పులసకు ప్రత్యామ్నాయంగా విలస
పూర్వం గోదావరి పాయల ప్రాంతంలో నవంబర్ నుంచి అక్టోబర్ వరకు విస్తారంగా పులసలు దొరికేవి.
By: Tupaki Desk | 10 Sept 2025 4:11 PM ISTగోదావరి పరివాహక ప్రాంత ప్రజలకు పులస చేప అంటే ప్రత్యేకమైన అనుబంధం. “పుస్తెలమ్మైనా పులస పులుసే కావాలి” అనే సామెత ఈ చేపకు ఉన్న ప్రాధాన్యాన్ని స్పష్టం చేస్తుంది. పులస రుచిని ఒకసారి ఆస్వాదించినవారు మరువలేరని స్థానికులు చెబుతుంటారు.
అరుదైపోతున్న పులస
పూర్వం గోదావరి పాయల ప్రాంతంలో నవంబర్ నుంచి అక్టోబర్ వరకు విస్తారంగా పులసలు దొరికేవి. మత్స్యకారుల వలల్లో పెద్ద ఎత్తున చిక్కిన ఈ చేపలు తక్కువ ధరలకే అందుబాటులో ఉండేవి. బంధువులకు, స్నేహితులకు ప్రత్యేక విందుగా వండించి పంపడం ఇక్కడి ఆనవాయితీ. అయితే కొన్నేళ్లుగా పులస దొరికే పరిస్థితి గణనీయంగా తగ్గిపోయింది. పర్యావరణ మార్పులు, గోదావరిలో జలప్రవాహం తగ్గడం, అధిక వేట కారణంగా ఇవి అరుదుగా దొరుకుతున్నాయి. ఇప్పుడు వలలో ఒకటి రెండు చేపలు చిక్కినా, ఒక్కోటి రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు అమ్ముడవుతున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతున్నాయి.
ప్రత్యామ్నాయంగా విలస
పులస అందక ఇబ్బంది పడుతున్న మాంసాహార ప్రియులు విలస వైపు మొగ్గుతున్నారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరప్రాంతాల నుంచి వచ్చే ఈ చేపను కొంతమంది “పులస” పేరుతో అమ్ముతున్న సందర్భాలు గతంలో కనిపించాయి. అయితే ఇప్పుడు విలసకీ స్వతంత్రంగా మంచి డిమాండ్ ఏర్పడింది. రుచి పరంగా పులసతో పోలిస్తే కొంత భిన్నమైనా, అందుబాటులో ఉండటంతో చాలా మంది దీనిని ఇష్టంగా కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో కిలో విలస రూ.800 నుంచి రూ.1500 దాకా అమ్ముడవుతోంది. ధర ఎక్కువైనా మాంసాహార ప్రియులు వెనుకాడటం లేదు.
సముద్రం నుంచి నదివరకు
శాస్త్రీయంగా దీనిని టెనులోసా హిలస అని పిలుస్తారు. సముద్రంలో ఉండే ఈ చేప సంతానోత్పత్తి కోసం ప్రతి సంవత్సరం గోదావరిలోకి వచ్ఛేది. నదిలోకి అడుగుపెట్టిన క్షణం నుంచి దీనిని “పులస”గా పిలుస్తారు. స్థానికులు బెండకాయ ముక్కలతో వండే పులస పులుసు రుచి ప్రత్యేకమని చెబుతుంటారు.
మారుతున్న పరిస్థితులు
పులస అరుదైపోవడం వల్ల ఒకప్పుడు ప్రత్యేక వంటకంగా ఉండే ఈ చేప ఇప్పుడు విలాస వస్తువుగా మారింది. ఆ రుచి కోసం కొందరు ఎంత ఖర్చైనా వెనుకాడరు. కానీ మరికొందరు ప్రత్యామ్నాయంగా విలసను ఎంచుకుంటున్నారు. ఈ పరిస్థితి భవిష్యత్తులో చేపల వేట పద్ధతులు, పర్యావరణ పరిరక్షణపై చర్చను మళ్లీ మళ్లీ తెరమీదకు తెస్తోంది.
