Begin typing your search above and press return to search.

గిడుగు పలుకు... రాహుల్ గాంధీ వదిలిన బాణం!

అవును... ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్న షర్మిళ.. తన ఫస్ట్ స్పీచ్ తోనే ప్రజలకు ఒక క్లారిటీ ఇచ్చేశారు.

By:  Tupaki Desk   |   21 Jan 2024 7:48 PM GMT
గిడుగు పలుకు... రాహుల్  గాంధీ వదిలిన బాణం!
X

ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ పార్టీకి కదలిక వచ్చిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇంతకాలం సున్నాకీ, మైనస్ వన్ కీ మధ్యలో ఉందనే కామెంట్లు సొంతం చేసుకున్న ఆ పార్టీకి ఉన్నపలంగా కొత్త ఉత్సాహం వచ్చింది! వైఎస్సార్ కుమార్తె షర్మిల ఏపీసీసీ బాధ్యతలు చేపట్టడంతో ఆ పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చిందని, చేరికలు కూడా బాగానే ఉండొచ్చనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో పీసీసీ మాజీ చీఫ్ గిడుగు రుద్రరాజు స్పందించారు. ఈ సందర్భంగా షర్మిలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్న షర్మిళ.. తన ఫస్ట్ స్పీచ్ తోనే ప్రజలకు ఒక క్లారిటీ ఇచ్చేశారు. ఇందులో భాగంగా తనకు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు సమాన దూరంలోనే ఉన్నాయనే సంకేతాలు పంపారు. ఈ సమయంలో స్పందించిన గిడుగు రుద్రరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ సుశిక్షత సైనికురాలిలా పని చేయడానికి షర్మిల వచ్చారని.. ఆమె రాహుల్ గాంధీ వదిలిన బాణమని అన్నారు.

ఇదే సమయంలో రాజన్న బిడ్డ రావాలి.. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టాలి.. ఆమె నేతృత్వంలో పని చేయాలని కోరుకున్నామని, అనుకున్నట్లుగానే వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారని గిడుగు చెప్పుకొచ్చారు. ఫలితంగా... ఈసారి ఏపీలోని చట్టసభల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతుందని అన్నారు.

ఈ క్రమంలో... ఇప్పటికే కేవీపీ రామచంద్రరావుపై పార్టీ హైకమాండ్ గురుతర బాధ్యత పెట్టిందని చెప్పిన రుద్రరాజు... పార్టీ సీనియర్ నేతలంతా గైడింగ్ ఫోర్సుగా ఉంటారని, ఆ విధంగా వైఎస్ షర్మిలకు సహకరిస్తారని అభిప్రాయపడ్డారు. ఫలితంగా... కాంగ్రెస్ పార్టీకి ఏపీలో ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని రుద్రరాజు వ్యాఖ్యానించారు.