Begin typing your search above and press return to search.

దేశంలో సరికొత్త రికార్డు.. రూ.లక్ష దాటిన 10 గ్రాముల బంగారం

పసిడి పెట్టుబడిదారులకు ఈ రోజు మర్చిపోలేని రోజు. నిన్నటి వరకు ఊహించని స్థాయికి బంగారం ధరలు పెరిగాయి.

By:  Tupaki Desk   |   21 April 2025 6:55 PM IST
దేశంలో సరికొత్త రికార్డు.. రూ.లక్ష దాటిన 10 గ్రాముల బంగారం
X

పసిడి పెట్టుబడిదారులకు ఈ రోజు మర్చిపోలేని రోజు. నిన్నటి వరకు ఊహించని స్థాయికి బంగారం ధరలు పెరిగాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర పన్నులతో కలిపి అక్షరాలా ఒక లక్ష రూపాయల మైలు రాయిని చేరుకుంది. దేశీయ మార్కెట్‌లో బంగారం ధర ఈ స్థాయికి చేరుకోవడం ఇదే మొదటి సారి. ఈ అనూహ్యమైన పెరుగుదలకు అంతర్జాతీయంగా నెలకొన్న కొన్ని కీలకమైన అంశాలే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. అవేమింటంటే.. ప్రపంచంలోని రెండు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం, అలాగే అంతర్జాతీయంగా డాలర్ బలహీనపడడం వంటి కారణాల వల్ల మదుపర్లు సురక్షితమైన పెట్టుబడి మార్గంగా బంగారాన్ని ఎంచుకుంటున్నారు.ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం సోమవారం ఏకంగా 3,405 డాలర్లకు చేరుకుంది. దీని ప్రభావం దేశీయ మార్కెట్‌పై తీవ్రంగా పడింది.

సోమవారం సాయంత్రం 5:30గంటల సమయానికి 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,00,016 వద్ద ట్రేడ్ అయింది. అయితే, ఆ తర్వాత స్వల్పంగా తగ్గి రూ.99,900 వద్ద కొనసాగుతోంది. శుక్రవారం ముగింపు ధరతో పోలిస్తే ఈ పెరుగుదల దాదాపు రూ.2,000లకు పైగా ఉంది. ఈ ఒక్క రోజే ఇంత భారీ పెరుగుదల నమోదు కావడం గమనార్హం.

ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు బంగారం ధర దాదాపు రూ.20,000కు పైగా పెరగడం విశేషం. డిసెంబర్ 31 నాటికి సుమారు రూ.79,000 వద్ద ఉన్న 10 గ్రాముల బంగారం ధర, గత మూడున్నర నెలల్లోనే దాదాపు 26శాతం పెరిగింది. ఇది బంగారంపై పెట్టుబడి పెట్టిన వారికి భారీ లాభాలను తెచ్చిపెట్టింది.

బంగారం బాటలోనే వెండి కూడా ఆకాశాన్నంటుతుంది. కిలో వెండి ధర మళ్లీ లక్ష రూపాయల మార్కును చేరువవుతోంది. గతంలో ఒకసారి లక్ష రూపాయల స్థాయిని దాటిన వెండి, ప్రస్తుతం రూ.99,299 పలుకుతోంది. వెండి ధర కూడా త్వరలోనే కొత్త రికార్డులను సృష్టించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అవ

దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజీ (MCX)లో కూడా 10 గ్రాముల బంగారం ధర తొలిసారిగా రూ.96,000 మార్కును దాటింది. జూన్ నెల డెలివరీ కాంట్రాక్ట్స్‌లో 10 గ్రాముల బంగారం ఒక్క రోజులోనే రూ.1,621 మేర పెరిగి, ఇంట్రాడేలో రూ.96,875 వద్ద గరిష్ట స్థాయిని తాకింది.

ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా మధ్య వాణిజ్య సంబంధాలలో స్పష్టమైన సయోధ్య కుదిరేంతవరకు బంగారం ధరలు ఇదే విధంగా పెరుగుతూ ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి కొనసాగితే పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడి సాధనంగా బంగారాన్ని ఎంచుకోవడానికి మొగ్గు చూపుతారు. ఇది రాబోయే రోజుల్లో బంగారం ధరలను మరింత పెంచే అవకాశం ఉంది. బంగారం ధరల పెరుగుదల సామాన్యులపై ప్రభావం చూపినప్పటికీ, పెట్టుబడిదారులకు మాత్రం ఇది మంచి లాభాలను ఆర్జించే సమయం.