Begin typing your search above and press return to search.

ఆ దేశంలో వారానికి 4 రోజులే పని.. ఇండియాలోనూ మొదలైన డిమాండ్

జర్మనీలో ఈ విధానం విజయవంతం కావడంతో, ఇప్పుడు భారతదేశంలో కూడా వారానికి 4 పనిదినాలను అమలు చేయాలనే డిమాండ్ ఊపందుకుంది.

By:  Tupaki Desk   |   1 Jun 2025 6:00 AM IST
ఆ దేశంలో వారానికి 4 రోజులే పని.. ఇండియాలోనూ మొదలైన డిమాండ్
X

ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల పనితీరు, ఉత్పాదకతపై చర్చ జరుగుతున్న తరుణంలో జర్మనీ నుంచి ఒక ఆస0క్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. అక్కడ దాదాపు 70 శాతం కంపెనీలు వారానికి నాలుగు రోజులు మాత్రమే పనిచేసే కొత్త విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఇది కేవలం ఒక ప్రయోగం కాదు.. ఈ విధానం ద్వారా కంపెనీలు ఊహించని విజయాలను సాధించాయి.

వారానికి నాలుగు రోజుల పని విధానం వల్ల తమ ఉద్యోగుల్లో ఉత్పాదకత (Productivity) గణనీయంగా పెరిగిందని, నిర్దేశించిన డెడ్‌లైన్‌ల కంటే ముందే పనులు పూర్తవుతున్నాయని అధిక సంఖ్యలో కంపెనీలు గుర్తించాయి. ఉద్యోగులకు ఎక్కువ విశ్రాంతి లభించడం వల్ల వారి మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడి, పనిలో మరింత చురుకుగా పాల్గొంటున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో జర్మనీలోని అన్ని కంపెనీల్లో వారానికి 4 పనిదినాలను అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇది ఉద్యోగుల పని-జీవిత సమతుల్యత (Work-Life Balance)ను మెరుగుపరుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

భారత్‌లోనూ డిమాండ్

జర్మనీలో ఈ విధానం విజయవంతం కావడంతో, ఇప్పుడు భారతదేశంలో కూడా వారానికి 4 పనిదినాలను అమలు చేయాలనే డిమాండ్ ఊపందుకుంది. దేశంలోని పలు రంగాలకు చెందిన ఉద్యోగులు, నిపుణులు ఈ కొత్త విధానం గురించి చర్చించడం మొదలుపెట్టారు. ఇది ఉద్యోగులకు మేలు చేయడమే కాకుండా, కంపెనీలకు కూడా దీర్ఘకాలంలో లాభదాయకంగా ఉంటుందని వారు వాదిస్తున్నారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు, కంపెనీలు ఈ 'నాలుగు రోజుల పని వారం' విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నాయి. జర్మనీ విజయం ఇతర దేశాలకు కూడా ఈ విధానాన్ని అమలు చేయడానికి స్ఫూర్తినిస్తుంది. భవిష్యత్తులో మన దేశంలో కూడా ఉద్యోగులు వారానికి నాలుగు రోజులు మాత్రమే పనిచేసే రోజు వస్తుందేమో చూడాలి.