Begin typing your search above and press return to search.

గ్లోబల్ వార్మింగ్ పై కొత్త ఆందోళన... జిస్‌ టెంప్‌ అంటే తెలుసా?

దీంతో ఇప్పటికైనా మేల్కొనకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పర్యావరణ ప్రియులు, శాస్త్రవేత్తలు!

By:  Tupaki Desk   |   26 Sep 2023 3:11 PM GMT
గ్లోబల్  వార్మింగ్  పై కొత్త ఆందోళన... జిస్‌  టెంప్‌  అంటే తెలుసా?
X

సీజన్ తో సంబంధం లేదు.. వర్షాకాలం, శీతకాలం అనే తారతమ్యాలేమీ లేవు.. ప్రతీ కాలమూ ఎండాకాలమే అవుతున్న పరిస్థితి! ఇదే సమయంలో వర్షం కురవని ప్రతీ మద్యాహ్నమూ రోహిణీ కార్తే అన్నట్లుగా ఉంది ఎండల ప్రతాపం. ఇక ఈ ఏడాది బండలను బద్దలు కొట్టే స్థాయిలో కాసిన ఎండలపై తాజాగా సరికొత్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు శాస్త్రవేత్తలు.

అవును... 2023లో ఎండలు ఏస్థాయిలో ఉన్నాయనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు! గ్రామాలూ, పట్టణాలు, మెట్రోపాలిటన్ నగరాలు అనే తారతమ్యాలేవీ లేకుండా భానుడు తన ప్రతాపాన్ని చూపించాడు. అయితే 1880లో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ వివరాలు నమోదు చేయడం మొదలు పెట్టిన నాటినుంచి 2023 లో నమోదైన ఉష్ణోగ్రతలే టాప్ అని అంటున్నారు.

ఇలా అత్యంత వేడితోకూడిన వేసవితో ఈ ఏడాది ఎండలు రికార్డు సృష్టించాయి. తాజాగా ఈ ఆందోళనకర గణాంకాలను న్యూయార్క్‌ లోని నాసాకు చెందిన గొడార్డ్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ వెల్లడించింది. దీంతో ఇప్పటికైనా మేల్కొనకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పర్యావరణ ప్రియులు, శాస్త్రవేత్తలు!

ఇలా ఈ ఏడాది మండిన ఎండలు పాత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టి పర్యావరణ ప్రియుల ఆందోళనలను మరింతగా పెంచాయి. ఇందులో ప్రధానంగా జూన్, జూలై, ఆగస్ట్‌ మాసాల్లో ఉమ్మడి ఉష్ణోగ్రతలు గత అన్ని గణాంకాల కంటే 0.23 డిగ్రీ సెంటిగ్రెడ్‌ ఎక్కువగా నమోదయ్యాయని చెబుతున్నారు.

భూ ఉపరితల ఉష్ణోగ్రతలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేల వాతావరణ కేంద్రాల ద్వారా నాసా ఎప్పటికప్పుడు సేకరిస్తుంది. ఈ నాసా ఉష్ణోగ్రతల రికార్డు పద్ధతిని "జిస్‌ టెంప్‌" అని పిలుస్తారు. ఇదే సమయంలో భూమిపై వాతావరణాన్నే కాకుండా... నౌకలు మొదలగు మార్గాల ద్వారా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలను కూడా సేకరిస్తారు.

ఇలా గణనీయంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల సంభవించబోయే దుష్ప్రభావం మున్ముందు ప్రపంచం మొత్తం మీదా చెప్పలేనంతగా ఉండనుందని హెచ్చరిస్తున్నారు నాసా అడ్మినిస్ట్రేటర్‌ బిల్‌ నెల్సన్! ఇదే క్రమంలో... సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో అత్యంత హెచ్చుదల నమోదవడమే ఈసారి ఎండలకు ప్రధాన కారణమని నాసా వాతావరణ శాస్త్రవేత్త జోష్‌ విల్లిస్ అంటున్నారు!

మనిషి ప్రవర్తన ఇలానే కొనసాగితే... ముందు ముందు ఉష్ణోగ్రతల్లో పెరుగుదలే తప్ప తగ్గుదల ఉండదని.. ఇప్పటికైనా మేలుకుని విచ్చలవిడిగా సాగిస్తున్న పర్యావరణ విధ్వంసానికి అడ్డుకట్ట వేయడం ప్రపంచ దేశాల ముందున్న తక్షణ కర్తవ్యం అని అంటున్నారు వాతావరణ శాస్త్రవేత్తలు. అలాకానిపక్షంలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు.