు. గడిచిన రోజుతో పోల్చుకుంటే పసిడి ధర నేడు దాదాపు 3 వేలు పెరిగింది. హైదరాబాదు మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1.3లక్షలు దాటింది. అటు వెండి ధర కూడా నిన్నటితో పోల్చుకుంటే కేజీ పై రూ.4వేలు పెరగడం గమనార్హం.
పెరిగిన ధరలు ఎలా ఉన్నాయనే విషయానికొస్తే.. హైదరాబాదులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,31,600 పలికింది. అయితే మంగళవారం నాటికి ఆ మొత్తం ఇప్పుడు రూ. 1,34,500 కి చేరింది. 22 క్యారెట్ల ఆభరణాల 10 గ్రాముల బంగారం ధర రూ.1,21,000 పలికింది. మరోవైపు కిలో వెండి ధర సోమవారం రోజు రూ.1,67,300 కాగా నేడు రూ.1,71,200 కు చేరుకుంది. గతవారం ఏకంగా రూ.1.81లక్షల వరకు ఎగబాకిన ఈ వెండి ధర.. ఆ తర్వాత తగ్గుతూ వచ్చింది. అయితే ఇప్పుడు మళ్లీ గిరాకీ పెరగడంతో బంగారం, వెండి ధరలు మరోసారి పరుగులు పెడుతున్నాయి.
బంగారం ధరలలో మార్పులు రావడానికి కారణం రష్యా ఉక్రెయిన్ యుద్ధం.. అమెరికా సుంకాలు.. డాలర్ విలువ తగ్గిపోవడమే ప్రధాన కారణంగా చెప్పుకుంటున్నారు. పైగా బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు. అంతేకాదు చైనా , జపాన్ వంటి దేశాలు బంగారం నిలువలను పెంచుకుంటున్నాయి. అటు కేంద్ర బ్యాంకులు కూడా బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. గోల్డ్ ఫ్యూచర్స్ పై పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో బంగారం గణనీయంగా పెరుగుతోందని తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ పెళ్లిళ్ల సీజన్లో బంగారం ధర మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
