అత్యవసరంగా డబ్బు కావాలా?.. మీ బంగారం వేస్తే ఈ ఏటీఎంలో డబ్బులొస్తాయ్
ఏటీఎం అనగానే మనకు ఠక్కున గుర్తుకు వచ్చేది డబ్బులు తీసుకోవడం లేదా డిపాజిట్ చేయడం.
By: Tupaki Desk | 21 April 2025 8:45 PMఏటీఎం అనగానే మనకు ఠక్కున గుర్తుకు వచ్చేది డబ్బులు తీసుకోవడం లేదా డిపాజిట్ చేయడం. కానీ టెక్నాలజీ ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. తాజాగా, చైనాలోని షాంఘై నగరంలో ఒక వినూత్న ఏటీఎం కనిపించింది. దీని స్పెషాలిటీ ఏమిటంటే.. ఇందులో మీరు బంగారాన్ని ఉంచితే చాలు.. అది మీ బ్యాంకు ఖాతాలో డబ్బును జమ చేస్తుంది. వినడానికి వింతగా ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఈ యంత్రం ఎలా పనిచేస్తుంది. దీని వెనుక ఉన్న టెక్నాలజీ ఏమిటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ఈ ఏటీఎంలో అత్యవసర పరిస్థితుల్లో డబ్బులు ముట్టనప్పుడు మీరు మీ వద్ద ఉన్న బంగారు ఆభరణాలు లేదా ఇతర బంగారు వస్తువులను ఉంచవచ్చు. యంత్రం వాటిని స్వీకరించి, అత్యాధునిక సెన్సార్ల సహాయంతో వాటి బరువు, క్వాలిటీని క్షణాల్లో గుర్తిస్తుంది. ఆ తర్వాత, ఆ రోజు చైనా మార్కెట్‌లో ఉన్న బంగారం ధర ప్రకారం మీ బంగారం విలువను లెక్కిస్తుంది. విశేషం ఏంటంటే.. యంత్రం 1200 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద బంగారాన్ని కరిగించి, దాని స్వచ్ఛతను మరింత కచ్చితంగా నిర్ధారిస్తుంది. అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే ఆ మొత్తాన్ని నేరుగా మీ బ్యాంకు ఖాతాకు బదిలీ చేస్తుంది. ఈ ప్రక్రియ అంతా కొన్ని నిమిషాల్లోనే పూర్తవుతుంది.
ఈ టెక్నాలజీ వినియోగదారులకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీగా డబ్బులు అవసరం అనుకున్నప్పుడు తమ వద్ద ఉన్న బంగారాన్ని సులభంగా విక్రయించి డబ్బు పొందవచ్చు. అంతేకాకుండా, బంగారం విక్రయించడానికి నమ్మకమైన ప్రదేశం కోసం వెతకాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ యంత్రం ద్వారా జరిగే లావాదేవీలు పారదర్శకంగా ఉంటాయని, వినియోగదారులకు మంచి ధర లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
షాంఘైలో ఈ కొత్త ఏటీఎం ప్రజల నుంచి విశేషమైన స్పందనను అందుకుంటోంది.చాలా మంది తమ వద్ద ఉన్న చిన్న మొత్తాల బంగారాన్ని కూడా ఈ యంత్రం ద్వారా విక్రయించి నగదు పొందుతున్నారు. అయితే, ఈ టెక్నాలజీకి కొన్ని లిమిట్స్ కూడా ఉండవచ్చు. ఉదాహరణకు, చాలా పెద్ద మొత్తంలో బంగారం విక్రయించాలనుకునే వారికి ఇది అనుకూలంగా ఉండకపోవచ్చు.
ఒకవేళ ఇలాంటి ఏటీఎం మన దేశంలో కూడా వస్తే ఎలా ఉంటుంది.. నిజంగా ఇది మాత్రం మార్కెట్లో ఓ విప్లవాత్మక మార్పు అవుతుంది. చిన్న, మధ్య తరహా బంగారు ఆభరణాలు కలిగిన వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే, దీనికి సంబంధించిన నియమ నిబంధనలు, భద్రతా చర్యలు ఎలా ఉండబోతున్నాయనేది వేచి చూడాలి.