Begin typing your search above and press return to search.

జర్మన్ యువతిపై హైదరాబాద్ లో దారుణం.. అసలేం జరిగింది?

హైదరాబాద్ నగర శివార్లలోని పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది.

By:  Tupaki Desk   |   1 April 2025 3:32 PM IST
జర్మన్ యువతిపై హైదరాబాద్ లో దారుణం.. అసలేం జరిగింది?
X

సోమవారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్తుండగా.. 25 ఏళ్ల జర్మన్ యువతిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారం చేసిన ఘటన తాజాగా తెరపైకి వచ్చింది! ఈ ఘటన రాచకొండ పోలీస్ కమీషనరేట్ లోని పహాడిషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మామిడిపల్లిలో జరిగింది. ఈ సమయంలో పోలీసులు ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

అవును... హైదరాబాద్ నగర శివార్లలోని పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. తన స్నేహితుడిని కలిసేందుకు జర్మనీ నుంచి హైదరాబాద్ వచ్చి, తిరిగి విమానాశ్రయానికి వెళ్తున్న యువతిపై కారు డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు! అనంతరం ఆమె 100కు డయల్ చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

వివరాళ్లోకి వెళ్తే... హైదరాబాద్ కు చెందిన యువకుడు ఒకరు జర్మనీలో చదువుకున్నాడు. ఈ సమయంలో అతడిని కలిసేందుకు వారం రోజుల క్రితం జర్మనీకి చెందిన యువతి హైదరాబాద్ కు వచ్చింది. ఈ క్రమంలో సోమవారం స్నేహితులను పలు ప్రాంతాలు సందర్శించి, సరదాగా గడిపి.. ఒక్కొక్కరినీ వారి వారి గమ్యస్థానాల వద్ద డ్రాప్ చేసింది.

అనంతరం.. ఎయిర్ పోర్టుకు వెళ్తుండగా.. కారు డ్రైవర్ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు! అనంతరం ఆమెను మామిడిపల్లి వద్దే కారు దింపి అక్కడ నుంచి పారిపోయాడు. ఈ సమయంలో బాధిత యువతి 100 కు డయల్ చేయడం ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో... వెంటనే స్పందించిన పోలీసులు రంగంలోకి దిగారు.

ఈ సమయంలో ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే బాధిత యువతి చెప్పిన ఆధారాల ప్రకారం ఓ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని వారు వెల్లడించారు. మరోపక్క వైద్య పరీక్షల నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించారు!