Begin typing your search above and press return to search.

ఎన్ కౌంటర్ లో మహిళా పోలీసులు.. దేశ చరిత్రలోనే ఇది మొదటిది..

ఉత్తరప్రదేశ్ (యూపీ) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

By:  Tupaki Desk   |   24 Sept 2025 4:57 PM IST
ఎన్ కౌంటర్ లో మహిళా పోలీసులు.. దేశ చరిత్రలోనే ఇది మొదటిది..
X

ఉత్తరప్రదేశ్ (యూపీ) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పొరుగున ఉన్న దాయాది దేశం పాకిస్తాన్ సైతం వారి పార్లమెంట్ లో ఆయనను పొగిడిందంటే ఆయన పాలన ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఏ సమస్యకైనా పరిష్కారం కావాలంటే ఆయన వద్ద సిద్ధంగా ఉంటుంది. మత ఘర్షణలు, అల్లర్లు, గుండాలు, రౌడీషీటర్లను శిక్షించడంలో ఆయన మార్కు ఏ సీఎం పాటించలేదంటే అతిశయోక్తి కాదు. గుండాలకు కేంద్రంగా ఉన్న యూపీని గుండాలే లేకుండా చేసిన ఆయన పోకిరీల విషయంలో కూడా కఠినంగా వ్యవహరిస్తుంటారు. ఇక మత ఘర్షణలకు పాల్పడే వారిపట్ల ఆయన చర్యలు మరింత తీవ్రంగా ఉంటాయి. వారి నివాసాలను బుల్డోజర్లతో కూల్చివేయించేస్తాడు. ఇది దేశవ్యాప్తంగా ఆయనను ఎప్పుడూ గుర్తుంచుకుంటుంది.

దేశ చరిత్రలోనే..

ఉత్తరప్రదేశ్ పోలీస్ చరిత్రలోనే అంతెందుకు దేశ పోలీస్ చరిత్రలోనే చరిత్రాత్మక ఘట్టం చోటుచేసుకుంది. దేశంలో మొదటిసారి ఓ మహిళా పోలీసుల బృందం ప్రత్యక్షంగా ఎన్‌కౌంటర్‌లో పాల్గొంది. పాల్గొనడమే కాదు ఏకంగా విజయం కూడా సాధించింది. జితేంద్ర కుమార్ అనే శాటిలైట్‌ దొంగను చాకచక్యంగా అదుపులోకి తీసుకుంది. సీఎం మహిళా పోలీస్ బృంద ధైర్యసాహసాలను కొనియాడారు కూడా..

కాలులో కాల్చిన మహిళా పోలీసులు..

ఘాజియాబాద్‌ లోహియా నగర్‌లో మహిళా పోలీసుల బృందం గస్తీ కాస్తుంది. ఒక వ్యక్తి వారికి అనుమానాస్పదంగా కనిపించాడు. విచారణ కోసం ఆయనను ఆపేందుకు యత్నించింది. సదరు వ్యక్తి కంగారు పడడంతో ఆయన నడిపే స్కూటర్ పై నుంచి కింద పడిపోయాడు. పోలీసులపైకి నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు. సమయస్ఫూర్తితో స్పందించిన మహిళా పోలీసులు ప్రతికాల్పులు జరపడంతో అతను కాలికి బుల్లెట్‌ తగిలింది. నిందితుడి వద్ద నుంచి తుపాకీ, కార్ట్రిడ్జులు, చోరీ చేసిన స్కూటర్‌, ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

మహిళా శక్తి ప్రతిభ

ఈ ఆపరేషన్‌కు మహిళా పోలీస్‌ స్టేషన్‌ హెడ్‌ రీతూ త్యాగీ నాయకత్వం వహించారు. ముగ్గురు మహిళా సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు మహిళా హెడ్‌ కానిస్టేబుళ్లు ఇందులో పాల్గొన్నారు. ఇప్పటి వరకు మహిళా పోలీసులు ఎన్‌కౌంటర్లలో భాగస్వాములు మాత్రమే అయ్యారు. కానీ పూర్తి స్థాయిలో ఒక ఎన్‌కౌంటర్ ఆపరేషన్‌ను నిర్వహించడం ఇదే తొలిసారి. ఇది కేవలం ఒక విజయవంతమైన ఆపరేషన్ మాత్రమే కాదు.. పోలీసింగ్‌లో లింగ సమానత్వానికి మహిళా సాధికారతకు నిదర్శనం కూడా.

యూపీ ప్రభుత్వ వ్యూహం

2017లో యోగి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో నేరస్తులపై కఠిన చర్యలు కొనసాగుతున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు 10,713 ఎన్‌కౌంటర్లు జరిగాయి. వీటిలో 63 మంది క్రిమినల్స్ మృతి చెందగా, 1,708 మంది గాయపడ్డారు. సుమారు 6 వేల మందికి పైగా అరెస్టు అయ్యారు. ఈ ఆపరేషన్లలో 401 మంది పోలీసులు గాయపడ్డారు, ఒకరు మరణించారు.

దేశ చరిత్రలోనే ఇదొక మైలురాయి..

ఘాజియాబాద్ మహిళా పోలీసుల ఎన్‌కౌంటర్ దేశ పోలీసింగ్ చరిత్రలో ఒక మైలురాయి. ఇది కేవలం నేరస్థుడి అదుపు మాత్రమే కాదు.. సాంప్రదాయ వివక్షను అధిగమించిన ఒక కొత్త అధ్యాయంగా ప్రముఖులు చెప్పుకుంటున్నారు. ధైర్యం, సమర్థత, నిబద్ధత ఉన్న మహిళలు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారని తెలుస్తోంది.