Begin typing your search above and press return to search.

అంతకంతకూ పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. దీనికి కారణమేంటి?

మాల్స్ గురించి విన్నాం. ఈ ఘోస్ట్ మాల్స్ అంటే ఏమిటి? ఇటీవల కాలంలో పలువురి నోటి నుంచి ఘోస్ట్ మాల్స్ మాట వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   8 May 2024 8:30 AM GMT
అంతకంతకూ పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. దీనికి కారణమేంటి?
X

మాల్స్ గురించి విన్నాం. ఈ ఘోస్ట్ మాల్స్ అంటే ఏమిటి? ఇటీవల కాలంలో పలువురి నోటి నుంచి ఘోస్ట్ మాల్స్ మాట వినిపిస్తోంది. తాజాగా విడుదలైన ఒక నివేదిక సైతం దేశంలో ఘోస్ట్ మాల్స్ పెరుగుతున్నట్లుగా పేర్కొంది. మెరుగైన షాపింగ్ అనుభవం కోసం మాల్స్ కు వెళ్లే వారి సంఖ్య తగ్గుతుందని.. దాన్ని ఆన్ లైన్ భర్తీ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. తాజాగా ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా ఒక రిపోర్టును సిద్ధం చేసింది. అందులో ఘోస్ట్ మాల్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించి.. దేశంలో ఈ తరహా మాల్స్ పెరిగినట్లుగా పేర్కొంది.

ఘోస్ట్ మాల్స్ ను సింఫుల్ భాషలో అర్థమయ్యేలా చెప్పాలంటే.. మాల్ ప్రాపర్టీలో 40 శాతం స్థలం ఖాళీగా ఉంటే దీన్ని ఘోస్ట్ మాల్ గా అభివర్ణిస్తారు. కరోనా తర్వాత ఇవి పెరుగుతున్నాయి. దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో ఈ ఘోస్ట్ మాల్స్ కు సంబంధించిన గణాంకాల్ని చూస్తే.. 2022లో ఘోస్ట్ మాల్స్ 57 వరకు ఉండగా.. 2023 నాటికి 64కు పెరిగినట్లుగా తాజా రిపోర్టు వెల్లడించింది.

థింక్ ఇండియా.. థింక్ రిటైల్ 2024 పేరిట రూపొందించిన ఈ రిపోర్టులో పలు ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు. 29 నగరాల్లో 58 హైస్ట్రీట్స్.. 340 షాపింగ్ సెంటర్లపై అధ్యనం చేపట్టిన తర్వాత నైట్ ఫ్రాంక్ తాజా రిపోర్టును సిద్ధం చేసింది. దేశ వ్యాప్తంగా గత ఏడాది 64 ఘోస్ట్స్ మాల్స్ కారణంగా సుమారు 13.3 మిలియన్ చదరపు అడుగుల లీజ్ స్థలం ఎలాంటి ఉపయోగం లేదని పేర్కొన్నారు. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఈ ట్రెండ్ 58 శాతం పెరిగినట్లుగా వెల్లడించారు.

ఘోస్ట్ షాపింగ్ మాల్స్ విషయానికి వస్తే.. దేశ రాజధాని ఢిల్లీ మొదటి స్థానంలో ఉండగా.. తర్వాతి స్థానాల్లో ముంబయి.. బెంగళూరు ఉన్నట్లుగా పేర్కొంది. హైదరాబాద్ లో మాత్రం 19 శాతం మేర ఘోస్ట్ షాపింగ్ సెంటర్లు తగ్గినట్లుగా రిపోర్టు వెల్లడించింది. దేశ వ్యాప్తంగా నెలకొన్న ట్రెండ్ ను చూస్తే.. లక్ష చదరపు అడుగులు లీజు స్థలం కలిగిన చిన్న చిన్న మాల్స్ వేకెన్సీ రేటు 36 శాతం ఉండగా.. 5 లక్షల చదరపు అడుగుల కంటే ఎక్కువ ఉన్న పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో వేకెన్సీ 5 శాతమేనని పేర్కొంది. మిడ్ లెవల్ షాపింగ్ మాల్స్ వేకెన్సీ రేటు 15.5 శాతంగా పేర్కొంది.

ఘోస్ట్ మాల్స్ కారణంగా రిటైల్ సెక్టార్ కు రూ.6700 కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని పేర్కొంది. చిన్న మాల్స్ కు పెద్దగా ఆదరణ లేకపోవటం ఆయా ప్రాపర్టీ యజమానులకు సవాలుగా మారింది. గ్రేడ్ ఏ మాల్స్ వినియోగదారులతో కిటకిటలాడుతుండగా.. గ్రేడ్ సీ మాల్స్ మాత్రం ఘోస్ట్ సెంటర్లుగా మారి మూత పడుతున్న పరిస్థితి. ఈ తీరు ఆందోళనకు గురి చేస్తోందని చెబుతున్నారు.