Begin typing your search above and press return to search.

ప్రయాణికులను భయపెడుతున్న కొత్త మాఫియా.. 4కి.మీ లకు రూ.800!

ఇటీవలే ఒక పర్యాటకుడు తనకు ఎదురైన చేదు అనుభవాన్ని రెడిట్ వేదికగా పంచుకోవడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

By:  Madhu Reddy   |   27 May 2026 12:46 PM IST
ప్రయాణికులను భయపెడుతున్న కొత్త మాఫియా.. 4కి.మీ లకు రూ.800!
X

అందమైన బీచులు, ప్రశాంతమైన వాతావరణంతో ఎంజాయ్ చేయడానికి వెళ్లే పర్యాటకులకు గోవాలో ఒక కొత్త భయం పట్టుకుంది. అదే అక్కడి ‘టాక్సీ మాఫియా’. కేవలం 4 కిలోమీటర్ల దూరానికి ఏకంగా రూ.800 వసూలు చేస్తూ పర్యాటకుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. లోకల్ రవాణాపై ఆధారపడే సామాన్యులను టార్గెట్ చేస్తూ సాగుతున్న ఈ దోపిడీ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. గోవా వెళ్లాలనుకునే వారిని ఈ వార్త తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్ట్:

ఇటీవలే ఒక పర్యాటకుడు తనకు ఎదురైన చేదు అనుభవాన్ని రెడిట్ వేదికగా పంచుకోవడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. గోవాలో అడుగుపెట్టిన తనకు కేవలం నాలుగు కిలోమీటర్ల ప్రయాణానికి రూ.800 బిల్లు వేశారని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ పోస్ట్ కాస్తా కాస్తా వైరల్ అవ్వడంతో, దేశవ్యాప్తంగా ఉన్న నెటిజన్లు గోవా టాక్సీ డ్రైవర్ల ప్రవర్తనపై మండిపడుతున్నారు.

యాప్స్ ఉన్నా లాభం లేదు:

గోవాలో క్యాబ్ బుక్ చేసుకోవడానికి ‘గోవా మైల్స్ నెట్‌వర్క్’ అనే యాప్ అందుబాటులో ఉన్నప్పటికీ, దాని వల్ల ప్రయాణికులకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ఈ యాప్‌లో కనీసం టాక్సీ కోసం సెర్చ్ చేయాలన్నా ముందే వాలెట్‌లో డబ్బులు యాడ్ చేయాలనే నిబంధన పెట్టారు. తీరా డబ్బులు యాడ్ చేశాక డ్రైవర్లు రారు, బుకింగ్స్ క్యాన్సిల్ అవుతాయి. ఇక ఆ యాడ్ చేసిన మనీ మళ్లీ రిఫండ్ రావడానికి దాదాపు 8 రోజులు పడుతోందని పర్యాటకులు తలబాదుకుంటున్నారు.

పర్యాటక రంగంపై దెబ్బ:

ఇలాంటి అడ్డగోలు వసూళ్ల వల్ల గోవా ప్రతిష్ట దారుణంగా దెబ్బతింటోంది. ఒకప్పుడు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండే గోవా ట్రిప్, ఇప్పుడు ఈ టాక్సీ మాఫియా వల్ల సామాన్యుడికి భారంగా మారుతోంది. వేరే రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి వచ్చే టూరిస్టులను ఇలా ఇబ్బంది పెడితే భవిష్యత్తులో గోవాకు వచ్చే వారి సంఖ్య తగ్గిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న గోవాలో ఇలాంటి దోపిడీలు జరగడం నిజంగా విచారకరం. ప్రభుత్వం వెంటనే స్పందించి, ఓలా లేదా ఉబెర్ లాంటి ప్రైవేట్ క్యాబ్ సర్వీసులను పూర్తిస్థాయిలో అనుమతించాలి. అలాగే టాక్సీ మీటర్ల విధానాన్ని కఠినంగా అమలు చేసి, పర్యాటకులకు భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.