కృష్ణమ్మ ఒడిలోకి వయ్యారి గోదారమ్మ....డెల్టాకు వరం
పట్టిసీమ పధకాన్ని గతంలో ఎంతో ముందు చూపుతో చంద్రబాబు చేపట్టారు. ఇపుడు సరిగ్గా అది అక్కరకు వచ్చింది అని అంటున్నారు.
By: Satya P | 10 July 2026 11:59 PM ISTఏపీలో ఇపుడు ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. కరవుతో ఇబ్బంది పడుతున్న నేపథ్యం ఉంది. అంతే కాదు ఎల్ నినో ప్రభావం తో దక్షిణాది రాష్ట్రాలు అల్లల్లాడుతున్నాయి. అదే సమయంలో వరదలతో ఉత్తరాది రాష్ట్రాలు విలవిలలాడుతున్నాయి. దాంతో మహారాష్ట్రలో భారీ వర్షాల నేపథ్యంలో అక్కడ గోదావరికి వరదలు వచ్చిపడ్డాయి. దాంతో గోదావరి మహారాష్ట్ర తెలంగాణా మీదుగా ఏపీలోని అఖండ గోదావరికి బిరబిరా ప్రవహిస్తోంది. ఆ మీదట సాగర సంగమం కోసం ఉరకలెత్తుతోంది. అయితే ఇక్కడ ఏపీ ప్రభుత్వం గతంలో వ్యూహాత్మకంగా చెపట్టిన పట్టిసీమ ఎంతగానో ఉపయోగపడుతోంది. వరద జలాలు పెద్ద ఎత్తున వచ్చిపడడంతో వాటిని నీటి కోసం కటకటలాడుతున్న క్రిష్ణా డెల్టాకు మళ్ళిస్తున్నారు. దాంతో కృష్ణమ్మ ఒడిలోకి వయ్యారి గోదావరి వచ్చి చేరుతోంది. ఈ రెండింటిని అనుసంధానం చేసి ఈ పవిత్ర నదుల అపూర్వ కలయికకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీలో 2014 నుంచి 2019 మధ్యలో అధికారంలో ఉండగా తీసుకున్న చర్యలు ఎంతగానో దోహదపడుతున్నాయి.
పట్టిసీమ పట్టుకుంది :
పట్టిసీమ పధకాన్ని గతంలో ఎంతో ముందు చూపుతో చంద్రబాబు చేపట్టారు. ఇపుడు సరిగ్గా అది అక్కరకు వచ్చింది అని అంటున్నారు. అందుకే కృష్ణ డెల్టాకు ఊపిరి పోసేందుకు ఉరకలెత్తుతూ పవిత్ర సంగమానికి వస్తున్న గోదావరి జలాలను చూసి అటు రైతాంగం నిండుగా మురిసిపోతోంది. నిజానికి ఈ కీలక సమయంలో కృష్ణాకు తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడిన వేళ ఒక పెద్ద వరం గా పట్టిసీమ మారింది అని జలవనరుల శాఖ నిపుణులు చెబుతున్నారు. బిర బిరా పారుతున్న గోదావరి జలాలు శనివారం ఉదయానికి కృష్ణానది పవిత్ర సంగమానికి చేరుకోనుందని తెలుస్తోంది. రానున్న మూడు రోజుల్లో పట్టిసీమ ద్వారా 1.33 టీఎంసీల గోదావరి జలాలు కృష్ణాకు తరలింపు చేసినట్లుగా చెబుతున్నారు. ఇక చూస్తే గోదావరిలో కొనసాగుతున్న వరద ఉదృతిని ఈ విధంగా క్రిష్ణా డెల్టా సొమ్ము చేసుకుంటోంది అన్న మాట.
పోలవరం వద్దకు :
మరో వైపు చూస్తే పోలవరం స్పిల్వే దగ్గరకు ఇప్పటికే 27.550 మీటర్లకు చేరుకున్న నీటిమట్టంతో జల కళ ఉట్టిపడుతోంది. దాంతో పోలవరం స్పిల్వే నుండి లక్షా ఏడువేల 800 క్యూసెక్కుల వరదనీరు దిగువకు విడుదల చేస్తూ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. అలాగే పట్టిసీమ దగ్గర గోదావరి నీటి మట్టం 15.6 మీటర్లు ఉందని చెబుతున్నారు. పట్టిసీమ పంప్ హౌస్ లో 20 మోటార్లు ఆన్ చేసి ఏడు వేల క్యూసెక్కుల వరద నీరుని దిగువకు అధికారులు తరలిస్తున్నారు. పట్టిసీమ పంప్ హౌస్ మొదలైన నాటి నుండి ఇప్పటి వరకు కనుక చూసుకుంటే రికార్డు స్దాయిలో 443.7 టీఎంసీల గోదావరి జలాలు కృష్ణాకు తరలింపు జరిగినట్లుగా అధికారులు చెబుతున్నారు. అంటే పట్టిసీమ నిర్మాణం వల్ల అయిన ఖర్చు కన్నా అనేక రెట్లు ఇపుడు ప్రయోజనం కృష్ణా డెల్టాకు సమకూరిందని నిపుణులు గుర్తు చేస్తున్నారు. మొత్తానికి గోదారమ్మ దయతో పట్టిసీమ ద్వారా క్రిష్ణా డెల్టా జీవ కళతో నిండు జలాలతో ఉట్టిపడుతోంది.
