Begin typing your search above and press return to search.

బంగారం కొనే టైమ్ ఇదేనా.. నాలుగు నెలల కనిష్టానికి ధర!

అంతర్జాతీయ పరిణామాలతో బంగారం ధర దిగివస్తోంది. ఆకాశానికి ఎగబాకిన ధరలు అమాంతం తగ్గిపోతుండటంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు.

By:  Tupaki Desk   |   23 March 2026 5:51 PM IST
బంగారం కొనే టైమ్ ఇదేనా.. నాలుగు నెలల కనిష్టానికి ధర!
X

అంతర్జాతీయ పరిణామాలతో బంగారం ధర దిగివస్తోంది. ఆకాశానికి ఎగబాకిన ధరలు అమాంతం తగ్గిపోతుండటంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు పసిడి ప్రియులు పండగ చేసుకుంటున్నారు. పెళ్లిళ్ల సీజన్ లో గోల్డ్ రేట్ పడిపోవడాన్ని సామాన్యులు స్వాగతిస్తున్నారు. అయితే ఉన్నట్లుండి పసిడి ఇలా నేల చూపులు చూడటమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సహజంగా స్టాక్ మార్కెట్లు పడిపోయినప్పుడు బంగారం ధర పెరుగుతుంది. అయితే ప్రస్తుత యుద్ధ సమయంలో స్టాక్ మార్కెట్ కు పోటీగా బులియన్ కూడా భారీ నష్టాలను నమోదు చేయడమే ఆసక్తి రేపుతోంది.

పశ్చిమాసియా పరిణామాలు బంగారం ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని అంటున్నారు. ఈ రోజు బులియన్ మార్కెట్ ప్రారంభించే సమయానికి పసిడి ధర నాలుగు నెలల కనిష్టానికి పడిపోయింది. ఈ ఏడాది ఆరంభం నుంచి భారీగా పెరుగుతూ చుక్కలను తాకిన ధరలు ఆమాంతం పడిపోతున్నాయి. సోమవారం నాటి ట్రేడింగులో అంతర్జాతీయ స్పాట్ గోల్డ ఔన్సు ధర 4,138 డాలర్లకు దిగివచ్చింది. ఇది నాలుగు నెలల కనిష్టంగా పేర్కొంటున్నారు. ఇక ఈ ధరల పతనం వరుసగా 9వ రోజు కావడం గమనార్హం. గత వారం ఆరంభంలో పసిడి ధర 5 వేల డాలర్లు ఉండేది. అటు వెండి కూడా 62.47 డాలర్లకు పతనమైందని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు.

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు 2026 ఫిబ్రవరి 28న తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఆ రోజున ఇరాన్ భూభాగంపై జరిగిన దాడులతో యుద్ధం అధికారికంగా మొదలైంది. అప్పటి నుంచి స్టాక్ మార్కెట్ తోపాటు బులియన్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులు నమోదు చేస్తోందని చెబుతున్నారు. సాధారణంగా యుద్ధం మొదలైనప్పుడు బంగారం ధరలు పెరుగుతాయి. పసిడిని సురక్షితమైన పెట్టుబడిగా భావించి పెట్టుబడిదారులు బులియన్ మార్కెట్ ను ఆశ్రయిస్తారు. కానీ ప్రస్తుతం రివర్స్ ట్రేడింగ్ జరుగుతోందని అంటున్నారు. బంగారంలో పెట్టుబడులను వెనక్కి తీసుకుంటుండటంతో ధర గణనీయంగా తగ్గిపోతోందని చెబుతున్నారు.

యుద్ధం మొదలైన మొదటి రెండు వారాలు బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి. మార్చి మొదటి వారంలో ధరలు ఆకాశాన్ని తాకాయి. 13వ తేదీ తర్వాత సీన్ రివర్స్ అవడం మొదలైందని అంటున్నారు. యుద్ధం సుదీర్ఘంగా కొనసాగుతుండటం, అమెరికా డాలర్ విలువ అనూహ్యంగా పెరగడం, విదేశీ సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లపై తీసుకుంటున్న కఠిన నిర్ణయాల వల్ల గత 10 రోజులుగా బంగారం ధరలు క్రమంగా పడిపోతున్నాయని విశ్లేషిస్తున్నారు. దీంతో ఈ నెల ప్రారంభంలో అంటే మార్చి 2న 24 కేరెట్ల బంగారం (10 గ్రాములు) రూ.1,69,349 వద్ద ఆల్-టైమ్ గరిష్టాన్ని తాకింది. కానీ ఇప్పుడు అది రూ.1,40,020 స్థాయికి పడిపోయింది. అంటే మూడు వారాల్లో దాదాపు రూ.29,000 మేర ధర తగ్గింది.

ఈ పతనం మరింత ఉండొచ్చని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. యుద్ధం మరికొన్నాళ్లు కొనసాగితే రూ.లక్ష కన్నా దిగువకు బంగారం పడిపోయినా ఆశ్చర్యం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. ధరల పతనం సామాన్యులకు మంచి అవకాశంగా మారిందని అంటున్నారు. అయితే, బంగారం ధరలు ఎప్పుడూ ఒడిదుడుకులకు లోనవుతుంటాయి కాబట్టి, ఎప్పటికప్పుడు తాజా ధరలను గమనిస్తూ కొనుగోలు చేయడం ఉత్తమమని సూచిస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ పురస్కరించుకుని బంగారం పెద్ద ఎత్తున కొనుగోలు చేసేవారికి ఈ పరిణామాలు ఉపశమనం కలిగిస్తున్నాయని అంటున్నారు.