మా ట్రంపు బంగారమే!
భారతీయులు, ముఖ్యంగా మధ్యతరగతి జనాలకు అందుబాటులో లేకుండా దూసుకుపోయిన బంగారం ధరలు దిగివస్తున్నాయి.
By: Tupaki Desk | 9 April 2025 11:24 AM ISTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపును ఇప్పుడు అంతా బంగారం అని పిలవాలేమో.. ఆయన మొదలుపెట్టిన ట్రేడ్ వార్ తో పెరగడమే తప్ప తరగడం తెలియని పసిడి ధర తిరోగమనం బాట పట్టింది. బుధవారం మార్కెట్లు ప్రారంభం కాగానే రూ.1500 తగ్గిన బంగారం ఆల్ టైమ్ రికార్డు ధర కన్నా రూ.6 వేలకు దిగివచ్చింది. పరిస్థితులు ఇలానే కొనసాగితే రూ.లక్ష మార్కు తాకుతుందని భావించిన బంగారం రూ.50 వేల నుంచి రూ.60 వేల మధ్యకు పడిపోతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
భారతీయులు, ముఖ్యంగా మధ్యతరగతి జనాలకు అందుబాటులో లేకుండా దూసుకుపోయిన బంగారం ధరలు దిగివస్తున్నాయి. అంతర్జాతీయ పరిణామాల మూలంగా ఇన్వెస్టర్లు ఆలోచన విధానం మారడంతో పుత్తడి పరుగు ఆగిపోయింది. ఈ వారంలో ఆల్ టైమ్ రికార్డుగా నమోదు చేసిన 3150 రూపాయల ఔన్స్ బంగారం ధర బుధవారం 2996 రూపాయలకు పడిపోయింది. చాలా కాలం తర్వాత 3 వేల డాలర్ల కన్నా పసిడి పతనం అవడం విశేషంగా చెబుతున్నారు. అమెరికా ఫ్యూచర్ మార్కెట్లో పసిడి ధర పడిపోవడంతో ఆ ప్రభావం ప్రపంచ మార్కెట్ పైనా కనిపిస్తోంది.
ఈ పరిణామాలతో సగటు భారతీయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్వర్ణమంటే ఎంతో మక్కువ చూపించే భారతీయులు పసిడి పరుగు చూసి ఇక బంగారం కొనలేమంటూ ఆశలు వదులుకున్నారు. ఇలాంటి సమయంలో అమెరికా నూతన అధ్యక్షుడిగా వచ్చిన ట్రంప్ విధానాలుతో బంగారం దిగివస్తుందని అంచనాలు వచ్చాయి. అయితే జనవరి 30న ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా పసిడి పరుగు ఆగలేదు. దీంతో మధ్యతరగతి జనం ఉసూరు మన్నారు. అయితే ట్రంప్ మాత్రం తనపై జనం పెట్టుకున్న ఆశలు వమ్ము చేయలేదు. ట్రేడ్ వార్ ద్వారా పరోక్షంగా మధ్య తరగతికి మేలు చేశారంటున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదలుపెట్టిన ట్రేడ్ వార్ తో సోమవారం నుంచి బులియన్ మార్కెట్ వెలవెలబోతోంది. సుంకాల ఎఫెక్ట్ తో షేర్ మార్కెట్ షేక్ అవుతుండగా, ఇన్వెస్టర్లు సేఫ్ జోన్ కోసం వెతుకులాట మొదలుపెట్టారు. అదే సమయంలో షేర్ మార్కెట్లో నష్టాలను పూడ్చుకోడానికి బంగారం విక్రయించడం మొదలుపెట్టారు. దీంతో బంగారం ధర పతనం ప్రారంభమైందని అంటున్నారు. అదేవిధంగా అమెరికా ట్రెజరీ బాండ్స్ కొనుగోలుపైనా ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. బంగారం కన్నా, అమెరికా ఇచ్చే వడ్డీయే సురక్షితంగా ఇన్వెస్టర్లు భావిస్తుంటారు. వచ్చే నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లను తగ్గిస్తుందని అంచనా ఉంది. ఇది కూడా బంగారం పతనమయ్యేందుకు దారితీసిందని అంటున్నారు.
కారణాలు ఏమైనా బంగారం ధర దిగివస్తుండాన్ని భారతీయులు స్వాగతిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి 15 శాతం పెరిగిన బంగారం అందుబాటులోకి వస్తుందనే అంచనాలతో కొనుగోళ్లు నిలిపేశారు. అత్యావసరమైతే తప్ప ఎవరూ బంగారం కొనుగోలు చేయకపోవడంతో గత మూడు రోజులుగా 70 శాతం లావాదేవీలు తగ్గాయని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
