Begin typing your search above and press return to search.

'గోదావ‌రి'లో పొలిటిక‌ల్‌ క‌ల‌క‌లం.. ఏం జ‌రిగింది.. ?

ఇది చివరకు ఎటువంటి పరిస్థితి దారితీసింది అనేది ఆసక్తి కరం. ఎన్నికల సమయంలో పారిశ్రామిక వర్గాలన్నీ ఏకమై కూటమి పార్టీలకు అండగా నిలిచే పరిస్థితి వచ్చింది.

By:  Garuda Media   |   29 May 2026 6:00 AM IST
గోదావ‌రిలో పొలిటిక‌ల్‌ క‌ల‌క‌లం.. ఏం జ‌రిగింది.. ?
X

గోదావరి పుష్కరాలు వచ్చే ఏడాది జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమైంది. పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఇప్పటికే ప్రకటించింది. అదే సమయానికి పోలవరం ప్రాజెక్టును కూడా ఒక దశ పూర్తి చేయాలని దానిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ప్రారంభించాలని కూడా సీఎం చంద్రబాబు నిర్ణయించారు. అయితే క్షేత్రస్థాయిలో పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గత రెండు రోజులుగా పర్యటించారు.

క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను గమనించారు. ఈ క్రమంలో ఆయన గోదావరి నుంచి ప్రవహించే చిన్న చిన్న నదులను అదేవిధంగా పాయలను పరిశీలించి కాలుష్యంగా మారుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం ప్రభుత్వ పరంగా బాగానే ఉన్నప్పటికీ రాజకీయపరంగా చూస్తే గోదావరి జిల్లాల్లో ఈ పరిస్థితి గందరగోళానికి దారి తీస్తోంది. కాలుష్యాలు వచ్చి గోదావరిలో కలుస్తున్నాయ ని, తద్వారా నీళ్లు కలుషితం అవుతున్నాయని, ఇలాంటి నీటిలో భక్తులు ఏ విధంగా పుణ్య స్థానాలు చేస్తారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

అంతేకాదు ఎలాంటి వారినైనా వదిలిపెట్టేది లేదని కూడా హెచ్చరించారు. దీనిపై తనకు నివేదిక ఇవ్వాలని మంత్రి కందుల దుర్గేష్ ను ఆదేశించారు. క్షేత్రస్థాయి పర్యటన సమయంలో దుర్గేష్ పై కూడా పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఈ వ్యవహారానికి రాజకీయ రంగు పులుముకుంది. ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో ప్రధానమైన కాలుష్య కారకాలు ఏవైనా ఉన్నాయంటే అవి ఆక్వా పరిశ్రమలు.. చేపల ప్రాసెసింగ్ యూనిట్లు. అదేవిధంగా ఆంధ్ర పేపర్ నుంచి భారీ స్థాయిలో కాలుష్య కారకాలు... గోదావరిలో కలుస్తున్నాయి.

గత ఎన్నికలకు ముందే ఈ విషయంపై వైసీపీ దృష్టి పెట్టింది. అప్పట్లో పుష్కరాలు లేకపోవచ్చు. కానీ గోదావరిలో కాలుష్య కారకాలు పెరుగుతున్నాయంటూ కేంద్ర పర్యావరణ శాఖ నుంచి వచ్చిన హెచ్చరికలు, నివేదికలను గమనించిన అప్పటి వైసిపి ప్రభుత్వం.. క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిశ్రమలపై జరిమానాల కొరడా విధించింది. దీంతో భారీ ఎత్తున జరిమానాలను వసూలు చేశారు. అంతేకాదు కొంతమంది టీడీపీ అనుకూల పారిశ్రామికవేత్తలకు షోకాజు నోటీసులు ఇవ్వడంతోపాటు వారిపై పర్యావరణ చట్టాల కింద కేసులు కూడా నమోదు చేశారు.

ఇది చివరకు ఎటువంటి పరిస్థితి దారితీసింది అనేది ఆసక్తి కరం. ఎన్నికల సమయంలో పారిశ్రామిక వర్గాలన్నీ ఏకమై కూటమి పార్టీలకు అండగా నిలిచే పరిస్థితి వచ్చింది. అందుకే బలమైన స్థానాల్లో కూడా వైసిపి ప‌రాజ‌యం పాలయ్యింది. ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఈ పరిస్థితి స్పష్టమైంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఏర్పడుతుందనే విష‌యంలో ఎలాంటి సందేహం లేదు. రాజకీయం రాజకీయమే వ్యాపారం వ్యాపారమై. ఏ వ్యాపారి కూడా తాను నష్టపోయి రాజకీయాలు బాగుండాలని, ప్రభుత్వం బాగుండాలని కోరుకోరు.

ముందు వ్యాపారి బాగుంటేనే తాను ఎవరికి మద్దతు ఇవ్వాలనుకున్నాడో వారికి మద్దతిస్తాడు. తనకే నష్టం వస్తున్నప్పుడు తనే నిండా మునుగుతున్నానని భావించినప్పుడు తనకు ఉండే మార్గాలను అన్వేషించుకుంటాడు. ఆ దిశలో ప్రయాణం చేస్తాడు. వైసిపి హయాంలో అయితే ఇదే జరిగింది. ఇప్పుడు కూడా తమపై ఒత్తిళ్లు తీసుకువస్తే తమ దారి తాను చూసుకుంటామన్న ధోరణిలో పారిశ్రామికవేత్తలు ఉన్నారు. వీరిలో మెజారిటీ పారిశ్రామికవేత్తలు ప్రస్తుతం కూటమి పార్టీలకు ఏదో ఒక రూపంలో మద్దతు తెలుపుతున్నారు.

అందులో టిడిపి నాయకులు కావచ్చు.. బీజేపీ నాయకులు కావచ్చు.. కాలుష్యం విషయం తెలిసి కూడా మౌనంగా ఉంటున్నారు. ఏదైనా రాజకీయాలను మించిన వ్యూహం మరొకటి లేదు కదా. అందుకే చూసీ చూడ‌న‌ట్టు పోతున్నారు. కానీ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్థిరమైన నిర్ణయం తీసుకోవడం.. కాలుష్యం లేకుండా గోదావరి నదిని నిలబెట్టాలి అన్న ఆలోచన మంచిదే. అయినప్పటికీ రాజకీయంగా చూసుకున్నప్పుడు ఇది తీవ్ర పరిణామాలకు దారి తీసే అవకాశం ఉంటుందన్నది విశ్లేషకులు చెబుతున్న మాట. మరి ఏం జరుగుతుందనేది చూడాలి.