కరోనా పేరుతో పిల్లలకు నరకం.. మూడేళ్ల గదిలోనే చిన్నారులను బంధించిన తల్లిదండ్రులు
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్‌లు విధించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 3 May 2025 9:28 PM ISTకరోనా మహమ్మారి ఎంతో మంచి జీవితాలను అతలాకుతలం చేసింది. లాక్‌డౌన్ సమయంలో చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. కానీ జర్మనీకి చెందిన ఒక కుటుంబం మాత్రం ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత కూడా తమ పిల్లలకు నరకం చూపించింది. స్పేయిన్‌లో నివాసం ఉంటున్న ఆ దంపతులు ఏకంగా తమ ముగ్గురు పిల్లలను మూడేళ్ల పాటు ఒక గదిలో బంధించి ఉంచారు. ఇందులో 8 ఏళ్ల కవలలు, 10 ఏళ్ల వయసున్న మరో పిల్లవాడు ఉన్నారు. ఈ దారుణమైన విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పోలీసులు వెంటనే స్పందించారు. పిల్లలను రక్షించి, వారి తల్లిదండ్రుల మీద మానసిక వేధింపుల కేసు నమోదు చేశారు. ఈ ఘటన స్పేయిన్ లో తీవ్ర కలకలం రేపుతోంది.
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్‌లు విధించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. అయితే, చాలా దేశాలు ఆంక్షలను ఎత్తివేశాయి. ప్రస్తుతం అన్ని దేశాల్లో ప్రజల జీవితం సాధారణ స్థితికి వస్తోంది. కానీ ఈ జర్మన్ దంపతులు మాత్రం తమ పిల్లలను మాత్రం ఆ నిర్బంధం నుంచి విముక్తి చేయలేదు. ఏకంగా మూడు సంవత్సరాలు వారిని ఒక గదిలో బంధించి వారి బాల్యాన్ని చీకటిమయం చేశారు.
పోలీసులకు సమాచారం ఎలా అందిందనే విషయం మీద స్పష్టత లేదు. కానీ, పిల్లలు దీర్ఘకాలంగా గదిలోనే ఉంటున్నారని, వారి ఆరోగ్యం క్షీణిస్తోందని తెలిసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. వారు ఆ ఇంటికి వెళ్లి పిల్లలను రక్షించారు. పిల్లల పరిస్థితి చూసిన పోలీసుల గుండెలు తరుక్కుపోయాయి. వారి శరీరంపై బలహీనత స్పష్టంగా కనిపించింది. మానసికంగా కూడా వారు తీవ్రమైన ఒత్తిడికి గురై ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
తల్లిదండ్రులపై పోలీసులు మానసిక వేధింపుల కేసు నమోదు చేశారు. పిల్లలను ఎందుకు బంధించారనే విషయంపై వారు ఇంకా స్పష్టమైన కారణం చెప్పలేదు. అయితే, కరోనా భయం లేదా ఇతర మానసిక సమస్యల కారణంగా వారు ఇలా చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పిల్లలను సంరక్షణ కేంద్రానికి తరలించి వారికి వైద్య సహాయం అందిస్తున్నారు. వారి మానసిక స్థితిని మెరుగుపరచడానికి కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నారు.
ఈ ఘటన స్థానిక సమాజంలో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. పిల్లలను ఇంత దారుణంగా బంధించిన తల్లిదండ్రులను కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పిల్లల హక్కుల కోసం పోరాడే సంస్థలు కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించాయి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
