Begin typing your search above and press return to search.

రెట్టింపైన పసిడి తాకట్టు.. గతేడాదితో పోలిస్తే ఎంత పెరుగిందంటే?

దేశంలో బంగారం ధరలు రోజురోజుకూ కొత్త రికార్డులను సృష్టిస్తుండడంతో, సామాన్య మధ్య తరగతి ప్రజలు తమ తక్షణ ఆర్థిక అవసరాల కోసం 'గోల్డ్ లోన్' వైపు మొగ్గు చూపుతున్నారు.

By:  Tupaki Political Desk   |   28 Feb 2026 7:00 PM IST
రెట్టింపైన పసిడి తాకట్టు.. గతేడాదితో పోలిస్తే ఎంత పెరుగిందంటే?
X

దేశంలో బంగారం ధరలు రోజురోజుకూ కొత్త రికార్డులను సృష్టిస్తుండడంతో, సామాన్య మధ్య తరగతి ప్రజలు తమ తక్షణ ఆర్థిక అవసరాల కోసం 'గోల్డ్ లోన్' వైపు మొగ్గు చూపుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బ్యాంకింగ్ రంగంలో పసిడి రుణాల వాటా ఎగబాకుతూనే ఉంది. గతేడాది బ్యాంకుల మొత్తం రిటైల్ రుణాల్లో బంగారం రుణాల వాటా 3 శాతంగా ఉండగా, అది ఇప్పుడు రెట్టింపై 6 శాతానికి చేరుకోవడం గమనార్హం. పసిడి విలువ పెరగడంతో తక్కువ మొత్తంలో బంగారం తాకట్టు పెట్టి ఎక్కువ రుణం పొందే అవకాశం ఉండటమే ఈ భారీ వృద్ధికి ప్రధాన కారణమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

₹4 లక్షల కోట్లకు చేరిన తాకట్టు

జనవరి నెలాఖరు నాటికి బ్యాంకింగ్ వ్యవస్థలో గోల్డ్ లోన్స్ 128 శాతం వృద్ధిని నమోదు చేసి, దాదాపు ₹4 లక్షల కోట్ల మైలురాయిని తాకింది. గతంలో వ్యక్తిగత అవసరాల కోసం క్రెడిట్ కార్డులు లేదా పర్సనల్ లోన్లపై ఆధారపడే వారు, ఇప్పుడు పెరుగుతున్న బంగారం ధరలను ఆసరాగా చేసుకుంటున్నారు. అందుకే తాకట్టు వైపు వెళ్తున్నారు. పసిడి ధర పెరిగిన ప్రతిసారీ బ్యాంకులు ఇచ్చే రుణ పరిమితి (LTV-Loan to Value) పెరుగుతుండడంతో వినియోగదారులు తమ అవసరాలకు దీనినే సురక్షితమైన మార్గంగా భావిస్తున్నారు. ఈ పరిణామం బ్యాంకింగ్ రిటైల్ విభాగంలో భారీ మార్పునకు సంకేతంగా నిలుస్తోంది.

రిటైల్ లోన్ విభాగంలో వినియోగదారుల ప్రాధాన్యతలు స్పష్టంగా మారుతున్నాయి. ఒకప్పుడు జోరుగా సాగిన క్రెడిట్ కార్డ్ లోన్స్ ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. అధిక వడ్డీ రేట్లు, కఠినమైన నిబంధనల వల్ల క్రెడిట్ కార్డుల వినియోగంపై ప్రభావం పడినట్లు తెలుస్తోంది. దీనికి భిన్నంగా వెహికల్ లోన్స్ (వాహన రుణాలు) మాత్రం 17 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. పండుగ సీజన్, కొత్త మోడళ్ల రాకతో వాహనాల కొనుగోలుకు ప్రయాణికులు ఆసక్తి చూపుతుండగా, తక్షణ నగదు కోసం మాత్రం బంగారంపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు.

డిపాజిట్లు, లోన్లు

ప్రస్తుతం భారత బ్యాంకింగ్ వ్యవస్థ పటిష్టంగా కనిపిస్తోంది. మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థలో డిపాజిట్లు ₹247.7 లక్షల కోట్లుగా ఉండగా, మొత్తం రుణాలు (లోన్లు) ₹204.32 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అంటే బ్యాంకులు తమ వద్ద ఉన్న డిపాజిట్లలో గణనీయమైన భాగాన్ని రుణాల రూపంలోకి మళ్లించగలుగుతున్నాయి. ఇందులో రిటైల్ రుణాల వాటా అధికంగా ఉండడం, అందులోనూ గోల్డ్ లోన్స్ వాటా రెట్టింపు అవ్వడం బ్యాంకుల లాభదాయకతకు, భద్రతకు ఒక సానుకూల అంశంగా కనిపిస్తోంది. ఎందుకంటే బంగారం రుణాలు సెక్యూర్డ్ (హామీ ఉన్న) రుణాలు కాబట్టి బ్యాంకులకూ రిస్క్ తక్కువగా ఉంటుంది.

బంగారమే భరోసా..

బంగారం ధరల పెరుగుదల వల్ల అదనపు రుణ సదుపాయం సామాన్యులకు ఒక భరోసాను ఇస్తోంది. అయితే, కేవలం రుణం సులభంగా దొరుకుతుందని అవసరానికి మించి అప్పులు చేయడం శ్రేయస్కరం కాదని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ధరలు తగ్గినప్పుడు బ్యాంకులు అదనపు మార్జిన్ మనీ అడిగే అవకాశం ఉంటుందని గమనించాలి. మొత్తానికి, భారతీయ బ్యాంకింగ్ రంగంలో ప్రస్తుతం 'గోల్డ్ లోన్' ఒక బలమైన ఆర్థిక చోదక శక్తిగా మారిందని జనవరి గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.