Begin typing your search above and press return to search.

హద్దూ పద్దూ లేని వైసీపీ అబద్ధాలు...గాలి తీసేశారుగా !

బోడి గుండుకూ మోకాలికీ మధ్య లింక్ పెట్టి అసత్య ఆరోపణలు వైసీపీ నేతలు చేస్తున్నారు అని అంటున్నారు. నిజానికి హెరిటేజ్ సంస్థకు ఇందాపూర్ డెయిరీకి మధ్య సంబంధం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

By:  Satya P   |   19 Feb 2026 8:45 AM IST
హద్దూ పద్దూ లేని వైసీపీ అబద్ధాలు...గాలి తీసేశారుగా !
X

వైసీపీ నేతలు అబద్ధాలు హద్దులు దాటేస్తున్నాయి అని అంటున్నారు. అదిగో పులి ఇదిగో తోక అన్నట్లుగా లేనిపోనివి అన్నీ కలిపి వండి వార్చేస్తున్నారు. సాక్షాత్తు శాసనమండలిలోనే దీని మీద రచ్చ చేస్తున్నారు. వాస్తవాలు ఇవీ అని చెబుతున్నా వైసీపీ నేతలు అయితే ఎక్కడా ఆగడం లేదు. ఇంతకీ వైసీపీ ఎందుకు ఇంతలా ఆయాసపడుతోంది. ఎందుకు ఈ విధంగా తెగించి మాట్లాడుతోంది అంటే కల్తీ నెయ్యి వ్యవహారంలో తమ తప్పులను కప్పి పుచ్చుకోవడానికే అని టీడీపీ నేతలు అంటున్నారు. కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేశారు అని సిట్ నివేదికలో ఉంటే దాన్ని పక్కన పెట్టి ఏకంగా టీడీపీకి ఈ మొత్తం బురద అంటగట్టే ప్రయత్నం వైసీపీ చేస్తోంది అని అంటున్నారు.

టీటీడీ పకడ్బందీ చర్యలు :

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు అయితే నెయ్యి సరఫరా విషయంలో పకడ్బందీగా చర్యలను తీసుకుంటున్నారు ఇక తిరుమల నెయ్యి సరఫరా చేసేందుకు వేసిన కొత్త టెండర్ల విషయంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆయన మొత్తం కచ్చితంగా అనుసరించేలా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ కొత్త టెండర్లలో ఏదేదో జరిగిపోతోందని శాసన మండలిలో వైసీపీ నేతలు పెద్ద గొంతుకను చేసుకుని విమర్శలు చేస్తున్నారు. నిజానికి లేని దానిని ఉన్నట్లుగా చూపించడంలో వైసీపీ తన ప్రావీణ్యతను అలా చాటుకుంటోంది అని టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు.

హెరిటేజ్ కి సంబంధం ఏంటి :

బోడి గుండుకూ మోకాలికీ మధ్య లింక్ పెట్టి అసత్య ఆరోపణలు వైసీపీ నేతలు చేస్తున్నారు అని అంటున్నారు. నిజానికి హెరిటేజ్ సంస్థకు ఇందాపూర్ డెయిరీకి మధ్య సంబంధం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం మీద వైసీపీకి చెందిన విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ హెరిటేజ్ కు సంబంధం ఉన్న ఇందాపూర్ డెయిరీకి టెండర్లు అప్పగించారని అడ్డగోలు ఆరోపణలు చేశారు అని అంటున్నారు. అంతే కాదు ఇందాపూర్ కు రేట్లు పెంచేసి ఇచ్చారంటూ ఒకటే రచ్చ వైసీపీ చేస్తూ వస్తుంది. నిజానికి హెరిటేజ్ కి ఇందాపూర్ డెయిరీకి ఎక్కడా సంబంధం లేదని అంటున్నారు. దానికి కచ్చితమైన ఆధారాలతో సైతం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వివరించారు కూడా.

విషయం అదన్న మాట :

ఇక దీని మీద టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టంగా చెప్పుకొచ్చారు. నెయ్యి కొనుగోలులో ఎంఆర్ ఎల్ స్కోర్ బోర్డు విధానాన్ని తమ బోర్డు అమల్లోకి తీసుకొచ్చిందని కూడా ఆయన చెప్పారు. ఇక .నెయ్యి సేకరణను 1500 కిలోమీటర్ల నుంచి 800 కిలోమీటర్లకు తగ్గించి దాని నాణ్యాను పూర్తిగా పెంచేందుకు చర్యలను తీసుకుంటున్నామని కూడా వివరించారు ఇక ఇందాపూర్ డెయిరీకి హెరిటేజ్ కు అసలు సంబంధమే లేదని బీఆర్ నాయుడు చెప్పారు. ఇందాపూర్ డెయిరీ నుంచి హెరిటేజ్ కేవలం చీజ్ మాత్రమే కొంటుందని ఆయన గుర్తు చేశరు. ఇది కేవలం హెరిటేజ్ సంస్థ మాత్రమే కాదు చాలా సంస్థలు ఇందాపూర్ డెయిరీ నుంచే కొంటాయని ఆయన గుర్తు చేశారు.

అంతా తప్పుడు ప్రచారం :

వైసీపీ హయాంలో కూడా అప్పటి టీటీడీ బోర్డు టెండర్లు కట్టబెట్టిన అమూల్ డెయిరీ కూడా ఇందాపూర్ నుంచే కొన్నదని బీఆర్ నాయుడు చెప్పడం ద్వారా వైసీపీ చేస్తున్న ఆరోపణల గాలిని పూర్తిగా తీసేశారు. అంతే కాదు నందిని డెయిరీని తీసేశారు అని చెబుతున్నది కూడా అవాస్తవమని ఆయన తేల్చేశారు. నందిని డెయిరీ తాము అంత సరఫరా చేయలేమని చెబితేనే ఇందాపూర్ కు టెండర్లు టీటీడీ ఇచ్చిందని ఆయన వివరంగా చెప్పారు. ఇలా ఇందాపూర్ డెయిరీకి రెండు టెండర్లు, సంగం డెయిరీకి ఒకటి మదర్ డెయిరీకి రెండు టెండర్లు ఇచ్చామని అంతా పారదర్శకంగా సాగింది అని ఆయన గట్టిగా చెబుతున్నా లేని పోని ఆరోపణలతో వైసీపీ వితండ వాదం చేస్తోంది అని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. నెయ్యి టెండర్ల ఖరారులో టీటీడీ అన్ని పద్ధతులు చాలా పకడ్బందీగా అమలు చేస్తోంది అయినా కానీ వైసీపీ మాత్రం పనిగట్టుకుని ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తోంది. దీని భావమేంటి అంటే ఎదుటి వారి మీద బురద జల్లే రాజకీయ విన్యాసం అని అంటున్నారు. అందుకే వైసీపీ అడ్డగోలు వాదననను నమ్ముకుంటోందని అసలు వాస్తవాలు ప్రజలకు అర్ధం అయ్యాయని టీడీపీ నేతలు చెబుతున్నారు.