ధనవంతులు తరలిపోతున్నారు.. ప్రపంచంలో వీరి టాప్ గమ్యస్థానాలివే!
. ఈ విషయంలో యూకే తర్వాత స్థానంలో 7,800 మంది ధనవంతులతో చైనా రెండో స్థానంలో ఉందని చెబుతున్నారు.
By: Tupaki Desk | 26 Jun 2025 2:00 AM ISTఇతర దేశాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా నివాసం, పౌరసత్వం పొందడం కోసం ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ధనవంతులు, అధిక నికర విలువ గల వ్యక్తులు, 1 మిలియన్ డాలర్ కంటే ఎక్కువ లిక్విడ్ ప్రాపర్టీస్ ఉన్నవారు తీవ్ర ఆసక్తి చూపిస్తున్నారని ప్రపంచ కన్సల్టెన్సీ దిగ్గజం హెన్లీ & పార్టనర్స్ తెలిపింది. ఈ సందర్భంగా షాకింగ్ విషయాలు వెల్లడించింది.
అవును... 2025 నాటికి సుమారు 1,42,000 మంది మిలియనీర్లు కొత్త దేశానికి తరలివెళ్లే అవకాశం ఉందని.. పెట్టుబడి ద్వారా నివాసం, పౌరసత్వం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రపంచ కన్సల్టెన్సీ దిగ్గజం హెన్లీ & పార్టనర్స్ తెలిపింది. వీరి సంఖ్య 2026 నాటికి 1,65,000కి పెరుగుతుందని అంచనా వేసింది. ఈ విషయాలను హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్ట్ - 2025 వెల్లడించింది.
ఈ విషయంలో ప్రపంచ వ్యాప్తంగా మిలియనీర్లను ఆకర్షించే విషయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) టాప్ ప్లేస్ లో ఉందని ఈ నివేదిక వెల్లడించింది. ఆ తర్వాత స్థానాల్లో అమెరికా, ఇటలీ, స్విట్జర్లాండ్, సౌదీ అరేబియా కూడా మిలియనీర్లకు ఇష్టమైన గమ్యస్థానాలుగా ఉన్నాయని తెలిపింది. అయితే.. యూకే నుంచి ఎక్కువ మంది ఇతరదేశాలకు తరలిపోతున్నారని అంటున్నారు.
ఇందులో భాగంగా... యునైటెడ్ కింగ్ డమ్ లో ఒకే సంవత్సరంలో పెద్ద ఎత్తున ధనవంతులు ఇతర దేశాలకు వలసవెళ్లిపోయారని.. వీరి సంఖ్య సుమారు 16,500గా ఉందని అంచనా వేస్తున్నారు. ఈ విషయంలో యూకే తర్వాత స్థానంలో 7,800 మంది ధనవంతులతో చైనా రెండో స్థానంలో ఉందని చెబుతున్నారు. ఇదే క్రమంలో... భారత్ 3,500 మంది మిలియనీర్లను కోల్పోనుందని చెబుతున్నారు.
ఇలా తమ తమ దేశాలను వదిలి ఇతర దేశాలకు వలసవెళ్తున్నవారిలో ఎక్కువమంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ని తమ గమ్యస్థానంగా ఎంచుకుటుండగా.. 2025 నాటికి 9,800 మంది ఈ హోదాలో అక్కడ నివాసం పొందుతారని అంచనా వేయబడింది. గత సంవత్సరం వీరి సంఖ్య 6,700 మందిగా ఉందని నివేదికలు చెబుతున్నాయి.
ఇక మిలియనీర్ల గమ్యస్థానంగా నిలవడంలో ఈ ఏడాది అమెరికా రెండవ స్థానంలో ఉంటుందని అంచనా వేయబడింది. తాజా అంచనాల ప్రకారం.. సుమారు 7,500 మంది కొత్త మిలియనీర్లు అమెరికాకు వలసపోయే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే సమయంలో అమెరికా తర్వాత స్థానాల్లో ఇటలీ, స్విట్జర్లాండ్ లు తదుపరి స్థానాల్లో ఉన్నాయని చెబుతున్నారు.
కాగా... అమెరికా పౌరసత్వం పొందాలనుకునే సంపన్నుల కోసం అమెరికా అధ్యక్షుడు "ట్రంప్ కార్డు" అంటూ సరికొత్త పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... 5 మిలియన్ డాలర్లు చెల్లించి ఈ కార్డును సొంతం చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా సంపన్నులను ఆకర్షించేందుకు ట్రంప్ ఈ ప్రయత్నం షురూ చేసిన సంగతి తెలిసిందే.
