ఈశ్వరి - రాజేశ్వరి.. రాజకీయాలు ముగిసినట్టేనా ?
దీంతో ప్రస్తుతం గిడ్డి ఈశ్వరి దాదాపు రాజకీయాలకు దూరంగా ఉన్నారనే చెప్పాలి. ఇక రంపచోడవరం నియోజకవర్గం నుంచి 2014లో విజయం దక్కించుకున్న ఎస్టీ నాయకురాలు వంతల రాజేశ్వరి పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది.
By: Tupaki Desk | 13 July 2025 6:00 AM ISTరాజకీయాల్లోకి అనూహ్యంగా వచ్చిన ఇద్దరు గిరిజన మహిళా నాయకులు.. అంతే అనూహ్యంగా రాజకీయాల నుంచి దాదాపు తప్పుకునే పరిస్థితి వచ్చింది. వైసిపి నుంచి రాజకీయాల ప్రారంభించిన ఆ ఇద్దరు మహిళలు కూడా ఎస్టీ సామాజిక వర్గానికి చెందినవారు కావడం గమనార్హం. అంతేకాదు ఎస్టీ సామాజిక వర్గంలో బలమైన వాయిస్ ఉన్న నాయకులుగా కూడా వారు గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే 2016 -17 మధ్య కాలంలో పార్టీలు మారిన నేపథ్యంలో వారి ఇమేజ్ దాదాపు పతనమైందనే చెప్పాలి. వారే ఒకరు పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, మరొకరు రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి.
పాడేరు నుంచి 2014లో విజయం దక్కించుకున్న గిడ్డి ఈశ్వరి వైసీపీలో అనతి కాలంలోనే గుర్తింపు దక్కించుకున్నారు. అయితే 2016 -17 మధ్యకాలంలో పార్టీ మారిన నేపథ్యంలో గిడ్డి ఈశ్వరి ప్రభావం కోల్పోయారు. వాస్తవానికి అప్పటి చంద్రబాబు మంత్రి పదవి ఇస్తారని ఆశపడి ఆమె వైసీపీకి రామ్ రామ్ చెప్పి.. టిడిపి సైకిల్ ఎక్కారు. కానీ అనూహ్యంగా ఆమెకు మంత్రి పదవి దక్కలేదు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసిన వైసీపీ హవా.. జగన్ పాదయాత్ర నేపథ్యంలో ఆమె పరాజయం పాలయ్యారు. ఇక ఆ తర్వాత 2024 లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది.
దీంతో ప్రస్తుతం గిడ్డి ఈశ్వరి దాదాపు రాజకీయాలకు దూరంగా ఉన్నారనే చెప్పాలి. ఇక రంపచోడవరం నియోజకవర్గం నుంచి 2014లో విజయం దక్కించుకున్న ఎస్టీ నాయకురాలు వంతల రాజేశ్వరి పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. 2014లో వైసీపీ తరఫున గెలిచిన తర్వాత కాలంలో ఆమె టిడిపి సైకిల్ ఎక్కారు. అయితే అనుకున్న విధంగా ఆమెకు గుర్తింపు లభించలేదు. అంతర్గతంగా కూడా టీడీపీలో ఆమెకు వ్యతిరేక రాజకీయాలు సాగాయి. దీంతో రాజేశ్వరికి వ్యతిరేకంగా టీడీపీ నాయకులు ఉద్యమించిన విషయం అప్పట్లో కలకలం రేపింది. పైగా గత ఏడాది జరిగిన ఎన్నికల్లో టికెట్ కూడా దక్కలేదు.
దీంతో రాజేశ్వరి తీవ్రంగా హర్ట్ అయ్యారు. ప్రస్తుతం టిడిపిలో ఉన్నారో లేదో అన్నట్టుగా వంతల రాజేశ్వరి వ్యవహరిస్తున్నారని స్థానికంగా వినిపిస్తున్న మాట. ఏది ఏమైనా ఈశ్వరి- రాజేశ్వరి ఇద్దరూ కూడా వైసీపీలో ఉండి ఉంటే గత ఐదేళ్లలో వారికి మంచి గుర్తింపు లభించి ఉండేదని స్థానికంగా వినిపిస్తున్న మాట. ఇక ఇప్పుడున్న పరిస్థితులు.. ఆ రెండు నియోజకవర్గాల్లో కూడా వైసిపి బలంగా ఉండడం.. మరోవైపు కూటమిలో కూడా రాజకీయాలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఈశ్వరి -రాజేశ్వరి రాజకీయాలు దాదాపు ముగిసినట్టేనని పరిశీలకులు భావిస్తున్నారు.
