Begin typing your search above and press return to search.

ప్రపంచంలోనే ప్రశాంతమైన దేశం ఇదే... భారత్ స్థానం తెలుసా?

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మూడో ప్రపంచ యుద్ధ ఛాయలు కనిపిస్తున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   23 Jun 2025 4:00 AM IST
ప్రపంచంలోనే ప్రశాంతమైన దేశం ఇదే... భారత్  స్థానం తెలుసా?
X

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మూడో ప్రపంచ యుద్ధ ఛాయలు కనిపిస్తున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే భీకర యుద్ధాలు చోటు చేసుకున్నాయి. సుమారు మూడేళ్లుగా రష్యా – ఉక్రెయిన్ వార్ అవిరాంగంగా సాగుతుండగా.. గాజాలో ఏమాత్రం కనికరం లేనట్లుగా ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. దీంతో.. పాలస్తీనా ప్రజల పరిస్థితి పరిస్థితి అత్యంత దయణీయంగా మారింది.

ఇక ఈ ఏడాది ఏప్రిల్ లో భారత్ - పాక్ మధ్య యుద్ధం జరిగింది. ప్రశాంతమైన ప్రాంతంలో ఉన్న పర్యాటకులపై పాక్ ప్రేరేపిత ఉగ్రమూకలు చేసిన దాడి, దానికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ తో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో పది రోజుల క్రితం పశ్చిమాసియాలోనూ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇందులో భాగంగా.. ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య యుద్ధం మొదలైంది.

పైగా.. తాజాగా ఈ యుద్ధంలోకి అమెరికా కూడా ఎంట్రీ ఇవ్వడంతో ఈ యుద్ధం మరింత విస్తరించొచ్చనే చర్చ మొదలైంది. ఇదే.. మూడో ప్రపంచయుద్ధాన్నికి నాంది అయ్యే అవకాశాలను కొట్టిపారేయలేమని అంటున్నారు. ఇలా ప్రపంచంలో ఎటు చూసినా సంఘర్షణలు, యుద్ధాలు, హింసాత్మక వాతావరణం, అశాంతి నెలకొన్నాయి. దీంతో.. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనలతో బిక్కుబిక్కుమంటున్నారు.

మరికొంతమంది వలసలు వెళ్లిపోతున్నారు. ఈ యుద్ధాల వల్ల ఆయన దేశాల ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్ తో అవిరామంగా యుద్ధం చేస్తోన్న రష్యా ఆర్థిక వ్యవస్థ మాంద్యానికి ముంగిట్లో ఉందని అంటున్నారు. ఇజ్రాయెల్ తో యుద్ధంలో ఇరాన్ కూడా ఆర్థికంగా తీవ్రంగా దెబ్బ తింటుందని, దానికి ఆదాయ వనరులను కోల్పోతుందని చెబుతున్నారు.

ఇక భారత్ తో యుద్ధం ఫలితంగా... పాక్ అన్ని విధాలా కష్టాల్లో కూరుకుపోయిందని అంటున్నారు. అటు ఆర్థికంగా అప్పటికే ఇబ్బందుల్లో ఉన్న దేశం.. ఇప్పుడు మరింత కష్టాల్లో కూరుకుందని చెబుతున్నారు. పైగా.. సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారత్ రద్దుచేయడంతో.. త్వరలో పాక్ కు నీటి కష్టాలు తప్పవని చెబుతున్నారు. ఈ సమయంలో.. ప్రపంచంలో ప్రశాంతమైన దేశం ఎక్కడ ఉంది అనే సెర్చ్ నెట్టింట పెరిగింది.

అవును... వాస్తవానికి మనిషి ఆలోచనలు కోవిడ్ కి ముందు, తర్వాత అన్నట్లుగా మారాయని అంటున్నారు. అప్పట్లో తరతరాలకు సంపాదించాలని, భారీ ప్లాన్ లు వేయాలని చాలా మంది భావించేవారని.. అయితే కోవిడ్ అనంతరం ఆ ఆలోచన మారిందని.. ఉన్నంత కాలం సంతోషంగా, ప్రశాంతంగా జీవించాలని మెజారిటీ జనం భావిస్తున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రశాంతమ్మైన దేశంపై సెర్చ్ మొదలైంది.

తాజాగా గ్లోబల్ పీస్ ఇండెక్స్ - 2025 నివేదిక విడుదలైంది. ఈ నివేదిక ప్రతిఏటా విడుదలవుతుంది. ఈ రిపోర్టును ఇనిస్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ (ఐఈపీ) అనే సంస్థ విడుదల చేస్తుంది. ఈ నివేదిక ప్రకారం.. ప్రపంచంలో శాంతి గతేడాదితో పోల్చితే 0.36 శాతం క్షిణించగా.. రెండో ప్రపంచయుద్ధం తర్వాత ప్రపంచంలో తొలిసారి ఇప్పుడే అత్యధికంగా అశాంతి నెలకొంది.

గత 17 ఏళ్లుగా ప్రతి దేశంలో శాంతి 5.4 శాతం మేర తగ్గిపోయినట్లు తేలిందని వెల్లడించిన నివేదిక... 74 దేశాల్లో గతంతో పోల్చితే కొంత మెరుగైన పరిస్థితి ఉందని వివరించింది. ఓవరాల్ గా ప్రపంచంలోని అన్ని దేశాలను పరిగణలోకి తీసుకుంటే మాత్రం... గత రెండు దశాబ్దాలుగా 11.7 శాతం శాంతి క్షీణించినట్లు తాజా నివేదిక పేర్కొంది. ఇది ఆందోళన కలిగించే అంశం అని అంటున్నారు.

ఈ క్రమంలో తాజా నివేదిక ప్రకారం... ప్రపంచంలోనే అత్యంత ప్రశాంతమైన దేశంగా ఐస్ ల్యాండ్ నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ఐర్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ ఉన్నాయి. ఇక చివరి స్థానం 163లో రష్యా, 162వ స్థానంలో ఉక్రెయిన్, 161వ స్థానంలో సూడాన్, 160వ స్థానంలో కాంగో ఉన్నాయి. ప్రస్తుతం యుద్ధంలో ఉన్న ఇజ్రాయెల్ స్థానం 155గా ఉంది.

ఇక భారత్ విషయానికొస్తే... ఈ నివేదికలో ఈ దేశం స్థానం 115 కాగా... పక్కనున్న పాకిస్థాన్ 144వ స్థానంలో ఉంది. ఇక.. బంగ్లాదేశ్ స్థానం 123 కాగా.. ఆఫ్ఘనిస్థాన్ 158 స్థానంలో ఉంది. ఈ సందర్భంగా టాప్ 10 ప్రశాంతమైన దేశాల జాబితా ఇప్పుడు చూద్దామ్..!

1. ఐస్ లాండ్

2. ఐర్లాండ్

3. న్యూజిలాండ్

4. ఆస్ట్రియా

5. స్విట్జర్లాండ్

6. సింగపూర్

7. పోర్చుగల్

8. డెన్మార్క్

9. స్లొవేనియా

10. ఫిన్లాండ్