Begin typing your search above and press return to search.

హైదరాబాద్ మేయర్ కు బెదిరింపులు.. ఏం జరిగింది?

బంజారాహిల్స్ పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 1, 2, 5 తేదీల్లో అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తి మేయర్ కు ఫోన్ చేసి అభ్యంతరకరమైన భాషతో మాట్లాడాడు.

By:  Tupaki Desk   |   8 Jun 2025 4:59 AM
హైదరాబాద్  మేయర్  కు బెదిరింపులు.. ఏం జరిగింది?
X

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీ.హెచ్.ఎం.సీ) మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి గుర్తుతెలియని వ్యక్తి నుంచి తరచూ ఫోన్ కాల్స్, బెదిరింపు ఎస్సెమ్మెస్ లు వస్తున్నాయనే విషయం తీవ్ర కలకలం రేపింది. ఈ విషయంపై ఆమె వ్యక్తిగత సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. అభ్యంతరకరమైన భాషతో బెదిరిస్తున్నట్లు తెలిపారు.

అవును... జీ.హెచ్.ఎం.సీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి వరుసగా మూడు రోజులుగా అర్ధరాత్రి ఫోన్ కాల్స్, వాయిస్ మెసేజ్ ల ద్వారా ఓ దుండగుడు బెదిరింపులకు పాల్పడిన ఘటన తాజాగా తెరపైకి వచ్చింది. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఆమెతో పాటు ఆమె తండ్రి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేశవరావును సైతం అవమానించేలా మాట్లాడాడని ఫిర్యాదు చేశారు.

బంజారాహిల్స్ పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 1, 2, 5 తేదీల్లో అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తి మేయర్ కు ఫోన్ చేసి అభ్యంతరకరమైన భాషతో మాట్లాడాడు. మేయర్ కు వాయిస్ మెసేజ్ లు పంపిస్తూ మానసికంగా వేధింపులకు గురిచేశాడు. ఆమె తండ్రి కేశవరావును సైతం అవమానించేలా మాట్లాడారు. భయంకరమైన పరిణామాలు ఎదుర్కోంటారని బెదిరించాడు.

దీనివల్ల మేయర్ గౌరవం, భద్రతా ప్రశ్నార్థకంగా మరిందని.. వేధిస్తున్న వ్యక్తిపై కఠినచర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాల్, మెసేజ్ లు చేసిన నెంబర్ ను ట్రేస్ చేస్తున్నారని అంటున్నారు!

కాగా.. మేయర్ కు ఫోన్, మెసేజ్ లు చేసిన వ్యక్తి గతంలో బోరబండలో మృతి చెందిన సర్దార్ అనే వ్యక్తికి సంబంధించిన వాడిగా పరిచయం చేసుకున్నట్లు తెలుస్తోంది.