Begin typing your search above and press return to search.

గోదావరి జిల్లాలలో సీన్ మారుతోందా...!?

అక్కడ ట్రెండ్ ని చూస్తే చాలు ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తున్నారు అన్నది చెప్పవచ్చు. ఇదిలా ఉంటే గోదావరి జిల్లాలలో సీన్ మారుతోంది అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   10 March 2024 4:30 PM GMT
గోదావరి జిల్లాలలో సీన్ మారుతోందా...!?
X

ఏపీ రాజకీయాలను విశేషంగా ప్రభావితం చేసే అత్యంత కీలకమైన పొలిటికల్ సెగ్మెంట్ గా గోదావరి జిల్లాలను చూస్తారు. ఉమ్మడి ఏపీలోనూ విభజన ఏపీలో కూడా గోదావరి జిల్లాలే ఎపుడూ కొలమానం. అక్కడ ట్రెండ్ ని చూస్తే చాలు ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తున్నారు అన్నది చెప్పవచ్చు. ఇదిలా ఉంటే గోదావరి జిల్లాలలో సీన్ మారుతోంది అని అంటున్నారు.

గత ఏడాది చివరి దాకా ఒక విధంగా నడచిన ట్రెండ్ కొత్త ఏడాది మొదటి రెండు నెలలూ మరో విధంగా సాగింది. గత ఏడాది వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాలను దున్నేశారు. ఇసుక వేస్తే రాలనంతగా జనాలు వచ్చారు. ఒక విధంగా పవర్ ఫుల్ ఫోర్స్ గా గోదావరి జిల్లాలలో జనసేన ఆవిర్భవిస్తుంది అని అంతా ఊహించారు.

పవన్ సైతం తన మొత్తం పొలిటికల్ కెరీర్ లో అంతటి దూకుడుగా చేసిన ప్రసంగాలు మరెక్కడా లేవు. వైసీపీ లేని గోదావరి జిల్లాలను ఈసారి చూపిస్తాను అని పవన్ శపధం చేశారు. ఒక్క సీటు కూడా ఉభయ గోదావరి జిల్లాలలో వైసీపీ గెలవకూడదు అని ఆయన పట్టుదలగా చెప్పారు. జనాల నుంచి కూడా చాలా వరకూ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

అయితే టీడీపీ పొత్తు తరువాత కొంత వాతావరణం మారింది. అయినా సరే గౌరవ ప్రదమైన సీట్లు పొత్తులో తీసుకుంటామని చెప్పిన పవన్ కేవలం 24 సీట్లకే పరిమితం కావడంతో గోదావరి రాజకీయ వేడి మొత్తానికి చల్లారిపోయింది అని అంటున్నారు. దానికి తార్కాణంగా లేటెస్ట్ సర్వేలు అనేకం చెబుతున్నది ఇదే.

నిజానికి జనసేన స్పీడ్ కి టీడీపీతో జత కట్టిన వైఖరికి నూటికి ఎనభై శాతం సీట్లు ఈ రెండు పార్టీలు పట్టుకుపోవాలి. కానీ ఇపుడు అలాంటిది లేదని అంటున్నారు. తాజాగా వచ్చిన కొన్ని సర్వేలను చూస్తే తూర్పు గోదావరిలో మొత్తం 19 అసెంబ్లీ సీట్లు ఉంటే అందులో పదిదాకా వైసీపీ గెలుచుకునే చాన్స్ ఉంది అని అంటున్నారు. జనసేన టీడీపీ కూటమికి ఏడు రెండు టఫ్ పొజిషన్ అని తేల్చింది ఈ సర్వే.

అదే విధంగా పశ్చిన గోదావరిలో ఉన్న మొత్తం 15 అసెంబ్లీ సీట్లు చూస్తే వైసీపీని ఏడు నుంచి ఎనిమిది దాకా గెలుచుకునే వీలు ఉంది అని అంటున్నారు. ఆ మిగిలినవి కూటమికి వెళ్తున్నాయి. అంటే ఎలా చూసుకున్నా రెండు జిల్లాలలో ఒకటి రెండు సీట్లలో వైసీపీయే పై చేయిగా నిలుస్తోంది అన్నది తాజా రాజకీయ సన్నివేశం.

జనసేన టీడీపీ కూటమిగా ఉన్నపుడు చేసిన సర్వేలు ఇవి. వీటిలో బీజేపీ కూడా చేరితే ఈ నంబర్ లో ఇంకా మార్పు రావచ్చు అని అంటున్నారు.అంటే అది కూటమికి బలాన్ని పెంచే సీన్ ఉండకపోగా ఏమైనా అడ్వాంటేజ్ ఉంటే వైసీపీకే అని అంటున్నారు. అసలు ఎందుకు ఇలా జరిగింది అంటే సామాజిక సమీకరణలలో వచ్చిన తేడాలే అని అంటున్నారు.

గత నాలుగున్నరేళ్లుగా ఒక రాజకీయ పక్షం వైపు పెద్ద ఎత్తున మొగ్గు చూపిన బలమైన సామాజిక వర్గం ఆలోచనలలో మార్పు రావడం వల్లనే ఇలా జరుగుతోంది అని అంటున్నారు. దాంతో పాటు గా ఆ సామాజిక వర్గం ఓట్లు గంపగుత్తగా ఒక వైపు పడాల్సిన చోట ఇపుడు టోటల్ చేంజ్ కావడం వల్లనే న్యూట్రలైజ్ అయింది అని అంటున్నారు. ఈ పరిణామాలను పూర్తిగా గమనించిన మీదటనే కాపు నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరుతున్నారు అని అంటున్నారు.

ఆయన రానున్న ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో చేరి మరింత చురుకుదనం చూపిస్తారు అని అంటున్నారు. ముద్రగడ వంటి వారు ఎన్నికల తెర పైకి రావడం మరో మాజీ మంత్రి కాపు వృద్ధ నేత చేగొండి హరిరామజోగయ్య వంటి వారు పూర్తిగా మనస్తాపం చెంది సైలెంట్ కావడం వంటివి రాజకీయ సామాజిక సమీకరణను మొత్తం మారుస్తున్నాయని అంటున్నారు. ఇదే కనుక ముందు ముందు సాగితే ఏపీ రాజకీయాల్లో విలక్షణమైన తీర్పు మరోసారి రావచ్చు అన్నది రాజకీయ విశ్లేషకుల మాటగా ఉంది.