గోల్డ్ ప్రియులకు షాక్.. వారంలోనే రూ.4,580..
వాస్తవానికి గత వారం రోజుల క్రితం బంగారం తగ్గుదల జరిగి.. సామాన్య ప్రజలు సంతోషం వ్యక్తం చేసేలోపే.. ఈ వారం అనూహ్యంగా ధరలు పెరిగి ఆశ్చర్యాన్ని కలిగించాయి
By: Madhu Reddy | 2 Sept 2025 12:35 PM ISTబంగారం ధరలు ఎప్పటికప్పుడు ఆకాశాన్ని అంటుతున్నాయి. వాస్తవానికి గత వారం రోజుల క్రితం బంగారం తగ్గుదల జరిగి.. సామాన్య ప్రజలు సంతోషం వ్యక్తం చేసేలోపే.. ఈ వారం అనూహ్యంగా ధరలు పెరిగి ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఈ ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా శుభకార్యాలకు హిందూ సంప్రదాయం ప్రకారం బంగారం కొనుగోలు అనివార్యం.. ఇలాంటి సమయంలో బంగారు ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇకపోతే ఇప్పుడు కేవలం వారంలోనే 4, 580 రూపాయలు తులం బంగారం పైన పెరిగి సామాన్యుడికి మరింత భారంగా మారింది అని చెప్పవచ్చు.
ఇకపోతే ఈరోజు ప్రాంతాలవారీగా బంగారం ధరలు ఎలా ఉన్నాయి అనే విషయం ఇప్పుడు చూద్దాం..
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం... బంగారం ధరలు ఆల్ టైం రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.210 పెరిగి రూ.1,06,090 కి చేరుకుంది. ఇకపోతే ఎనిమిది రోజుల్లోనే రూ.4,580 పెరగడం గమనార్హం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.200 ఎగబాకి రూ.97,250 వద్ద కొనసాగుతోంది. అటు కేజీ వెండి పై ₹100 పెరిగి రూ.1,36,100 గా ఉంది. దీన్ని బట్టి చూస్తే.. బంగారం మాత్రమే కాదు వెండి ధరలు కూడా వేగంగా పెరిగిపోతున్నాయి. గత పది రోజుల్లో కిలో వెండిపై ఏకంగా 6 వేలకు పైగా ధరలు పెరగడం గమనార్హం. ఇక దాదాపు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
ఇకపోతే బంగారం, వెండి ధరలు మల్టీ కమాడిటీ ఎక్స్చేంజిలో కూడా భగ్గుమంటున్నాయి. గోల్డ్ అక్టోబర్ ఫ్యూచర్స్ ధర ఏకంగా 0.43% అంటే రూ.430 పెరిగి రూ.1,05,215 ధరలో ట్రేడ్ అవుతోంది. ఇక సెప్టెంబర్ సిల్వర్స్ ఫ్యూచర్ ధర 0.49 శాతం అంటే 605 పెరిగి రూ.1,23,240 వద్ద ట్రేడ్ అవుతోంది.
మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా పెరగడానికి కారణం ద్రవ్యోల్బణం తగ్గడం, యూఎస్ డాలర్ బలహీన పడడమే కాకుండా రుణవ్యయాలలో కోతలు విధించడం వల్లే బంగారంలో ఇలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయని పలువురు నిపుణులు చెబుతున్నారు. ఇకపోతే బంగారం ధరలు సామాన్యుడికి ఇబ్బందిగా మారినా పెట్టుబడి పెట్టుకునే వారికి ఇది సరైన సమయం అని చెప్పవచ్చు. అటు నిపుణులు కూడా బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు కొన్ని రోజులు ఆగాలని సలహాలు ఇస్తున్నారు. ఇక ఎవరైతే బంగారం పై పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో తక్షణమే ఆ పని మొదలు పెట్టాలని కూడా సలహాలు ఇస్తూ ఉండడం గమనార్హం..
