విమాన ప్రమాదం.. 800గ్రాముల బంగారం లభ్యం.. ఇంకా ఏమేమంటే?
ఈ సమయంలో విమానంలో మంటలు ఒక్కసారిగా అగ్నిగోళంగా మారిపోయాయి. పెద్ద ఎత్తున మంటలతోపాటు నల్లని పొగ వ్యాపించింది.
By: Tupaki Desk | 18 Jun 2025 3:00 AM ISTజూన్ 12న మధ్యాహ్నం 1:39 గంటల ప్రాంతంలో అహ్మదాబాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా విమానం.. సమీపంలోని బీజే మెడికల్ కాలేజ్ క్యాంపస్ పై కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో విమానంలో మంటలు ఒక్కసారిగా అగ్నిగోళంగా మారిపోయాయి. పెద్ద ఎత్తున మంటలతోపాటు నల్లని పొగ వ్యాపించింది.
ఈ ఘటనలో 242 మందిలోనూ ఒక్కరు మాత్రమే సజీవంగా బయటపడగా.. 241 మంది ప్రాణాలు కోల్పోయారు. వారి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన పరిస్థితి. ఆ సమయంలో స్థానికంగా ఉండే 56 ఏళ్ల కనస్ట్రక్షన్ బిజినెస్ చేసే రాజు పటేల్ అనే వ్యక్తి.. తన సిబ్బందితో కలిసి ఎయిరిండియా విమానం కూలిన ప్రదేశానికి పరుగెత్తుకుంటూ వెళ్లారు.
ఈ సందర్భంగా స్పందించిన రాజు పటేల్... మొదటి 15 - 20 నిమిషాలు తాము దగ్గరకి వెళ్లలేకపోయామని, మంటలు చాలా తీవ్రంగా ఎగసిపడ్డాయని.. అయితే, అగ్నిమాపక దళం వచ్చిన తర్వాత తాము సహాయం చేయడానికి ముందుకు దూకామని తెలిపారు. ఈ సందర్భంగా గాయపడిన వారికి తీసుకెళ్లడానికి స్ట్రెచ్చర్లు కనిపించకపోవడంతో చీరలు, బెడ్ షీట్లు ఉపయోగించినట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలో అధికారులు పటేల్ బృందాన్ని రాత్రి 9 గంటల వరకూ అక్కడే ఉండటానికి అనుమతించారు. ఈ సమయంలో శిథిలాలనుంచి వారు సుమారు 800 గ్రాముల కంటే ఎక్కువ బంగారు ఆభరణాలు, రూ.80,000 నగదు, పాస్ పోర్టులు, ఒక భగవద్గీతను స్వాధీనం చేసుకుని.. వాటన్నింటినీ పోలీసులకు అప్పగించారు. వీటన్నింటినీ డాక్యుమెంట్ చేస్తున్నట్లు హోం శాఖ సహాయమంత్రి తెలిపారు.
