దూసుకెళ్లిన పసిడి ధరలు తగ్గుతున్నాయి ఎందుకు?
ఎందుకిలా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. శుక్రవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.95,510కు పడిపోయింది.
By: Tupaki Desk | 3 May 2025 10:45 AM ISTపది గ్రాముల బంగారం రూ.లక్ష అయ్యే రోజు వస్తుందా? వస్తే అదెప్పుడు? అన్న ప్రశ్నలకు ఎవరూ సూటిగా సమాధానం చెప్పలేని వేళ.. అనూహ్య రీతిలో వారాల వ్యవధిలో సరికొత్త గరిష్టాలకు దూసుకెళ్లటం.. అనూహ్యంగా రూ.లక్ష మార్క్ ను దాటేసిన వైనం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పట్లో రూ.లక్ష మార్కును దాటేయటం అంత తేలికైన విషయం కాదన్న అంచనాలు తప్ప అన్నది తేలిపోయింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. నాలుగైదు రోజులుగా.. ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన బంగారం ధరలు.. ఇప్పుడు వెనకంజ వేయటమే కాదు.. అనూహ్య రీతిలో తగ్గుతున్న వైనం ఆసక్తికరంగా మారింది.
ఎందుకిలా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. శుక్రవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.95,510కు పడిపోయింది. అంటే.. మొన్నటి రికార్డు ధరలతో తాజా ధరల వ్యత్యాసం పది గ్రాములకు రూ.7వేలు కావటం గమనార్హం. మన వద్దే కాదు.. గ్లోబల్ ట్రెండ్ కూడా బంగారం నేల చూపులు చూస్తోంది. గత వారం గ్లోబల్ మార్కెట్ లో ఔన్స్ బంగారం 3500.05 డాలర్లుగా ఉంటే.. గురువారం ఒక్క రోజులో 2.2 శాతం తగ్గి.. 3216.14 డాలర్ల వద్ద ముగిసింది.
ఈ ధరల్ని చూస్తే.. గత వారానికి ఇప్పటికి తేడా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందని చెప్పాలి. ఇంతకూ ఇంతలోనే బంగారం ధరలు తగ్గటానికి కారణాలేంటి? అన్న ప్రశ్నకు సమాధానాల్ని వెతికితే..
- ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గగటంతో సురక్షిత ఆస్తులకు డిమాండ్ పెరుగుతుండటం
- దక్షిణ కొరియా.. జపాన్.. భారత దేశంతో వాణిజ్య ఒప్పందాల గురించి ట్రంప్ సానుకూల సూచనలు చేయటం
- చైనా ఒప్పందం మీదా ట్రంప్ సానుకూల వ్యాఖ్యలు
మొన్నటి వాణిజ్య ఉద్రిక్తతల వేళ.. బంగారానికి మించిన మదుపు ఉండదన్నట్లుగా వాణిజ్య వర్గాలు స్పందించాయి. దీంతో.. పసిడి ధర భగ్గుమంది. అయితే.. వణికించే అమెరికా సుంకాల్ని నివారించేందుకు వీలుగా పలు దేశాలు చాలా మంచి ఆఫర్లను అందించినట్లుగా అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ వ్యాఖ్యానించారు. అయితే.. ఈ రేసులో భారత్ ముందు ఉండటం.. ఈ తరహా ఒప్పందాన్ని కుదుర్చుకున్న మొదటి దేశంగా నిలవటం గమనార్హం. తాజా పరిణామాల నేపథ్యంలో రానున్న రోజుల్లో బంగారం ధర తగ్గేందుకు వీలుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే.. ఈ అంచనా మార్కెట్ వర్గాలకు చెందిందే అన్న విషయాన్ని మరవొద్దు. ఈ అంచనాలు ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకునే పరిణామాల ఆధారంగా మారుతుంటాయి.
