భారంగా మారుతున్న బంధం.. పెళ్లికి ఇంత ఖర్చు చేస్తున్న దేశాలు..
ప్రపంచ వ్యాప్తంగా పెళ్లిళ్ల ఖర్చులపై వచ్చిన తాజా గణాంకాలు ఈ మార్పును గట్టిగా చూపిస్తున్నాయి.
By: Tupaki Desk | 18 Dec 2025 11:08 AM ISTఒకప్పుడు పెళ్లి అంటే రెండు కుటుంబాల మధ్య బంధం. ఇప్పుడు పెళ్లి అంటే రెండు కుటుంబాల మధ్య బడ్జెట్ యుద్ధం. ప్రేమ, అనుబంధం, సంప్రదాయం అనే మాటలు పక్కకు వెళ్లి.. ‘ఎంత ఖర్చు?’ అనే ప్రశ్నే కేంద్రంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా పెళ్లిళ్ల ఖర్చులపై వచ్చిన తాజా గణాంకాలు ఈ మార్పును గట్టిగా చూపిస్తున్నాయి. ఇది కేవలం సంఖ్యల కథ కాదు.. ఇది సమాజం విలువలు ఎలా మారుతున్నాయో చెప్పే అద్దం.
అగ్రస్థానంలో అగ్రరాజ్యం..
అమెరికాలో ఒక సగటు పెళ్లి ఖర్చు దాదాపు 34 వేల డాలర్లు. ఆస్ట్రేలియా, బ్రిటన్, ఇటలీ, కెనడా లాంటి దేశాల్లో కూడా పెళ్లి ఖర్చు 20 వేల డాలర్లకు పైగానే ఉంది. హోటళ్లు, లగ్జరీ వెన్యూలు, డెస్టినేషన్ వెడ్డింగ్స్, డిజైనర్ దుస్తులు, ఫోటోగ్రఫీ, థీమ్ డెకరేషన్లు.. ఒక్కొక్క అంశం పెళ్లిని ఒక ప్రాజెక్ట్‌లా మార్చేస్తోంది. ‘ఒకరోజు కోసం ఇంత ఖర్చా?’ అన్న ప్రశ్న వినిపిస్తున్నా, ఆ ప్రశ్నకు సమాజం ఇచ్చే సమాధానం మాత్రం ‘స్టేటస్’ అనే మాట. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. పెళ్లికి తక్కువ బడ్జెట్ వెచ్చించే దేశాలు కూడా ఉన్నాయి. ఫిలిప్పీన్స్, వియత్నాం, ఇండోనేషియా, ఉక్రెయిన్, నైజీరియా లాంటి దేశాల్లో పెళ్లి ఖర్చు 2 నుంచి 4 వేల డాలర్ల మధ్యే ఉంది. అక్కడ పెళ్లి ఇప్పటికీ ఒక సామాజిక వేడుక. ఆడంబరం కంటే అనుబంధానికే ప్రాధాన్యం. సంప్రదాయంగా ఉంది.. కానీ అప్పుల భారం లేదు. ఇది అభివృద్ధి లేని దేశాల లక్షణమా? లేక అభివృద్ధి పేరుతో మనం తప్పుదారి పట్టామా? అనే ప్రశ్న సహజంగా తలెత్తుతుంది.
ఆసక్తిగా భారత్ విధానం..
భారత్ ఈ జాబితాలో ఆసక్తికరమైన స్థానంలో ఉంది. సగటు పెళ్లి ఖర్చు సుమారు 15 వేల డాలర్లు. ఇది చాలా దేశాల కంటే తక్కువగా కనిపించినా.. భారతీయ కుటుంబాల ఆదాయంతో పోలిస్తే ఈ ఖర్చు చాలా వరకు ఎక్కువ. ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాల కోసం పెళ్లి అనేది జీవితంలో ఒక పెద్ద ఆర్థిక షాక్. అప్పులు, బంగారం అమ్మకాలు, పొదుపుల త్యాగం.. అన్నీ ఒకే రోజుకి. పెళ్లి తర్వాత కొత్త జీవితం మొదలవ్వాల్సిన దశలోనే ఆర్థిక ఒత్తిడి మొదలవుతుంది. ఇక్కడ అసలు సమస్య ఖర్చు కాదు.. పోలిక. ‘వాళ్ల పెళ్లిలో ఇది చేశారు.. మనం అంతకంటే చేయాలి’ అన్న భావన. సోషల్ మీడియా ఈ పోలికను మరింత ప్రమాదకరంగా మార్చింది. ఒక పెళ్లి వీడియో వైరల్ అయితే.. అదే స్టాండర్డ్‌గా మారిపోతుంది. ఫలితంగా పెళ్లి వ్యక్తిగత నిర్ణయం కాకుండా, సామాజిక ప్రదర్శనగా మారుతోంది. ప్రేమ కంటే లైక్స్ ముఖ్యమయ్యే స్థితి ఇది.
ఇంత ఖర్చు చేసినా.. ముక్కలవుతున్న బంధం..
ఇక పశ్చిమ దేశాల్లో మరో కోణం కనిపిస్తుంది. అక్కడ పెళ్లి ఖర్చు ఎక్కువైనా, విడాకుల శాతం కూడా ఎక్కువ. అంటే ఖర్చు పెరిగినంత మాత్రాన బంధం బలపడటం లేదు. మరోవైపు, తక్కువ ఖర్చుతో పెళ్లి చేసుకునే దేశాల్లో కుటుంబ వ్యవస్థ ఇంకా బలంగా ఉంది. ఇది మనకు ఒక స్పష్టమైన సందేశం ఇస్తుంది.. పెళ్లి విలువ డబ్బులో కాదు, బాధ్యతలో ఉంది. భవిష్యత్తులో ఈ ట్రెండ్ ఎటు వెళ్తుంది? ఇప్పటికే చాలా దేశాల్లో ‘సింపుల్ వెడ్డింగ్స్’, ‘కోర్ట్ మ్యారేజ్’, ‘మైక్రో వెడ్డింగ్స్’ అనే ఆలోచనలు పాపులర్ అవుతున్నాయి. ఖర్చు తగ్గించుకొని, జీవితంపై పెట్టుబడి పెట్టాలని యువత ఆలోచిస్తోంది. ఇది ఒక సానుకూల మార్పు. ఎందుకంటే పెళ్లి ఒక ప్రారంభం ముగింపు కాదు. చివరిగా ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఒకరోజు వేడుక కోసం జీవితాంతం అప్పులు మోయాలా? లేక సాధారణంగా పెళ్లి చేసుకొని, ప్రశాంతంగా జీవించాలా? ఈ గణాంకాలు ఏం చెప్తున్నాయంటే.. పెళ్లి ఎంత ఖరీదైనదైనా, సంతోషాన్ని కొనలేం. నిజమైన సంపద పెళ్లి ఖర్చులో కాదు.. పెళ్లి తర్వాత జీవితంలో ఉంటుంది.
