Begin typing your search above and press return to search.

తుని చిన్నారి కేసు మిస్టరీ.. ఆ 15 నిమిషాల్లో ఏం జరిగింది?

చిన్నారి అదృశ్యంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

By:  Tupaki Political Desk   |   14 Jun 2026 11:45 AM IST
తుని చిన్నారి కేసు మిస్టరీ.. ఆ 15 నిమిషాల్లో ఏం జరిగింది?
X

కాకినాడ జిల్లా తునికి సమీపంలోని సీహెచ్ అగ్రహారం గ్రామంలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. పాప అదృశ్యమై వారం గడుస్తున్నా, ఎలాంటి ఆనవాళ్లు లభించకపోవడంతో కేసు మిస్టరీగా మారింది. అయితే ఇంటి నుంచి వెళ్లిన పాపను ఓ గ్రామస్థుడు చూడటం, ఆ సమయంలో కుక్క అడ్డుపడటంతో పాపను రక్షించలేకపోయాడని అంటున్నారు. గ్రామంలో మరికొందరి సాయంతో అతడు పాపను చూసిన ప్రదేశానికి వచ్చే సరికి అక్కడ జ్ఞానేశ్వరి లేదని చెబుతున్నారు. పాపను అతడు చూసి తిరిగి వచ్చే సరికి సుమారు 15 నిమిషాల సమయం పట్టిందని అంటున్నారు. ఈ మధ్యలోనే పాప అదృశ్యమైందని అంటున్నారు. దీంతో ఆ పది హేను నిమిషాల్లో ఏం జరిగిందో తెలుసుకునే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 6న ఉదయం 11:50 గంటల ప్రాంతంలో చిన్నారి తండ్రి పొలం నుంచి ఇంటికి వచ్చాడు. పాపను భార్యకు అప్పగించి, ఆయన తిరిగి పొలానికి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో తల్లి వేరే చిన్న పాపను చూసుకోవడంలో నిమగ్నమవడంతో, జ్ఞానేశ్వరి అటుగా వెళ్లిన విషయాన్ని గమనించలేకపోయింది. ఇదే క్రమంలో తండ్రి వెళ్లిన మార్గానికి దగ్గర్లో ఒంటరిగా ఉన్న పాపను ఓ గ్రామస్థుడు గమనించాడు. ఎండలో ఒంటరిగా ఉన్న చిన్నారిని రక్షించి, సురక్షితంగా ఇంటికి చేర్చాలనే ఉద్దేశంతో ఆయన పాప దగ్గరకు వెళ్లాడు. అయితే, అక్కడ ఉన్న ఒక కుక్క ఆయనను కరవబోవడంతో, భయపడి ఆయన వెనక్కి తగ్గి ఊర్లోకి వెళ్లిపోయాడు.

ఆ 15 నిమిషాల్లో ఏమైంది?

ఊర్లోకి వెళ్లిన ఆ గ్రామస్థుడు జరిగిన విషయాన్ని మిగిలిన వారికి చెప్పి, కొంత సమయం తర్వాత మరికొందరితో కలిసి తిరిగి పాప ఉన్న చోటుకి వచ్చాడు. కానీ, అంతలోనే అక్కడ పాప కనిపించలేదు. మధ్యాహ్నం 12:00 గంటల నుండి 12:15 గంటల మధ్య, అంటే కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే పాప మిస్సయింది. వెంటనే గ్రామస్థులంతా కలిసి చుట్టుపక్కల ఎంత వెతికినా చిన్నారి ఆచూకీ దొరకలేదు.

దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు

చిన్నారి అదృశ్యంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆ 15 నిమిషాల వ్యవధిలో అసలేం జరిగింది? పాప దారి తప్పి ఎటైనా వెళ్లిందా? లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా? అనే కోణాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న బావులు, పొలాల గట్లు పరిశీలిస్తున్నారు. సీసీటీవీ విజువల్స్ ఆధారంగా విచారణ జరుపుతున్నారు. కళ్లెదుటే ఉన్న చిన్నారి అంతలోనే మాయమవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పాపకు సంబంధించిన ఎలాంటి సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.