అమెరికా, ఆస్ట్రేలియా నుంచి ఉత్తరాంధ్రకు వలస.. ఎడ్యుసిటీ వెరీ ఇంట్రెస్టింగ్
విశాఖ సిటీకి సమీపంలో ప్రతిపాదిత జీఎంఆర్-మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఏడాదిలోగా ఎడ్యుసిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.
By: Tupaki Desk | 18 Dec 2025 5:00 AM ISTవిశాఖ సిటీకి సమీపంలో ప్రతిపాదిత జీఎంఆర్-మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఏడాదిలోగా ఎడ్యుసిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీని నిర్మాణం పూర్తయితే ఉత్తరాంధ్ర రూపురేఖలే మారిపోతాయంటూ.. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న మాటలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. అసలు ఏంటి? ఎడ్యుసిటీ? దీని ప్రత్యేకత అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఫ్యూచరిస్టిక్ అంశమైన ఏవియేషన్ తో ఉత్తరాంధ్ర భవిష్యత్తుపై కూటమి ప్రభుత్వం చాలా కలలు కంటుందోని అంటున్నారు. ఎడ్యూసిటీ పూర్తయ్యాక విమానయాన రంగంలో నిపుణుల కొరత తీరుతుందని, దీనిద్వారా వచ్చే నిపుణులు ప్రపంచ ఏవియేషన్ అవసరాలు తీర్చేస్థాయికి ఎదుగుతారని అంటున్నారు.
ఇక ఉత్తరాంధ్రను వలసల ప్రాంతంగా చెబుతారు. అలాంటి ప్రాంతంలో ఏవియేషన్ ఎడ్యుసిటీ ద్వారా ఇతర దేశాల నుంచి వలసలు వస్తారని ప్రభుత్వం చెబుతోంది. అమెరికా, యూకే, ఆస్టేలియా నుంచి కూడా ఏవియేషన్ రంగంలో శిక్షణకు విశాఖ వస్తారని ప్రభుత్వం చెప్పడం చూస్తుంటే.. ఓ కలల ప్రపంచాన్ని కళ్ల ముందు ఆవిష్కరిస్తున్నట్లే ఉందని అంటున్నారు. ఏవియేషన్ రంగంలో చాలా అవకాశాలు ఉన్నాయని, ప్రస్తుతం నిపుణుల కొరత ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల ఎదురైన ఇండిగో సంక్షోభం కూడా దీనికి ఉదాహరణగా చెబుతున్నారు. నిపుణులు లేకపోవడం వల్లే మన దేశంలో విమానయాన రంగం అభివృద్ధి అనుకున్న స్థాయిలో జరగడం లేదని కూడా అంటున్నారు.
ఏవియేషన్ ఎడ్యుసిటీ పూర్తయితే ఉపాధి కోసం మన దేశం నుంచి ఎవరూ విదేశాలకు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదని, ఇతర దేశాల వారే ఇక్కడికి వస్తారని ప్రభుత్వం చెబుతోంది. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా యూనివర్సిటీలు కూడా ఎడ్యుసిటీలో తమ వర్సిటీలు ప్రారంభించేలా ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని అంటున్నారు. ప్రస్తుతం మన దేశంలో 800 విమానాలు ఉన్నాయి. మరో 1,700 విమానాల కొనుగోలుకు ఆర్డర్ పెట్టారని చెబుతున్నారు. ప్రతి విమానానికి వంద మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంటున్నారు. ఆ ఉద్యోగాలకు ప్రస్తుతం తగిన అర్హతలు ఉన్నవారి కొరత ఉందని, ఈ కొరతను ఎడ్యుసిటీ తీర్చుతుందని ప్రభుత్వం చెబుతోంది.
ప్రస్తుతం మన దేశంలో సివిల్ ఏవియేషన 12 శాతం వృద్ది రేటులో అభివృద్ధి చెందుతోంది. దీంతో విమానయాన రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఎడ్యుసిటీ ద్వారా యువతకు తగిన శిక్షణ ఇచ్చి... దేశంలో విమానయాన రంగంలో పనిచేసే సిబ్బంది 70 శాతం తెలుగువారే ఉండాలనే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అంతేకాకుండా భవిష్యత్తులో ప్రపంచానికి అవసరమైన విమానయాన సిబ్బందిలో 25 శాతం మందిని ఇక్కడ నుంచే పంపేలా ప్రణాళిక వేసుకుంది. ఏడాదిలోగా నిర్మాణం పూర్తి చేసుకుని తొలిబ్యాచ్ అడ్మిషన్లకు ప్రభుత్వం రెడీ అవుతోందని అంటున్నారు.
