Begin typing your search above and press return to search.

అధ్యక్షుడిగా నువ్వు వద్దు పో.. స్టార్‌ హీరో డిమాండ్‌!

సర్వత్రా ప్రపంచం దృష్టిని ఆకరిస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది నవంబర్‌ లో జరగనున్నాయి

By:  Tupaki Desk   |   11 July 2024 9:45 AM GMT
అధ్యక్షుడిగా నువ్వు వద్దు పో.. స్టార్‌ హీరో డిమాండ్‌!
X

సర్వత్రా ప్రపంచం దృష్టిని ఆకరిస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది నవంబర్‌ లో జరగనున్నాయి. డెమోక్రటిక్‌ పార్టీ తరఫున ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, రిపబ్లికన్‌ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తలపడుతున్నారు. వీరిద్దరూ ఉధృత ప్రచారం నిర్వహిస్తున్నారు.

కాగా జో బైడెన్‌ అభ్యర్థిత్వంపై సొంత పార్టీలోనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయనపై రోజురోజుకీ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బైడెన్‌ వయసు ఇప్పుడు 81 ఏళ్లు. ఇంత పెద్ద వయసులో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తిగా ఇప్పటికే ఆయన రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు అమెరికా అధ్యక్ష పదవిని అధిరోహించినవారి సగటు వయసు 45 ఏళ్లే కావడం గమనార్హం.

ఈ నేపథ్యంలోనే వృద్ధాప్య సమస్యలు, ఇతర అనారోగ్యం కారణంగా జో బైడెన్‌ అంత చురుగ్గా వ్యవహరించలేకపోతున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను ఈసారి పోటీ నుంచి తప్పుకోవాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ డిమాండ్లు చేసేది కూడా బయట వ్యక్తులు కాదు. సొంత పార్టీ డెమోక్రాట్లే బైడెన్‌ ఈసారి పోటీ నుంచి తప్పుకుని వేరేవారికి అవకాశం కల్పించాలని కోరుతున్నారు.

ఇప్పటికే డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన సెనేటర్‌ నాన్సీ పెలోసీ.. బైడెన్‌ ను ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని కోరారు. డెమోక్రట్ల తరఫున వేరే వ్యక్తిని బరిలోకి దింపాలని సూచించారు.

ఇప్పుడు ఈ కోవలో ప్రముఖ దర్శకుడు, హీరో అయిన జార్జ్‌ క్లూనీ చేరారు. ఆయన ప్రస్తుతం డెమోక్రటిక్‌ పార్టీకి సానుభూతిపరుడిగా ఉన్నారు. ఆ పార్టీకి అధ్యక్ష ఎన్నికల్లో భారీ ఎత్తున విరాళాలు సేకరించి పెడుతున్నారు.

ఈ నేపథ్యంలో రాబోయే అధ్యక్ష ఎన్నికల నుంచి బైడెన్‌ తప్పుకోవాలని జార్జ్‌ క్లూనీ తన డిమాండ్‌ ను వినిపించారు. ఆయన పోటీ చేస్తే డెమోక్రటిక్‌ పార్టీ గెలవడం కష్టమని కుండబద్దలు కొట్టారు.

వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ గెలవకపోతే పార్లమెంటులో ప్రతినిధుల సభతోపాటు ఎగువ సభ అయిన సెనేట్‌ లోనూ డెమోక్రాట్లు మెజారిటీని కోల్పోతారని జార్జ్‌ క్లూనీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఈ మేరకు ఆయన బైడెన్‌ ఎన్నికల నుంచి తప్పుకోవాలని కోరుతూ రాసిన లేఖను ప్రముఖ దినపత్రిక న్యూయార్క్‌ టైమ్స్‌ ప్రచురించింది.

క్లూనీ తను రాసిన లేఖలో.. తనకు బైడెన్‌ మంచి స్నేహితుడిని, ఆయనను తాను నమ్ముతానని, ఆయన గెలుపు కోసం గతంలో తానెంతో కృషి చేశానన్నారు. అయితే అప్పటి బైడెన్‌ కు, ఇప్పటికి బైడెన్‌ కు తేడా ఉందని జార్జ్‌ క్లూనీ తెలిపారు. విరాళాల సేకరణ సందర్భంగా మూడు వారాల క్రితం బైడెన్‌ ను కలిశానని... అయితే ఆయనలో గతంతో పోల్చితే చాలా మార్పులు వచ్చాయన్నారు. బైడెన్‌ లో తనకు ఎలాంటి ఉత్సాహం కనిపించలేదన్నారు.

ఈ క్రమంలోనే బైడెన్‌ ఇటీవల ట్రంప్‌ తో జరిగిన డిబేట్‌ లోనూ విఫలమయ్యాడని జార్జ్‌ క్లూనీ గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో బైడెన్‌ ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని కోరారు.

వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌ ను తప్పుకోవాలని డిమాండ్‌ వినిపిస్తున్న జార్జ్‌ క్లూనీ వాస్తవానికి ఆయనకు అత్యంత సన్నిహితుడు. బైడెన్‌ తో సుదీర్ఘ కాలం నుంచి ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అమెరికా సినీ రంగం.. హాలీవుడ్‌ నుంచి డెమోక్రటిక్‌ పార్టీకి గట్టి మద్దతును అందిస్తున్న ఎలైట్‌ గ్రూపులో జార్జ్‌ క్లూనీ కూడా ఉండటం విశేషం.

ఇలా ఒకప్పుడు బైడెన్‌ కు గట్టి మద్దతుగా నిలబడ్డవారే ఇప్పుడు ఆయనను ఎన్నికల బరిలో తప్పుకోవాలని కోరడం హాట్‌ టాపిక్‌ గా మారింది. ఆయన తప్పుకోవాలనేది తన ఒక్కడి అభిప్రాయమే కాదని.. డెమోక్రటిక్‌ పార్టీలో ప్రతి ఒక్కరూ, ప్రతి ఎంపీ, గవర్నర్‌ ఇదే కోరుకుంటున్నారని జార్జ్‌ క్లూనీ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో బైడెన్‌ తనంతట తానుగా పోటీ నుంచి తప్పుకోవాలన్నారు.

బైడెన్‌ స్థానంలో అధ్యక్ష స్థానంలో పోటీ చేసే అభ్యర్థి ఎవరో ఆగస్టులో జరిగే డెమొక్రాట్‌ మీటింగ్‌ లో వైస్‌ ప్రెసిడెంట్‌ కమలా హ్యారిస్, మేరీల్యాండ్‌ గవర్నర్‌ వెస్‌ మూర్, తదితర నాయకులు నిర్ణయించాలని జార్జ్‌ క్లూనీ సూచించారు.

ఇంత జరుగుతున్నా... సొంత పార్టీ నేతలే వద్దు పొమ్మంటున్నా జో బైడెన్‌ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాను అధ్యక్ష ఎన్నికల్లో తప్పకుండా పోటీచేస్తానని.. తప్పుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరింత ఆసక్తిని రేపుతున్నాయి.