మంచి తల్లిని కాదా? అన్న సీఈవో పోస్టుకు నెటిజన్ల రియాక్షన్ ఇదే
వేదనతో ఆమె పెట్టిన పోస్టుకు.. పెద్ద ఎత్తున సానుకూలంగా స్పందిస్తూ తమ రియాక్షన్ తో ఆమెను ఓదార్చటం గమనార్హం
By: Tupaki Desk | 18 April 2024 1:00 PM ISTమిగిలిన మాధ్యమాల సంగతి ఎలా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడేం జరుగుతుందో? ఎవరెలా వ్యవహరిస్తారో? ఒక పట్టాన అంచనా వేయలేని పరిస్థితి. కొన్ని నెగిటివ్ అంశాలకు సైతం పాజిటివ్ గా రియాక్టు కావటం కనిపిస్తుంది. అయితే.. చాలా వరకు అన్ని అంశాల్ని పరిగణలోకి తీసుకొని మాత్రమే రియాక్టు అవుతున్నట్లుగా కనిపిస్తుంటుంది. తాజాగా అలాంటిదే చోటు చేసుకుంది. సౌందర్య ఉత్పత్తుల సంస్థగా పేరున్న మామాఎర్త్ సీఈవోగా వ్యవహరించే గజల్ అలఘ్ పెట్టిన పోస్టుకు నెటిజన్ల నుంచి పాజిటివ్ రియాక్షన్ వచ్చింది.
వేదనతో ఆమె పెట్టిన పోస్టుకు.. పెద్ద ఎత్తున సానుకూలంగా స్పందిస్తూ తమ రియాక్షన్ తో ఆమెను ఓదార్చటం గమనార్హం. ‘‘నేను మంచి తల్లిని కానా?’’ అంటూ ఆమె పెట్టిన పోస్టు అందరిని ఆకర్షిస్తోంది. ఇంతకూ విషయం ఏమంటే.. ఆమె తనకున్న పని ఒత్తిళ్ల కారణంగా.. తన కొడుకు ను తొలి రోజు స్కూల్ కు తీసుకెళ్లే ఛాన్సును మిస్ చేసుకున్నారు. దీనిపై ఆమె తన ఆవేదనను వ్యక్తం చేశారు. అదే సమయంలో తనలో మెదిలిన సందేహాన్ని పంచుకున్నారు.
తన కొడుకును మొదటి రోజు స్కూల్ కు తీసుకెళ్లేందుకు కుదర్లేదని.. ఈ సందర్భంగా తన మనసులో తాను మంచి తల్లిని కానా? అన్న సందేహం వ్యక్తమైందని.. ఆ టైంలో తాను చాలా ఏడ్చినట్లుగా పేర్కొన్నారు. ‘‘ఏడ్చాను.. బాధ పడ్డాను. ధైర్యం తెచ్చుకొని వాళ్ల నానమ్మతో స్కూల్ కు పంపా. కొన్నిసార్లు మీరెంత కోరుకున్నా సెలవు తీసుకోవటం కుదరదు. తొలిసారి స్కూల్ కు వెళ్లే నా కొడుకులోని ఉత్సాహం.. చిరునవ్వు..కన్నీళ్లు.. స్కూల్లోకి వెళ్లిన తర్వాత అతడి ఫీలింగ్స్.. క్లాస్ రూంలో వాడి టెన్షన్ లాంటివేమీ చూడలేకపోయా’’ అంటూ ఎమోషనల్ పోస్టు పెట్టారు.
తన అనుభవాల్ని ఆమె లింక్డిన్ లో షేర్ చేయగా.. దానికి పాజిటివ్ స్పందన వచ్చింది. ఈ పోస్టులోనే ఆమె ఉమ్మడి కుటుంబ ప్రాధాన్యాన్ని వివరిస్తూ ఆసక్తికర అంశాల్ని షేర్ చేశారు. ఐదేళ్ల క్రితం తాను.. తన భర్త.. తన కొడుకు.. అత్త కలిసి ఉమ్మడి కుటుంబంలో ఉండాలని డిసైడ్ అయ్యామని.. ఇప్పుడు నాలుగు తరాల వాళ్లమంతా ఒకే ఇంట్లో ఉంటున్నట్లుగా పేర్కొన్నారు.
జాబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇలా సాధ్యం కాకపోవచ్చని.. కాకుంటే సొంతోళ్లే కాకున్నా.. దగ్గరి బంధువులు.. అర్థం చేసుకునే స్నేహితులైనా కలిసి ఉండటం బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రతి విషయంలోనూ లాభ నష్టాలు ఉంటాయని.. అయితే ఉమ్మడి కుటుంబం అనేది పిల్లలకు అద్భుతమైన వాతావరణంగా పేర్కొన్నారు. తల్లులు కెరీర్ లక్ష్యాల్ని పక్కన పెట్టకుండా ప్రేమ.. సెక్యూరిటీని అందిస్తుందంటూ ఉమ్మడి కుటుంబం గురించి తన సుదీర్ఘ పోస్టులో వివరించారు.
తన పోస్టుతో పాటు.. ఆమె మరో ప్రశ్నను సంధించారు. మీరు వర్కింగ్ పేరెంట్ అయితే.. మీ జీవిత భాగస్వామి కాకుండా మీకున్న మరో సపోర్టు సిస్టమ్ గురించి షేర్ చేయాలని కోరారు. దీనికి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. అదే సమయంలో పలువురు ఆమెను.. మీరు వండర్ ఫుల్ మదర్ అంటూ కామెంట్లు చేశారు.
