Begin typing your search above and press return to search.

వైసీపీ ఎమ్మెల్యే ను బాయ్ కాట్ చేసిన సర్పంచ్, ఎంపీటీసీ

తమ గ్రామాభివృద్ధిని ఎమ్మెల్యే అసలు పట్టించుకోవడంలేదని వారు అన్నారు

By:  Tupaki Desk   |   11 Aug 2023 8:42 AM GMT
వైసీపీ ఎమ్మెల్యే ను బాయ్ కాట్ చేసిన సర్పంచ్, ఎంపీటీసీ
X

సొంత పార్టీ ఎమ్మెల్యే తీరుని నిరసిస్తూ ఆయన కార్యక్రమాలను ఆ పార్టీ వారే బాయ్ కాట్ చేసిన తీరు రాజకీయంగా చర్చనీయాంశం అవుతంది. ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు తాజాగా నిర్వహించిన గడప గడపకు కార్యక్రమాన్ని సొంత పార్టీ సర్పంచ్, ఎంపీటీసీలే బాయ్ కాట్ చేయడం విశేషం.

గిద్దలూరు నియోజకవర్గం ఎల్ కోట పంచాయతీలోని లింజోజీపల్లి, సూరేపల్లి గ్రామాలలో ఎమ్మెల్యే రాంబాబు గడప గడప కార్యక్రమం చేపట్టారు. అయితే స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే తీరుని నిరసిస్తూ ఆయన వెంట ఎవరూ వెళ్లరాదని నిర్ణయం తీసుకున్నారు. ఎల్ కోట పంచాయతీ వైసీపీ సర్పంచ్ షేక్ మహమ్మద్ భాషా, అలాగే ఎంపీటీసీ మెంబర్ రావూరి రవీంద్రనాధ్ ఎమ్మెల్యే మీద విమర్శలు చేశారు.

తమ గ్రామాభివృద్ధిని ఎమ్మెల్యే అసలు పట్టించుకోవడంలేదని వారు అన్నారు. గ్రామాలలో పనులు చేసేందుకు ఆయన అసలు సహకరించడంలేదని కూడా వారు మండిపడ్డారు. తన సొంత గ్రామంలో అభివృద్ధి పనులు చేయలేకపోవడం వల్ల ఎవరికీ ముఖాలు సైతం చూపించలేకపోతున్నామని అన్నారు.

ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులను ఎమ్మెల్యే కాదని ఎవరో అనామకులను తన మనుషులను పక్కన పెట్టుకుని వారినే ప్రతినిధులుగా చేసుకుని పనులు చేయిస్తున్నారని వారు విమర్శించారు. ఎమ్మెల్యే అన్నా రాంబాబు వైఖరి ఏ మాత్రం తగిన విధంగా లేదని వారు ఫైర్ అయ్యారు.

ఇదిలా ఉండగా అన్నా రాంబాబు వైఖరికి విసుగెత్తిన ఈ ఇద్దరు నాయకులు ఇటీవల హైదరాబాద్ లో ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. మరి బాలినేని ఏ రకంగా సెట్ చేస్తారో తెలియదు కానీ సొంత సర్పంచ్ ఎంపీటీసీ బాయ్ కాట్ చేసిన తరువాత ఎమ్మెల్యేకు రాజకీయంగా అది సమస్యగా మారిందని అంటున్నారు.

ఇక మరో వైపు చూస్తే పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఆర్ధిక సంఘం నిధులను సకాలంలో అందించాలని డిమాండ్ చేస్తూ గిద్దలూరు మండల సర్వ సభ్య సమావేశంలో సర్పంచులు నిరసన తెలియచేయడం విశేషం. ఈ సమావేశంలో సర్పంచులు అంతా కుర్చీలను సైతం కాదని నేల మీద కూర్చుని నిరసన తెలియచేయడం జరిగింది.

నిధులు లేకపోవడం వల్ల పంచాయతీలలో తాము ఎలాంటి పనులను చేయలేకపోతున్నామని సర్పంచులు మండిపడుతున్నారు. తాము ప్రజల కోసం సొంత నిధులతో కొన్ని పనులు చేసినా ఆ డబ్బులు వెనక్కి రాక అప్పుల పాలు అయి నానా అవస్థలు పడుతున్నామని కూడా అంటున్నారు. మొత్తానికి చూస్తే వైసీపీకి సొంత పార్టీ సర్పంచులు నుంచే నిరసన సెగ తగలడం విశేషంగా చూస్తున్నారు.