Begin typing your search above and press return to search.

ఆ ఇద్దరు ఒక్కటయ్యారా? గంటా, ఆవంతి మధ్య ఏం జరిగింది!

కొద్దిరోజుల క్రితం వైసీపీకి రాజీనామా చేసిన అవంతి శ్రీనివాసరావు కొంతకాలంగా తటస్ఘ వైఖరి అవలంబిస్తున్నారు.

By:  Tupaki Desk   |   6 Dec 2025 1:44 PM IST
ఆ ఇద్దరు ఒక్కటయ్యారా? గంటా, ఆవంతి మధ్య ఏం జరిగింది!
X

ఒకప్పటి గురుశిష్యులు, ఆ తర్వాత స్నేహితులు, గత ఎన్నికల్లో ప్రత్యర్థులు అయిన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనవాసరావు అలియాస్ అవంతి శ్రీనివాస్ మధ్య సంధి కుదిరిందా? అన్న చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో భీమిలి పరస్పరం తలపడిన ఈ ఇద్దరు నేతలు ప్రస్తుతం చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతుండటం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. గంటా పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చిన అవంతి శ్రీనివాసరావు.. కాలక్రమంలో ఆయనకు రాజకీయ ప్రత్యర్థిగా ఎదిగారు. అయితే గత ఎన్నికల్లో ఓటమి తర్వాత అవంతి కొంతకాలం పాలిటిక్స్ కు దూరంగా ఉంటూ వస్తున్నా.. తాజాగా మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కలిసిమెలిసి తిరుగుతుండటం రాజకీయ వర్గాల దృష్టిని ఆకర్షిస్తోంది.

కొద్దిరోజుల క్రితం వైసీపీకి రాజీనామా చేసిన అవంతి శ్రీనివాసరావు కొంతకాలంగా తటస్ఘ వైఖరి అవలంబిస్తున్నారు. టీడీపీలోకి వచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతున్నా, ఆ పార్టీ నుంచి ఇంతవరకు గ్రీన్ సిగ్నల్ లభించలేదని చెబుతున్నారు. ఇదే సమయంలో అవంతి కుమార్తె జీవీఎంసీ ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించడం అప్పట్లో విస్తృత చర్చకు దారితీసింది. అవంతికి లైన్ క్లియర్ అయిందనే టాక్ వినిపించింది. కానీ, ఇంతవరకు అవంతికి టీడీపీ తలుపులు తెరవకపోవడంతో ఆయన రాజకీయ ప్రయాణం సందిగ్ధంలో పడిందని అంటున్నారు.

ఈ పరిస్థితుల్లో ఎటూ చెందక ఒంటరిగా ఉండిపోయిన అవంతి.. ఇటీవల కాలంలో తన గురువు ఎమ్మెల్యే గంటాకు దగ్గరయ్యారన్న ప్రచారం ఊపందుకుంది. దీనికి బలం చేకూరుస్తూ గంటా పుట్టినరోజు వేడుకలకు అవంతి హాజరుకావడం అనేక సందేహాలకు తావిస్తోంది. విశాఖ, హైదరాబాద్ ల్లో గంటా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించగా, ఈ రెండు కార్యక్రమాలకు హాజరైన అవంతి శ్రీనివాస్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. గంటా పుట్టిన రోజు వేడుకలకు సినీ, రాజకీయ ప్రముఖులు ఎందరో వచ్చినా, అవంతి రావడమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆయన రాకపై పెద్ద చర్చకు కారణమైంది. కాపు సామాజికవర్గానికి చెందిన ఈ ఇద్దరు గత రెండు దశాబ్దాలుగా కలిసిమెలిసి రాజకీయం చేశారు.

ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి విశాఖ వలస వచ్చి ఇక్కడే స్థిరపడిన ఈ ఇద్దరు నేతలు.. గత ఎన్నికల్లో పరస్పరం తలపడ్డారు. అప్పట్లో ఈ ఇద్దరి మధ్య పోరును గురుశిష్యుల యుద్ధంగా అంతా ఆసక్తితో గమనించారు. విశాఖలో వ్యాపారం చేసుకుంటూ 1999లో రాజకీయాల్లోకి వచ్చిన గంటా.. అప్పట్లో జరగిన సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి నుంచి టీడీపీ ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2004లో రాష్ట్రంలో కాంగ్రెస్ గాలివీచినా, చోడవరం ఎమ్మెల్యేగా పోటీ చేసి అఖండ విజయాన్ని దక్కించుకున్నారు. ఇలా ఇప్పటివరకు పోటి చేసిన ప్రతి ఎన్నికలోనూ విజయలక్ష్మి ఆయననే వరించింది. ఈ క్రమంలో విశాఖ రాజకీయాలతోపాటు ఉత్తరాంధ్ర పాలిటిక్స్ ను శాసించే స్థితికి చేరుకున్నారు గంటా.. దీంతో ఆయనకు ఎందరో శిష్యులు, అనుచరులు తయారయ్యారు. ఈ జాబితాలో తొలిపేరు రాయాల్సివస్తే అవంతిదే రాయాలని అంటారు.

2009లో ప్రజారాజ్యం పార్టీలోకి జంప్ చేసిన గంటా.. అప్పట్లో తన ప్రియశిష్యుడైన అవంతిని రాజకీయాల్లోకి తీసుకువచ్చి ఎమ్మెల్యే చేశారు. ఆ తర్వాత ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరగా, 2014 ఎన్నికల్లో తిరిగి టీడీపీలోకి వచ్చారు. అయితే 2019 ఎన్నికల ముందు గంటాకు ఝలక్ ఇచ్చిన అవంతి వైసీపీలో చేరారు. ఆ తర్వాత మంత్రి అయ్యారు. మూడేళ్లు పదవిలో కొనసాగిన అవంతి మాజీ సీఎం జగన్ చేపట్టిన ప్రక్షాళనలో పదవి కోల్పోయారు. అయితే అప్పట్లో ప్రభుత్వం అధికారంలో ఉండటంతో 2024 ఎన్నికల వరకు వైసీపీలోనే కొనసాగారు. ఎన్నికల్లో అవంతికి మరోసారి భీమిలి టికెట్ ఇవ్వడంతో గంటాపై పోటీ చేశారు. ఈ ఇద్దరి మధ్య జరిగిన రాజకీయ యుద్ధంలో గంటాదే పైచేయి అయింది. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన గంటా.. తన శిష్యుడిపై ప్రతీకారం తీర్చుకున్నారు.

ఇక ప్రభుత్వం మారిన తర్వాత ఈ ఇద్దరి మధ్య సంబంధాలు మళ్లీ విచ్చుకున్నాయని అంటున్నారు. కొంతకాలంగా తన గురువు గంటాతో సత్సంబంధాల కోసం అవంతి ప్రయత్నిస్తున్నట్లు విశాఖ పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైసీపీకి రాజీనామా చేసిన అవంతి తిరిగి టీడీపీ గూటికి చేరాలని ఉవ్విళ్లూరుతున్నారని అంటున్నారు. ప్రస్తుతం భీమిలిలో గంటా ప్రాతినిధ్యం వహిస్తున్నా, వచ్చే ఎన్నికల నాటికి భీమిలి రెండు నియోజకవర్గాలు అయ్యే పరిస్థితి ఉందని అంచనా వేస్తున్నారు. ఇలా కొత్తగా ఆవిర్భవించే సీటు కోసం ఇప్పటి నుంచే అవంతి కర్ఛీఫ్ పట్టుకుని కూర్చున్నారని టాక్ వినిపిస్తోంది. అందుకే గంటా వెనకాలే అవంతి తిరుగుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.