Begin typing your search above and press return to search.

ప్రపంచాన్ని అప్పులే నడిపిస్తున్నాయా? గ్లోబల్ డెట్ ఎంతో తెలిస్తే షాక్..

కరోనా మహమ్మారి సృష్టించిన ఆర్థిక సంక్షోభం నుంచి ప్రపంచం కోలుకుంటోందని సంతోషించే లోపే, అంతర్జాతీయ ఆర్థిక రంగం నుంచి ఒక భయాందోళన కలిగించే వార్త బయటకు వచ్చింది.

By:  Tupaki   |   25 May 2026 12:35 PM IST
ప్రపంచాన్ని అప్పులే నడిపిస్తున్నాయా? గ్లోబల్ డెట్ ఎంతో తెలిస్తే షాక్..
X

కరోనా మహమ్మారి సృష్టించిన ఆర్థిక సంక్షోభం నుంచి ప్రపంచం కోలుకుంటోందని సంతోషించే లోపే, అంతర్జాతీయ ఆర్థిక రంగం నుంచి ఒక భయాందోళన కలిగించే వార్త బయటకు వచ్చింది. ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీద ఉన్న అప్పుల భారం ఏకంగా 345 ట్రిలియన్ డాలర్ల నుంచి 350 ట్రిలియన్ డాలర్ల మార్కుకు చేరింది. అంటే మన కరెన్సీలో దాదాపు 29 వేల లక్షల కోట్ల రూపాయలు అన్నమాట. మానవ చరిత్రలోనే ఇంతటి భారీ స్థాయిలో అప్పులు పేరుకుపోవడం ఇదే మొదటిసారి అని రికార్డులు చెబుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్యాంకులు, ఆర్థిక సంస్థల ప్రతినిధి అయిన 'ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్' (ఐఐఎఫ్) తాజా విడుదల చేసిన గ్లోబల్ డెట్ మానిటర్ నివేదిక ప్రకారం కళ్లు బైర్లు కమ్మే లెక్కలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత ఒక్క ఏడాదిలోనే దాదాపు 29 ట్రిలియన్ల కొత్త అప్పులు వచ్చి చేరాయని ఆ నివేదిక స్పష్టం చేసింది. కరోనా మహమ్మారి కాలం తర్వాత ఇంత వేగంగా అప్పులు పెరగడం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. ఈ అప్పుల కుప్ప ఇలా పేరుకుపోవడానికి ప్రభుత్వాలతోపాటు కార్పొరేట్ సంస్థలు కూడా కారణమని అంటున్నారు.

ఎవరి వాటా ఎంత?

అప్పు అనగానే కేవలం ప్రభుత్వాలు చేసేదే అని అంతా భావిస్తుంటారు. కానీ, ఐఐఎఫ్ విడుదల చేసిన నివేదికలో ప్రభుత్వాలతోపాటు కొన్ని ప్రైవేటు కార్పొరేట్ సంస్థలు కూడా భారీగా అప్పులు చేసినట్లు వెల్లడైంది.. ఈ 348 ట్రిలియన్ డాలర్ల రుణ సామ్రాజ్యంలో మూడు ప్రధాన రంగాలు ఉన్నట్లు ఆ నివేదిక వెల్లడించింది. ప్రభుత్వాలు చేసిన అప్పులు దాదాపు 106.7 ట్రిలియన్ డాలర్లు కాగా, కార్పొరేట్ అప్పులు సుమారు 100.6 ట్రిలియన్ డాలర్లుగా చెబుతున్నారు. ప్రభుత్వాలు తమ బడ్జెట్ లోటును పూడ్చుకోవడానికి అప్పులపై ఆధారపడుతున్నాయని, అదే సమయంలో వ్యాపారాల విస్తరణ కోసం కంపెనీలు రుణాలు తీసుకుంటున్నాయని ఐఐఎఫ్ వివరించింది. ఇక సాధారణ ప్రజలు ఇళ్లు, వాహనాలు, వ్యక్తిగత అవసరాల కోసం తీసుకున్న రుణాలు కూడా సుమారుగా 64.6 ట్రిలియన్ డాలర్లు ఉన్నాయని ఆ నివేదికలో వివరించారు.

అప్పులే ఆధారమా?

అంతర్జాతీయ బిజినెస్ వెబ్‌సైట్ల విశ్లేషణ ప్రకారం, ఈ అప్పుల పరుగుకు మూడు ముఖ్యమైన కారణాలు ఉన్నాయని అంటున్నారు. రక్షణ రంగంపై భారీ ఖర్చులు చేయడం ద్వారా అమెరికా, చైనా, యూరప్ దేశాలు తమ రక్షణ బడ్జెట్‌లను విపరీతంగా పెంచేసి, అందుకోసం భారీగా అప్పులు చేస్తున్నాయని అంటున్నారు. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లీన్ ఎనర్జీ వంటి టెక్నాలజీ ప్రపంచంలో ఏఐ డేటా సెంటర్ల నిర్మాణం కోసం, పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం కార్పొరేట్ కంపెనీలు బాండ్ మార్కెట్ ద్వారా వేల కోట్ల డాలర్లను అప్పుగా సేకరిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. ఇక పాత అప్పులపై వడ్డీలు కట్టడానికే ప్రభుత్వాలు మళ్లీ కొత్త అప్పులు చేయాల్సి వస్తోందని అంటున్నారు. ఉదాహరణకు, అమెరికా రక్షణ రంగానికి పెట్టే ఖర్చు కంటే, తన అప్పులపై కట్టే వడ్డీయే ఎక్కువైపోయిందని ఐఐఎఫ్ వెల్లడించింది.

టాప్ లో ఉన్న దేశాలు ఇవే..!

అప్పులు ఎక్కువగా చేస్తున్న దేశాల్లో సింహభాగం అగ్రరాజ్యాలే ఉండటం గమనార్హం. అమెరికా, చైనా, ఫ్రాన్స్, ఇటలీ దేశాలు మొత్తం అప్పులో మూడొంతులు చేశాయని చెబుతున్నారు. అభివృద్ధి చెందిన దేశాల అప్పులు ఒక ఎత్తయితే, భారత్ లాంటి ఎదుగుతున్న దేశాల అప్పులు వాటి జీడీపీలో రికార్డు స్థాయిలో 235 శాతానికి పైగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

సామాన్యుడికి వచ్చే నష్టం ఏంటి?

ప్రపంచ దేశాలు అప్పులు చేసుకుంటే మాకేంటి? అని సామాన్యుడు అనుకోవచ్చు. కానీ ఈ అప్పుల ప్రభావం ప్రతి ఒక్కరి జేబుపై పడుతుందని నిపుణులు వివరిస్తున్నారు. ప్రభుత్వాలు మార్కెట్ నుంచి విపరీతంగా అప్పులు సేకరిస్తుంటే, సామాన్యులకు ఇచ్చే హోమ్ లోన్లు, కార్ లోన్లపై బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచేస్తాయని చెబుతున్నారు. అదేవిధంగా ద్రవ్యోల్బణం ఎక్కువై ధరల పెరుగుదలకు కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు. ఇక ప్రభుత్వాలు అప్పులు తీర్చడానికి ప్రజలపై రకరకాల పన్నుల భారాన్ని మోపే అవకాశం ఉందని అంటున్నారు. ఇక తాజా గణాంకాల ప్రకారం అప్పుల ఆధారిత ఆర్థిక వృద్ధి ఎప్పుడైనా ప్రమాదకరమేనని అంతర్జాతీయ బిజినెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.