బంగారం ఊపిరి తీసుకునే గ్యాప్ కూడా ఇవ్వట్లేదుగా.. లక్ష దాటిన గంటలలోనే మరో 3 వేలు పెరుగుదల!
బంగారం కొనుగోలు దారులు బెంబేలెత్తిపోతున్నారు. లైవ్ మార్కెట్లో బంగారం ధరలు నిమిష నిమిషానికి మారుతూ సామాన్యుడికి షాక్ ఇస్తున్నాయి
By: Tupaki Desk | 22 April 2025 5:06 PM ISTబంగారం కొనుగోలు దారులు బెంబేలెత్తిపోతున్నారు. లైవ్ మార్కెట్లో బంగారం ధరలు నిమిష నిమిషానికి మారుతూ సామాన్యుడికి షాక్ ఇస్తున్నాయి. హైదరాబాద్‌లో ఈ రోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. లక్షను తాకిందని ఊపిరి పీల్చుకునేలోపే, గంట వ్యవధిలోనే మళ్లీ భారీగా పెరిగింది. ఇవాళ ఒక్కరోజే ఏకంగా రూ. 3 వేలు పెరిగి.. ప్రస్తుతం బంగారం ధర రూ. 1,01,350కు చేరుకుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధర కూడా రూ. 2,750 పెరిగి రూ. 92,900కు చేరుకుంది. ఈ పెరుగుదల సామాన్యుడికి బంగారం కొనుగోలు చేయాలన్నఆశలను దూరం చేస్తుంది.
బంగారం ధరలు ఈ స్థాయిలో పెరగడానికి అంతర్జాతీయంగా నెలకొన్ని ఆర్థిక పరిస్థితులు ప్రధాన కారణమని నిపుణులు భావిస్తున్నారు. అమెరికా డాలర్ బలహీనపడటం, ద్రవ్యోల్బణం పెరుగుదల, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వంటి అంశాలు పసిడి ధరలను అమాంతం పెంచేస్తున్నాయి. అంతే కాకుండా బంగారం ఒక సురక్షితమైన పెట్టుబడి సాధనంగా పరిగణించడం వల్ల కూడా డిమాండ్ పెరుగుతోంది.
హైదరాబాద్‌లో బంగారం ధరలు దేశంలోని ఇతర నగరాల కంటే కొంచెం భిన్నంగా ఉండవచ్చు. రవాణా ఖర్చులు, స్థానిక పన్నులు వంటి అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. అయితే అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగా ఇక్కడ కూడా ధరలు భారీగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
బంగారం ధరలు ఇలా పెరుగుతూ పోతే సామాన్యులకు బంగారం కొనడం కలగానే మిగిలిపోతుంది. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల కోసం బంగారం కొనాలనుకునే మధ్యతరగతి ప్రజలకు ఇది నిజంగా కష్టతరంగా మారుతంది. భవిష్యత్తులో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాబట్టి, బంగారం కొనాలనుకునే వారు వేచి చూడడం కంటే ఉన్న ధరలకే కొనుగోలు చేయడం మంచిదని కొందరు సూచిస్తున్నారు.
